Saturday 15 March 2014

సినిమాల్లోంచి సమాజంలోకి - 2


'ఫ్యూడల్ భావజాలం మన ఆలోచనా విధానం నుండి డిలీట్ అయ్యిందా? లేదా?' అనేది ఓ ధర్మసందేహం. ఈ ప్రస్తావన 'సినిమాల్లోంచి సమాజంలోకి' మొదటి భాగంలో వచ్చింది. ఈ ప్రశ్నకి సమాధానం కోసం విజయవంతమైన రెండు తెలుగు సినిమాల గూర్చి మాట్లాడుకుందాం.

సుమారు ముప్పైయ్యేళ్ళ క్రితం 'బొబ్బిలి బ్రహ్మన్న' అనే సినిమా వచ్చింది. కృష్ణంరాజు అనే నటుడు హీరో. ఒక ఊళ్ళో బ్రహ్మన్న అనేవాడు ఉంటాడు. అతగాడిది అదేదో బొబ్బిలి వంశంట! గుండెల నిండా గాలి పీల్చుకుని, కళ్ళు మిటకరించి.. ఊళ్ళో జరిగే నేరాలకి ఎడాపెడా తీర్పులు తనదైన స్టైల్లో చెప్పేస్తుంటాడు. అవన్నీ హర్యానాలో జరుగుతున్న ఖాప్ పంచాయితీలు టైపు తీర్పులు. బ్రహ్మన్న ఊళ్ళో పోలీసు, న్యాయ వ్యవస్థలు ఉండవు, సర్వం బ్రహ్మన్న బాబే! వాస్తవానికి ప్రజలు ఈ సినిమాని నిర్ద్వందంగా తిరస్కరించాలి, కానీ అలా జరగలేదు.

ఇరవైయ్యేళ్ళ క్రితం 'పెదరాయుడు' అని ఇంకో సినిమా వచ్చింది. ఈ కథ కూడా ఖాప్ పంచాయితీ కథే. ఊళ్ళో ఓ అగ్రకుల పెద్దమనిషి స్టైలుగా చుట్ట పీలుస్తూ కాలు మీద కాలు వేసుకుని తీర్పులు చెప్పేస్తుంటాడు. సాంఘిక బహిష్కరణ (ఇట్లాంటి తీర్పు చట్టరీత్యా నేరం) వంటి తీర్పులు కూడా ఇచ్చేస్తుంటాడు. పంచెకట్టు, మీసం మెలెయ్యడం, బంగారు కంకణం.. ఆ పాత్ర ఆహార్యం కూడా జుగుప్సాకరంగా ఉంటుంది. పైగా అమ్మోరికి మేకని బలిస్తున్నట్లు బేక్ గ్రౌండ్ మ్యూజిక్కొకటి. ఫ్యూడల్ భావజాలాన్ని నిస్సిగ్గుగా ప్రమోట్ చేసిన ఈ సినిమా కూడా బాగా ఆడింది.

అనగనగా ఒకానొప్పుడు ప్రజలు తమకన్నా పెద్ద కులాల వారిని గౌరవించేవాళ్ళట, తక్కువ కులాల వారిపట్ల తేలికభావంతో ఉండేవాళ్ళట. అదంతా చరిత్ర కదా! కాదా? మరి ఈ రెండు సినిమాలు విజయవంతం అవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? సమాజంలో సామాన్య ప్రజానీకంలో ఫ్యూడల్ వ్యవస్థ పట్ల వ్యతిరేకత లేదు అనా? ప్రేక్షకుల్లో చాలామంది అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సమర్దిస్తున్నారు అనా? అందుకే - 'పెద్ద కులం పెద్దమనిషి, పాపం తీర్పులు చెబుతూ ఎన్ని కష్టాలు పడుతున్నాడో కదా!' అంటూ ఆ ఫ్యూడల్ మనిషితో empathize అయ్యారా?

మన తెలుగు జాతికి సాహిత్య స్పృహ తక్కువ, కాబట్టి సామాజిక స్పృహ కూడా అదే రేంజ్ లో ఉండటం సహజం. కాబట్టే.. కేవలం వారసత్వంగా వచ్చిన ఆస్తి, అంతస్తు, హోదా తప్ప ఇంకే అర్హతా లేని (ఒక్కరోజు కూడా శారీరక / మేధోశ్రమ చెయ్యని / చెయ్యలేని) అడ్డగాడిద లాంటి హీరో (దేవదాసు, ప్రేమనగర్, దసరా బుల్లోడు) పడే 'ప్రేమ' అనే మూలిగే సూడిపంది ప్రసూతి నొప్పుల బాధని ఆనందంగా, ఆరాధనగా చూస్తుండిపోతాం. ఎంతైనా పెద్దకులంవాడు, డబ్బున్నవాడు, కష్టం ఎరుగని సున్నితమైనవాడు కదా!

అందుకే - (నాకు తెలిసిన) చాలామంది అగ్రకులస్తులకి కారంచేడు, చుండూరు హత్యాకాండ చాలా సహజమైనదిగా కనిపించింది. చుండూరులో అగ్రకులస్తులు తమ ఆడపిల్లల్ని దళిత యువకులు ఇబ్బంది పెడుతున్నారని, వారి కుటుంబాల్ని వెంటాడి, వేటాడి నరికి చంపారు. శవాల్ని గోనె సంచుల్లో కుక్కి కాలవలోకి విసిరేశారు. 'మన ఆడపిల్లల జోలికోచ్చిన అంటరాని కులం వాళ్లకి ఆ మాత్రం బుద్ధి చెప్పకపోతే ధర్మం నాలుగు పాదాల మీద నడవద్దూ!' అని వారి వాదన. ఈ వాదన దళితులు కానివారికి నచ్చింది (బయటకి మాత్రం అందరూ తీవ్రంగా ఖండించారు, అది వేరే సంగతి).

ప్రజల ఆదరణ పొందిన సినిమాల నుండి, సమాజ ఆలోచనా విధానాన్ని అంచనా వేస్తున్నాను. ఈ పధ్ధతిలో ఉన్న పరిమితుల గూర్చి నాకు స్పష్టమైన అవగాహన ఉంది. అందువల్ల నేను రాసిన విషయాలు జెనరలైజ్ చెయ్యరాదు. సమాజంలో అప్పుడూ, ఇప్పుడూ కూడా అన్నిరకాల మనుషులు ఎన్నోరకాల ఆలోచనా ధోరణిని కలిగుంటారు. అయితే - బూజుపట్టిన భావజాలంతో వచ్చిన సినిమాలు విజయవంతం అయ్యాయి కాబట్టి, ఆ ధోరణిని సమర్ధించేవారు (కొందరైనా) మనమధ్యన ఉన్నారని (వీళ్ళు మనకి ఎంత నచ్చకపోయినా) చెప్పడం మాత్రమే నా లిమిటెడ్ పాయింట్.

(picture courtesy : Google)

31 comments:

  1. మీకలం పదునెక్కుతోంది.

    మీరన్నది నిజమే అయ్యుండొచ్చు. మరి ఇదే లాజిక్కుని God Father చినిమాకికూడా వర్తింపజేసి, ప్రజలకు మాఫియా డానుల వ్యవహారాలు నచ్చుతున్నాయనిచెప్పొచ్చా? ఎర్రసైన్యం, చీమలదండులాంటి ఎర్రసినిమాల గురించో? నా ఉద్దేశ్యంలో వీటన్నింటిలోనూ theme ఒకటే. ప్రభుత్వపు సాగతీతన్యాయంతో (long arm of the law) సంబంధంలేకుండా quick justiceని జనాలు పొందడం.

    ReplyDelete
    Replies
    1. అవును. ఒప్పుకుంటున్నాను. మీరు చెప్పింది కూడా నిజమే అయ్యుండొచ్చు.

      Delete
  2. రమణ గారు, జనాలకి ఈ సినిమాలు నచ్చుతున్నాయి ఎందుకంటె వాళ్లు మెయిన్ కారెక్టర్ ఐన హీరొ లొ తమను తాము చూసుకుంటారు. అందరి పైన పెత్తనం చెలాయించె వూరి పెద్దమనిషి, ప్రేమే జీవిత పరమావధి అని భావించె హీరోలు జనాలకి నచ్చుతారు ఎందుకంటె వాళ్లు
    ప్రతి రోజు మాములు జనాల లాగ కష్టపడక్కర్లెదుగా, సంపాదించిన లేకపొయిన, ఖరీదైన బట్టలు, బంగారం, ఫారిన్ లొకేషన్స్ ఉంటాయిగ. అలా అని జనాలు అలా అయిపొవాలి అని అనుకొవట్లేదు, వాళ్లకి తెలుసు అంతొ ఇంతొ కష్టపడందె ఏది రాదని. కనీసం 3 గంటల పాటు అలాంటి ఫాంటసీ లొ బ్రతకడం తప్పు కాదుగ అని ఇలాంటి సినిమాలు చూస్తారు. అలాగె విప్లవ సినిమాల్లొ విలన్స్ వూరి పెద్దమనిషి ఐన అక్కడ విలన్ తో ఇడెంటిఫై చేసుకోరు ఎందుకంటె ప్రతి సినిమా మనం హీరో వైపు నుంచి చూస్తాం కనుక

    ReplyDelete
    Replies
    1. >>అందరి పైన పెత్తనం చెలాయించె వూరి పెద్దమనిషి..

      నాకీ పెత్తనం పెద్దమనుషుల్ని తెలుగు ప్రేక్షకులు మెచ్చుకోవటం ఆశ్చర్యంగా అనిపించింది. ఈ ఆశ్చర్యానికి కారణాలు రాజకీయమైనవి.

      Delete
  3. "కొందరైనా": కొందరైనా ఏమి పాడండీ ఎందరో ఉన్నారు. ఉ. మీరు మాత్రం రిజర్వేషను డాక్టరుతో ఆపరేషన్ చేయించుకుంటారా? అంటూ "ధర్మసందేహం" కక్కే పెద్దమనుషులు రోజూ తారసపడతారు. అయితే తనకు కులగజ్జి లేదని, తాను వారి "ప్రతిభ" లేదా "తెలివి" గురించే మాట్లాడుతున్నానని దబాయింపు ఒకటి.

    When someone equates "merit" with "caste", he releases himself from guilt. He can then launch a scathing argument for meritocracy with the comfort that his caste based hatred is cloaked from the rest of the world. As his audience is mostly like minded people, the charade goes on.

    ReplyDelete
    Replies
    1. అవును. రిజర్వేషన్ అనేది, కేవలం ఒక కోర్సులోకి ప్రవేశం కొరకు మాత్రమే. ఒక్కసారి ఆ కోర్సులోకి ప్రవేశించాక.. పరీక్షలు పాసవ్వడానికి ఎటువంటి రిజర్వేషనూ ఉండదు. కాబట్టి 'రిజర్వేషన్' నిపుణుడు ఎవరికన్నా కూడా తక్కువ కాదు.

      ఈ సంగతి అందరికీ తెలుసు. కానీ, తెలీనట్లుగా నటిస్తారు. అందుకు కారణాలు మీరు చెప్పారు.

      Delete
    2. reservation అనేది course లొ join అయ్యేందుకు మాత్రమే కాదు..ఉద్యోగం సంపాదించడానికి కూడా..

      Delete
    3. ఉద్యోగాలొక్కటే కాదండీ, ఇంకా చెప్పాలంటే,
      ఇప్పుడు మీరు అనే అణగారిన వర్గాన్ని తొక్కుతున్నది మరెవరో కాదు , అదే అణగారిన వర్గం.
      మీరు ఈ ఇంజినీరింగ్ లేదా వైద్య కళాశాలలకు వెళ్ళి చూడండి, రెజెర్వేషన్స్ ఎవరు వాడుకుంటున్నారో. అందులో ఎంతమంది పిల్లల తల్లి దండ్రులు అప్పటికే వీటిని వాడుకొని చదువు, వుద్యొగాలు, ప్రమోషన్స్ సంపాదించుకున్నారో చూడండి. మీ ఇంటికి మెడికల్ కళాశాల దగ్గరేకదా వెళ్ళి ఈ సంవత్సరం ఎంతమంది మీరు అనుకునే వెనకబడిన వాళ్ళకు మేలు జరిగిందో లెక్కవేసి చెప్పండి. అప్పుడు చెప్పండి ఎవరు ఎవరిని అణగతొక్కుతున్నారో.
      "ఒక కారు, రిక్షా గుద్దుకుంటే 100 శాతం కారు వాడిదే తప్పు" ఇలాంటి బూజు పట్టిన వాదనలు మానెయ్యండి.

      కృష్ణ

      Delete
    4. @GK,

      >>అణగారిన వర్గాన్ని తొక్కుతున్నది మరెవరో కాదు , అదే అణగారిన వర్గం.

      అణగారిన వర్గాల పట్ల మీరు చూపుతున్న concern కి అభినందనలు.

      >>ఎంతమంది మీరు అనుకునే వెనకబడిన వాళ్ళకు మేలు జరిగిందో లెక్కవేసి చెప్పండి.

      రిజర్వేషన్ అమలులో ఉన్న లోపాల గూర్చి ఆయా వర్గాల వాళ్ళే తేల్చుకుంటార్లేండి, మనకెందుకా శ్రమ. ఇంతకీ మీరు రిజర్వేషన్లకి అనుకూలమా? కాదా? సెలవిచ్చారు కాదు!

      >>ఇలాంటి బూజు పట్టిన వాదనలు మానెయ్యండి.

      మీ సలహాకి కృతజ్ఞతలు, ఆలోచిస్తాను.

      Delete
    5. రమణగారు,
      మీ మాటల్లొ వ్యంగం అర్ధమవుతుంది. ఫరవాలేదులేండి !!!

      కులం అనీది మన సమాజానికి పట్టిన ఒక పీడ అని నేను చాలా గట్టిగ నమ్ముతాను. అలాగే మన దేశం ఏ ఒక్క వర్గమో పైస్థాయిలో వుండాలి, అని నేను ఎప్పుడూ అనుకొవట్లెదు. దారి పక్కన గుడిసెలో వుండె వాళ్ళ పిల్లలు కూడా మన పిల్లలే. వాళ్ళకి కూడా సమాన అవకాశాలు రావాలనే నేను అనుకుంటాను. కులపిచ్చ బాగా తలకెక్కిన మన సమాజంలొ ప్రస్తుతం "సమాన అవకాసాలు" అంటె వినే వాడేవ్వడూ లేడు. కాబట్టి ఈ కుల ప్రాతిపదిన కోటా అన్నది తప్పదు. కనీసం దాని ఒక్కసారితొ ఆపితే మిగతా వాళ్ళు కూడ వాడుకోవటానికి అవకాశం వస్తుంది.
      కాకపొతే మీ పోస్టుల్లొ ఎక్కూవగా అగ్రవర్ణాలు అని వాళ్ళకే అన్నీ అంటగట్టటం బాగోలేదు. అవకాశం వస్తే అందరూ ఎంత స్వార్ధంతో వుంటారో చెప్పటానికే ఆ మెడికల్ కాలేజ్ గురుంచి చెప్పింది.
      అందుకే మనకి అందరినీ సమానంగా చూసే నాయకులు కావాలి. ప్రస్తుతానికి మన ప్రజల మనో భావాలు గమనిస్తే మనకు అటువంటి నాయకులు ఇప్పట్లో వచేట్లు లేరు. ( ఇందులొ నేను నాయకులని తప్పు పట్టను, ఎందుకంటే కులం చూసి, మతం చూసి మనమే వాళ్ళని ఎన్నుకుంటున్నాము గనుక. మనకి అంత కంటే గొప్ప నాయకులు రారు. )

      కృష్ణ

      Delete
  4. This comment has been removed by the author.

    ReplyDelete
  5. నాకు తెలిసి చాలామంది ప్రేక్షకులు ఇలాంటి సినిమాలని వర్తమానంతో పోల్చుకోకుండా, ఏదో కౌబాయ్ సినిమాలు చూసినట్టు చూస్తారంతే.

    ReplyDelete
    Replies
    1. అవును, నాకు తెలిసి కూడా కొందరు అలాగే చూస్తారు. కానీ - అందరూ అలా చూడరు. :)

      Delete
  6. మీ అలోచనా విధానం పూర్తిగా తప్పు. బొబ్బిలి బ్రహ్మన్న నైనా పెదరాయుడునైనా శంకరాభరణం నైనా ఆదిరించినది వాళ్లు పాటించిన నిజాయతి వలన మాత్రమే. మరేవిధమైన కారణం కాదు. ఇక ఆడపిల్లల జోలొకివస్తే ఎవడికైనా అదే శిక్ష పడాలి.

    ReplyDelete
    Replies
    1. మీరు నన్ను "పూర్తిగా" తప్పు అనడాన్ని ఖండిస్తున్నాను. ఫ్యూడల్ లార్డ్స్ తీర్పుల కన్నా కోర్టు తీర్పులు మేలైనవని నా నమ్మకం. :)

      (శంకరాభరణంలో సనాతన, సంప్రదాయ సంగీతపు ఘోష తప్ప, ఇవ్వాల్టి నా పాయింటుకి రిలవెంటుగా ఏమీ లేదనుకుంటా.)

      Delete
    2. "ఫ్యూడల్ లార్డ్స్ తీర్పుల కన్నా కోర్టు తీర్పులు మేలైనవని నా నమ్మకం"

      ఇది అన్నివేళలా నిజం కాకపోవోచ్చు. కానీ న్యాయస్తానల వ్యవస్తకు ఒక పునాది, కొన్ని నిర్దిష్టమయిన నియమాలు, తప్పు జరిగితే సరిదిద్దే ప్రాసెస్ ఉన్నాయి. సంప్రదాయ "న్యాయం" కేవలం ఆ వ్యక్తి మీద ఆధార పడి ఉంది. ఈ లోపాన్ని సరిదిద్దడం కుదరని పని.

      A system based on "rule of law" is always better than "rule of men" in the long run.

      Delete
  7. పొలం గట్టు నీళ్ళ తగదా నుంచి ఎవరి చేను ముందు కొయాలి లాంటి తగదాలన్నింటికి కోర్టులకి వెళితే ఇంక బతికినట్లే. ఇరుపక్క వాదనలు వారివారికి ఒప్పులు గానే అనిపిస్తాయి. నిష్పక్ష పాతంగా అప్పటికప్పుడు చెప్పే తీర్పు ఎంతో కాలన్ని ధనాన్ని విలువైన మానవసంబంధాలని మిగులుస్త్తాయి. ఈ విధానాన్ని తరువాతి తరం వారు దుర్వినియోగం చెయ్యడం వలన అవికేవలం సినిమాలకి మత్రమే పరిమితమై పోయిన Idealistic charectors గా మిగిలిపోయాయి.

    ReplyDelete
    Replies
    1. మీరు చెబుతున్నది justice delivery system లో ఉన్న లోపాల గురించి. అది పూర్తిగా వేరే చర్చ. న్యాయవవస్థలోని లోపాల్ని అధిగమించడానికి, ఆ వ్యవస్థని మెరుగు పర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేగానీ.. అందుకు ఊరి పెద్దమనిషి "నిష్పక్షపాతంగా" చెప్పే "తీర్పు" ప్రత్యామ్నాయం ఎంతమాత్రమూ కాజాలదు. అప్పుడు మనం ఖాప్ పంచాయితీలు, నక్సలైట్ల ప్రజాకోర్టుల్ని కూడా సరైనవే అనాల్సి వస్తుంది.

      (నేను ఫ్యూడల్ సొసైటీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాశాను. అదే సరైన విధానం అని మీరు భావిస్తున్నట్లైతే, అది మీ ఇష్టం.)

      Delete
  8. // ఆదోరణిని సమర్దించే వారు కొందరైనా // ఏమిటి మరిందరు ఉన్నారు. లేక పోతే ఇన్ని సినిమాలు విజయ వంత మవుతాయా? అంత:పురము, మురారి ఇవన్ని ప్యూడల్‌ సినిమాలు కావా? ఇవన్ని రబట్టే, వాటికి జనాధరణ ఉండబట్టే ఆయనెవరో వర్ణాశ్రం ధర్మాన్ని నాలుగు పధాల నడవటానికి ఇంకా ప్యూడలిజం లోకి తీసుక పోడాని ప్రైం మిస్టర్‌ అవుతాడట!
    మీ విశ్లేషన చాలా బాగుంది సార్‌,

    ReplyDelete
    Replies
    1. మొహమాటం కొద్దీ 'కొందరైనా' అని రాశాన్లేండి. ఇప్పుడు 'చాలామంది' అని దిద్దుకోవాలేమో!

      Delete
  9. పీడిత వర్గాలు తాము రోజూ పడుతున్న బాధల నుండి తప్పించుకోవడానికి తిరుగుబాటు మార్గాలను ఎంచుకోకుండా పాలక వర్గాలు రకరకాల మార్గాలను అనుసరిస్తుంటాయి. అందులో ప్రత్యక్షంగా రంగం లోకి దిగి ఉద్యమాలను అణచివేసే కత్తుల (ఇప్పుడు తుపాకుల) సైన్యం ఒకటి కాగా, ఉద్యమాలు పొడిగట్టకుండా ముందే ప్రజలను ఏమార్పు చేసే కలాల సైన్యం మరొకటి.

    ఫ్యూడల్ రాజ వంశీకులైన రాముడు, సీత, పాండవులు, ద్రౌపది కష్టాలు పడ్డట్టు చిత్రించి, ప్రజల చేత కన్నీరు కార్పించిన పురాణాలను మొదలుకొని ఈనాటి బొబ్బిలి బ్రహ్మన, పెదరాయుడు లాంటి సినిమాల వరకూ అన్నీ ఆ కోవకు చెందినవే.

    వీటన్నిటి సారాంశం ఒక్కటే. ఒరే వెధవాయిల్లారా! మీరే పెద్ద కష్టాలు పడ్డట్టు ఫీలయి పోతున్నారు, ఉన్నత కులాలలోని గొప్పవారు మీకన్నా ఎలా ఎక్కువ కష్టాలు పడుతున్నారో చూసి కాన్నీరు కార్చండి అని.

    వారు కోరినట్టు గానే ప్రజలు కూడా అవి చూసి కుండపోతగా ఏడుస్తున్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆదరణ పొందుతున్న సీరియల్ बालिका वधु (చిన్నారి పెళ్ళికూతురు) సీరియల్ ఆకోవకు చెందిందే.

    ReplyDelete
    Replies
    1. అవును, ప్రజలలో ఒక రకమైన భావజాల వ్యాప్తికి నిరంతరం కుట్రలు జరుగుతుంటయ్.

      Delete
  10. పెదరాయుడు hit అయినంత మాత్రాన ప్రేక్షకులు అగ్ర కుల ఆధిపథ్యం సమర్థిస్తున్నారని కాదు,God Father hit అయినంత మాత్రాన mafia don వ్యవహారాలు నచ్చుతాయని కాదు..ప్రేక్షకులు cinema లొ కేవలం entertainment వెతుక్కుంటారు...మీ అంత లోతుగా analysis చెయరు

    ReplyDelete
    Replies
    1. అవును, ఒప్పుకుంటున్నాను.

      (పోస్టు మొదటి భాగంలో రాసినట్లు.. నా ఆలోచనలు purely hypothetical.)

      Delete
  11. బలమున్నోడిదే రాజ్యం అనే వాక్యం ప్రపంచానికి ఎప్పుడూ వర్తిస్తుంది. అలాంటి బలవంతుల్లో నిజాయితీ పాటించినవారి గురించి ప్రచారం చెయ్యడం సాహిత్యానికి ఉండాల్సిన ఆశయం. ఒక రాజు యొక్క రాజధర్మాన్ని చూపించినా పెదరాయుడి పాలసీ ని ప్రొజెక్ట్ చేసినా దాన్ని మనం మనదైన కోణం లో కులానికో డబ్బూ బలానికో ఆపాదించి విమర్శించేయటం తేలికే. చరిత్రలో ఎందరు రాజులు వచ్చి పోలేదు? ఎందరు బలవంతులు గతించిపోలేదు? అందరిగురించీ మనం చదువుకోవట్లేదే. వ్యక్తి తీర్పు కంటే వ్యవస్థ తీర్పు గొప్పదని కూడా చెప్పలేం. కోర్టు తీర్పు మనకి అనుకూలంగా వస్తే న్యాయం extra పాదం పై నడిచేస్తున్నట్లు, వ్యతిరేకంగా వస్తే తీర్పులు రాజకీయ ప్రేరేపితాలని తిట్టి పోసే ప్రబుధ్ధులని మనం చూస్తూనే ఉన్నాం! సో చివరగా చెప్పేదేమిటంటే మీకు నచ్చకపోతే బయటకు దయచేయండి. అంతేగాని సినిమాని ఆదరిస్తున్న మమ్మల్ని కెలకొద్దు ప్లీజ్!

    ReplyDelete
    Replies
    1. >>మీకు నచ్చకపోతే బయటకు దయచేయండి.

      నా బ్లాగులోకొచ్చి నన్ను బయటకి దయచెయ్యమనడం!!!!!!!

      అది మీకు వర్తిస్తుంది, నాక్కాదు. :))

      Delete
  12. రమణ గారు,
    మొదట్లో మీ టపాలు చదివి మీరు చాల స్థిత ప్రఙ్నులు (balanced mind) అనుకునే వాడిని.
    కాని అలొచించే కొద్దీ (మీరే కాదు, ఇక్కడ అభిప్ర్రయాలు వ్యక్త పరిచే చాలమంది కూడా) మీరు కూడ ఒకలాంటి కులభావంలొ (మీ భాషలొనే చెప్పలంటే, కుల పిచ్చి ) వున్నారేమొ అనిపిస్తుంది. అందుకే , ధర్మం న్యాయం కంటే కులం కనబడుతుంది. మీరు చెప్పే రాజకీయ నాయకుల్ని, మీలాంటి వాళ్ళని పోల్చి చూస్తె ఒక్కలాగే అనిపిస్తారు. కాకపొతే ఇద్దరూ ఎదురెదురు వుంటారేమొ. అందుకే 20 మందిని చంపినాగాని, హంతకుడు మీరనుకునే కులం వాళ్ళు ఐతే, వాళ్ళ తప్పు ఎమీ వుండదు.
    బహుశా జనాలు, పెదరాయుడు చిత్రంలొ , ఆ పాత్ర వ్యక్తిత్వం నచి వుంటుంది, ధర్మం కొసం కట్టుబడటం , అన్న మాట మీద వుండటం ఇలంటివి నచి వుంటై. ఎప్పుడొ మీరు అన్నట్లు, నిజ జీవితంలొ చెయ్యలేని పనులు అందులొ ఆ పాత్ర చెయటం నచి వుంటుంది. కాని మీకు వీటన్నిటికన్న కులం మాత్రమే కనపడింది.
    ఒక రకంగా మీరు ఎంత మానసిక వైద్యులైన గాని, మీరు కూడా గత 65 సంవత్సరాలుగా మన మీద రుద్దబడిన ప్రచార ప్రభావం నుండి బయట పడినట్లు అనిపించలేదు.

    కృష్ణ

    ReplyDelete
    Replies
    1. >>మొదట్లో మీ టపాలు చదివి మీరు చాల స్థిత ప్రఙ్నులు (balanced mind) అనుకునే వాడిని.

      థాంక్స్. ఇప్పుడు మీ అభిప్రాయం మార్చుకున్నందుకు మళ్ళీ థాంక్స్.

      (నా పోస్టు పెదరాయుడు సినిమా మంచిచెడ్డల గూర్చి కాదు. ఒక వ్యక్తి అట్లాంటి ఫ్యూడల్ సినిమాని మెచ్చుకుంటే, ఆ basis మీద అతని మనస్తత్వాన్ని అంచనా వెయ్యొచ్చా? అనే ఆలోచనతో ఈ పోస్టు రాశాను.)

      >>మీరు కూడ ఒకలాంటి కులభావంలొ (మీ భాషలొనే చెప్పలంటే, కుల పిచ్చి ) వున్నారేమొ అనిపిస్తుంది.

      నా పోస్టులన్నీ పూర్తిగా నా ఆలోచనలే. నా భావాలు మీరు మీకు తోచిన రీతిలో అర్ధం చేసుకోవచ్చు. అది మీ ఇష్టం.

      Delete
  13. రమణ గారు,
    మీరన్నది నిజమే. మన సమాజంలో ఫ్యూడల్ ఎకానమీ ఉనికిలోంచి వెళ్లిపోయినప్పటికీ, ఫ్యూడల్ భావజాలం తాలూకు అవశేషాలు మాత్రం కాస్తో కూస్తో ఐనా, ఇంకా ఉన్నాయనే చెప్పాలి. నిజానికి సొసైటీ... ఫ్యూడలిజం నుండి సో కాల్డ్ డెమోక్రసీ (క్యాపిటలిజాని)కి మార్పు చెందిన తర్వాత, కాలం చెల్లిన ఫ్యూడల్ భావజాలాన్ని పూర్తిగా తీసివేయడానికి గాను.. డెమోక్రటిక్, సైంటిఫిక్, సెక్యులర్ కాన్సెప్టుల్ని... విద్యాబోధన, డిఫరెంట్ ఆర్టిస్టిక్ (కళా) మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి ఉండింది. అలా ప్రభుత్వాలు కొన్నేళ్లపాటు నిజాయితీగా, నిబద్ధతతో కృషి చేసి ఉండుంటే, స్వాతంత్ర్యానంతరం ఈపాటికి నిజమైన నిర్వచనంలో డెమోక్రటిక్ సెక్యులర్ ఇండియా (ఏపీ కూడా) ఆవిర్భవించి ఉండేది. ఈ కుల పిచ్చి, మతోన్మాదం, మూఢాచారాలు ఇవన్నీ కనుమరుగై ఉండేవి. ఇండియాలో పాలకులు ఏనాడూ ఆ దిశగా కృషి చేసిన పాపాన పోలేదు. బ్రిటిషర్స్ అనుసరించిన ‘విభజించి పాలించు’ (అన్నివిధాలుగా), ’అందిన కాడికి దోచుకో’ అనే సూత్రాల్నే మన పాలకులు కూడా తు.చ తప్పకుండా అమలు చేశారు. ప్రజాస్వామ్యం ఎవరికయ్యా అంటే అవినీతి, అక్రమార్జన చేసుకునే నాయకులు, పారిశ్రామికవేత్తలకు మాత్రమే. ప్రజలపై మాత్రం నియంతృత్వమే కొనసాగుతోంది. విద్య లేదు. వైద్యం లేదు. ఉపాధి లేదు. ఉద్యోగాల్లేవు. ధరల పెరుగుదలకు అడ్డే లేదు. ఇదా ప్రజాస్వామ్యం??? ఇక, ఇలాంటి ప్రజా సమస్యలన్నింటినీ గాలికొదిలేసి, అవకాశవాదం (Opportunism) వైపో, లేక అడ్వెంచరిజం వైపో లెక్కలేన్ని చారిత్రక తప్పిదాలతో సెటిలైపోయిన కుహనా లెఫ్టిస్టులకు నమో నమ:! యెస్, ఫ్యూడల్ భావజాలం ఉంది, ఐతే, దానికి కారణం Present Exploitative System. దానికి వ్యతిరేకంగా ప్రజల్ని ఐక్యం చేసి, చైతన్యం తీసుకువచ్చి వ్యవస్థను మార్చుకుంటే తప్ప ఆ కాలం చెల్లిన భావజాలం పోదేమో. Upper Caste నో, Lower Caste నో ప్రస్తావించడం వల్లో, టార్గెట్ చేయడం వల్లో ఈ సమస్యకు పరిష్కారం లభించక పోగా, సమస్య మరింత సంక్లిష్టం, జఠిలం అవుతుందేమో అనిపిస్తుంది.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.