Sunday 22 September 2013

మానసిక రోగులూ మనుషులే


'ఫలానా నాయకుడికి పిచ్చెక్కింది.'

'ఫలానా నాయకుడిని పిచ్చాసుపత్రిలో చేర్పించి మా ఖర్చుతో వైద్యం చేయిస్తాం.'

ఈ మధ్య కొందరు రాజకీయ నాయకుల భాషలో ఇలాంటి కొత్త 'తిట్లు' వచ్చి చేరాయి. ఇంకొందరు ఒకడుగు ముందుకెళ్ళి ప్రభుత్వాసుపత్రిలోని మానసిక వైద్య విభాగాధిపతికి 'ఫలానా నాయకుడికి మానసిక వైద్యం అవసరం' అంటూ మీడియా సాక్షిగా వినతి పత్రాలు కూడా ఇస్తున్నారు!

ఇది చాలా అభ్యంతరకరమైన ధోరణి. సభ్యసమాజం ముక్తకంఠంతో ఖండించాల్సిన దుర్మార్గమైన ధోరణి. మానసిక రోగులు నేరస్థులు కాదు. బీపీ, షుగర్ పేషంట్ల లాగా సైకియాట్రీ పేషంట్లు కూడా ఈ సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నారు. మానసిక వైద్యం అనేది వైద్య శాస్త్రంలో ఒక ముఖ్యమైన విభాగం. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. మానవ శరీరానికి జబ్బు వచ్చినట్లే మనసుకు కూడా జబ్బు వస్తుంది. మానసిక జబ్బులు మెదడులో కల న్యూరోట్రాన్మిటర్లలో సంభవించే రసాయన మార్పుల వల్ల వస్తున్నాయని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు.

అసలు ఏ రోగంతో బాధపడేవారి గురించైనా ఎగతాళిగా ఎవరూ మాట్లాడరాదు. విజ్ఞత కలిగిన వారెవరైనా మానసిక వైద్యం చేయించుకుంటున్న వారి పట్ల సానుభూతిగానే ఉంటారు. మరి మన పొలిటికల్ సెక్షన్‌కి మానసిక రోగుల పట్ల ఎందుకింత పరిహాసం? ఎందుకింత బాధ్యతా రాహిత్యం? ఇది వారి అవగాహన లోపమా? లేక నిర్లక్ష్యమా? 

అసలే మన దేశంలో మానసిక రోగాల పట్ల అవగాహన తక్కువ. సామాన్య ప్రజలు ఈ రోజుకీ దెయ్యాలు, భూతాలు, చేతబడి వంటి నమ్మకాలతో తమ విలువైన సమయాన్ని, డబ్బుని నష్టపోతున్నారు. మానసిక వైద్యుణ్ణి సంప్రదిస్తే సమాజం తమని 'పిచ్చివాడు' అనే ముద్ర వేస్తుందేమోనని భయపడుతున్నారు.

అందుకే ఏపీ సైకియాట్రిక్ అసోసియేషన్ మానసిక వైద్యం పట్ల ప్రజల అవగాహన మెరుగు పరచడం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. మానసిక వైద్యులు కూడా ఈ రంగంలో ఎంతగానో కృషి చేస్తున్నారు. తద్వారా ఇప్పుడిప్పుడే సామాన్య ప్రజలలో అవగాహన కొంత మెరుగవుతుంది.

మన నాయకులు మాత్రం తమ రాజకీయ భాషలో 'పిచ్చి', 'పిచ్చెక్కింది' వంటి అనాగరిక పదాలు వాడుతూ సమాజానికి నష్టం చేకూరుస్తున్నారు. ఈ రకమైన 'పిచ్చి' భాష మానసిక వైద్యం పొందుతున్న వారికి ఆవేదన కలిగిస్తుంది. ఈ భాష ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలకి విరుద్ధం కూడా. కావున ఇట్లాంటి భాష మాట్లాడకుండా కఠినమైన నిబంధనలు విధించడమే కాకుండా... ఇలా మాట్లాడ్డం నేరంగా పరిగణించేలా కూడా వెంటనే చట్టంలో మార్పు తేవాలి.

- యడవల్లి రమణ

(ఈ రోజు ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజిలో పబ్లిష్ అయ్యింది)

(picture courtesy : Google)

18 comments:

  1. మీతో ఏకీభవిస్తున్నాను,

    ReplyDelete
  2. People despise what they fear. They fear what they don't understand. Ergo people despise what they don't understand.

    This is why man has invented jinns, boochi etc.

    As mental illness is beyond the comprehension of most so called normal people, they use "mad man" as a term of abuse. Till recently (and even today), this "honor" was reserved for words like చండాలుడు, పింజారీ, కసాయి, దరిద్రుడు, గుడ్డోడు etc.

    ReplyDelete

  3. మనుషులందరూ (మానసిక) రోగులే అన్న టైటిలు సరి ? (ఇది కూడా మరీ అభ్యంతర కరమైన పదం కాదు అనుకుంటే నే సుమా !)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Zilebi ji,

      మీరు సూచించిన టైటిల్ తాత్వికంగా కరెక్టే.

      (కాకపోతే బిపి పేషంట్ల వలే సైకియాట్రీ పేషంట్లు కూడా మనమధ్య ఉన్నారు. ఈ పోస్టు వారి కోసం రాశాను.)

      Delete
  4. డాక్టర్ గారు,

    ఇన్నాల్లు నేను మొత్తుకోని చెప్పినా మీరు అంధ్రజ్యోతి పేపర్ ఎందుకు మానలేక పోతున్నారో నాకు అర్దమయింది. మీ బ్లాగులోని విషయలూ మరియు మీ అర్టికల్స్ వాల్ల పేపరులో వేస్తున్నారనేకదా.

    సరే కానీయండి.

    ఇకపోతే ఈ టఫాతో మీరొక మంచి విషయం(వివాదం) తెలియచేసినందుకు ధన్యవాదములు.

    ఈరోజుల్లో సమాజములో మామూలు రోగాలతో పాటు మానసిక రోగులు కుడా ఎక్కువమందే వున్నారు.కాని చాలమంది అవి రికగ్నైస్ చేసే వాల్లు చాలా తక్కువమంది వున్నారు. ఒకవేల రికగ్నైస్ చెసినా బయటకు చెప్పేవాల్లు ఇంకా తక్కువ.వాల్లాల్లోవాల్లు మదనపడేవాల్లే ఎక్కువ.

    బి పి మరియు షుగరునే చెప్పుకోవడం లేదు.

    జి రమేష్ బాబు

    ReplyDelete
    Replies
    1. @రమేష్ బాబు,

      నేను వార్తల కోసం తెలుగు పేపర్లపై ఆధారపడను.

      ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజి చూస్తాను. ఆ పేజిని అప్పుడప్పుడు చదువుతాను కూడా. ప్రస్తుతానికి ఇంతకన్నా better option ఇంకోటి లేదనుకుంటున్నాను.

      మానసిక రోగులు వాళ్ళ చావు వాళ్ళు చస్తున్నారు.. రాజకీయ నాయకులు వాళ్ళ జోలికి పోవద్దనే నా పోస్ట్ సారాంశం.

      Delete
  5. పైనుంచి చాలా చక్కగా రాసుకొచ్చారు డాక్టరుగారూ. కాని చట్టం చేసేసినంత మాత్రాన మన ప్రజలు మారరు. చట్టాలున్నవి ఉల్లంఘించడానికే అని మన దేశం తో పాటు వివిధ దేశాల ప్రజలు కూడా భావిస్తుంటారు. అసలు తప్పు ప్రజలదే. పొందికగా మాట్లాడటం కూడా రాని వెధవలని నాయకుల పేరిట పైన కూర్చోబెడుతుంటే పరిస్థితి ఇలా కాక ఎలా ఉంటుంది. అన్నట్లు పానకం లో పుడకలా ఒక సమాచారం. అసలు మానసిక రోగులు ఎలా తయారవుతారో తెలుసుకోవాలంటే గోంగూర ప్రేమలత గారు రాసిన "కరుణామయుని అరుణ కిరణాలు" నవల చదవండి!

    ReplyDelete
    Replies
    1. నిజమేననుకోండి. అసలంటూ చట్టాలు ఉంటే కనీసం అవగాహన కలుగుతుందని ఒక ఆశ.

      >>గోంగూర ప్రేమలత గారు రాసిన "కరుణామయుని అరుణ కిరణాలు" నవల చదవండి!

      నేనెప్పుడూ విన్లేదు. is it a joke?

      Delete
    2. Yes..It is a joje Ramana garu ! :-)

      తోటకూర ఆశాలత పేరుతో ఒకప్పుడు తోటకూర రఘు ఆంధ్ర జ్యోతి ఎడిటర్ గా ఉండి కలం పేరుతో రచనలు చేసేవారు.(దానికి చిన్న సైజు పేరడీ ఇది) ఆ తర్వత భరాగో కథల్ని టీవీలో టెలి ఫిలింస్ రూపంలో ప్రసారం చేసినపుడు ఆ కథలో భాగంగా ఒకావిడ ఒక పత్రికలో (అప్పుడు టీవీ సీరియల్స్ లేవు లెండి) చివరి వారం సీరియల్ చదవలేకపోయాను, ఏమందో ఏవిటో... అని దిగులు పడి మనోవేదనకు గురవుతుంది. మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు మీకు మల్లేనే ఇలాటి (చివరి వారం సీరియల్ మిస్ అయిన వాళ్లని) ఎంతోమందిని చూసి ఉంటారు కదా... గోంగూర ప్రేమలత గారి కరుణామయుని అరుణ కిరణాలు సీరియల్ ఆఖరి వారం ఎలాగైనా తెచ్చి చదివించమంటాడు. కథ సుఖాంతం.

      సూర్య గారూ, భలే గుర్తు పెట్టుకున్నారు ఆ పేరు.:-))

      Delete
    3. సుజాతగారూ, మీరు కథ కొంచెం మర్చిపోయారు. డాక్టరుగారూ కథ ఏమిటంటే..(టార్టాయిస్ చక్రం నా మొహం ముందు తిప్పుకుంటున్నా!)... సుత్తివేలు ఒక మధ్యతరగతి మనిషి. అతని భార్య ఉన్నట్లుండి ఎవ్వరితోనూ మాట్లాడక మౌన మునిలా మారిపోతుంది. ఎన్నో చికిత్సలకు బాగపడకపోయేసరికి పేరొందిన ఒక మానసిక వైద్యునిదగ్గరకు తీసుకెల్తాడు. డాక్టరు కొన్ని పత్రికల పేర్లు చెప్పి ఆవిడ రియాక్షన్ గమనించి రోగాన్ని గుర్తుపడతాడు. తను, తన భార్య 3 రోజులపాటు ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పి ఆవిడని అడ్మిట్ చేయించుకుంటారు. ఆ తరువాత ఆవిడ మామూలు మనిషైపోతుంది. సుత్తివేలు కుతూహలం కొద్దీ అడుగుతాడు అసలు ఎలా నయం చేసారని! అపుడు డాక్టరు గారు చెపుతారు గోంగూర ప్రేమలత గారు రాసిన "కరుణామయుని అరుణకిరణాలు" అనే నవల సీరియల్ గా ఒక పత్రికలో వచ్చేదనీ, ఒక వారం సస్పెన్స్ లో వదిలేసాక పత్రిక మూతపడటం తో తరువాయి వారం నుంచీ పత్రిక రాక ఏం జరిగిందా అని ఆలోచించి ఇలా మారిపోయారని. దానికి ట్రీట్మెంట్ గా 3 రోజుల పాటు ఏకధాటిగా మిగిలిన భాగాలు చదివించానని కూడా చెపుతాడు. అపుడు సుత్తివేలు అడుగుతాడు ఎవ్వరికీ దొరకని ఆ సీరియల్ మిగతా భాగాలు డాక్టరుగారికెలా దొరికాయని. అపుడు డాక్టరు అంటాడు "ఓరి పిచ్చివాడా.. గోంగూర ప్రేమలత అనే పేరుతో ఆ రచన రాసింది.. నేనే!" అని.

      అయితే సుజాతగారు చెప్పిన తోటకూర ఆశాలత అనే పేరుకి ఇది పేరడీ అని నాకు తెలియదు. థాంక్సండీ సుజాతగారూ!

      Delete
    4. సూర్య గారూ, కరెక్టే సుమండీ, ఆ కొసమెరుపు మర్చి పోయి ఉండకూడదు నేను. కానీ ఎప్పుడో చాలా రోజుల క్రితం చూసిన కథ కదా, నిజంగానే గుర్తు లేదు.

      డాక్టర్ వేషం వేసింది మిశ్రో! ఆయనంటే నాకు బాగా ఇష్టం. అందుకే గుర్తుంది ఆ కథ.

      థాంక్యూ

      Delete
  6. మన రాజకీయ నాయకులు ప్రత్యర్ధులకే గాదు, గిట్టని వారికి మానసిక రోగమే కాదు ఏమైనా భూ ప్రపంచలో ఏమేమి వర్తించగలవో అవన్నీ అంట గంటెయ్యగలరు గదా?

    ReplyDelete
    Replies
    1. అవును. ఈమధ్య media attention కోసం నానా చెత్త మాట్లాడుతున్నారు.

      Delete
  7. మంచి పోస్టు రమణ గారు! రానురాను నేతల ఆ(వా)గడాలు మరీ మితిమీరిపోతున్నాయ్. ఈ విషయమై సుప్రీంకోర్టులో కేసు వేయండి. అన్నట్టు, రాజకీయాలు బంగారు గుడ్లు పెట్టే బిజినెస్సుగా తయారయ్యాక, కాంపిటీషన్ పీకలు కోసుకునేంతలా పెరిగిపోయింది. అసలు నేటి రాజకీయ నాయకులకు ఎన్ని కష్టాలొచ్చాయని! ఓంప్రథమం గెలిచే పార్టీలో సీటు దక్కించుకోవాలి, ఆపై మీడియాని మేనేజ్ చేయాలి, అలాగే ఓ గూండా గ్యాంగును అస్తమానం వెంటేసుకు మేపాలి, ఓట్ల కోసం కోట్లు ఖర్చు చేయాలి, ఐనా గెలుస్తామనే గ్యారంటీ ఉండదు, గెలిచినా మంత్రి పదవి వరిస్తుందో లేదో తెలీదు, అదృష్టం బావుండి మంత్రి పదవి వచ్చినా ఎన్నాళ్లుంటుందో తెలీదు, మంత్రి పదవి ఉన్నా అర్థాంతరంగా ప్రభుత్వాలే కూలిపోవచ్చు, ఎప్పడు ఎవడెలా వెన్నుపోటు పొడుస్తాడో తెలీదు, ఖర్మ కాలి సీబీఐ బారిన పడి జైళ్లకు కూడా వెళ్లాల్సి రావచ్చు, అంతా అయోమయం, గందరగోళం. సో, రాజకీయం చేయడం ఇవాళ్రేపు పులి స్వారీలా, కత్తి మీద సాములా మారి, విపరీతమైన టెన్షన్లు, ఒత్తిళ్లు, ఆందోళనలు, డిప్రెషన్లతో కూడుకున్న వ్యవహారంగా తయారైంది. దీంతో 99 శాతం పొలిటీషియన్లలో మెంటల్ బ్యాలెన్స్ దెబ్బతిని, మతిభ్రమించి ఏదేదో వాగేస్తున్నారు. హార్వర్డ్, కేంబ్రిడ్జ్ పట్టాలు పుచ్చుకున్న రాహుల్ జీ, మన్మోహన్ జీ, మాంటెక్ సింగ్, షిలా దీక్షిత్ లాంటి పాలిష్డ్ ఢిల్లీ స్థాయి నాయకులే... * పేదరికం వఠ్ఠి మానసిక భావన * రూపాయి పతనానికి కారణం సిరియా సంక్షోభం * డైలీ 30 రూ.లు సంపాదించే ప్రతోడూ దారిద్ర్యరేఖకు పైనున్నట్టే లెక్క * నెలకు 600 రూపాయలు సంపాదిస్తే ఢిల్లీలో కాలు మీద కాలేస్కుని దర్జాగా బతికేయొచ్చు... ఇలా పూర్తిస్థాయి మతి భ్రమించిన వ్యాఖ్యలు చేసేస్తున్నారు. ఇక మీరన్న చోటామోటా, గల్లీ లెవిల్ నేతలకు పాపం, ప్రాపర్ ట్రైనింగు (చింతన్ శిబిర్ లాంటివి) గట్రా ఏవీ లేకపోవడం వల్ల, మీడియా మైకు కనిపిస్తే చాలు సైకోసిస్ పట్టేస్తుంది. ఈ నేపథ్యంలో, NIMHANS తాలూకు ప్రత్యేక ఎక్స్ టెన్షన్ ఒకటి అండమాన్ జైల్లో ఓపెన్ చేసి ఈ రాజకీయ నాయకులందరినీ అక్కడ చేర్పించి కొన్నేళ్లపాటు తగుమోతాదులో చట్ట రూపేణా, వైద్య రూపేణా చికిత్స ఇప్పిస్తే బాగుంటుందని ప్రజలు తీవ్రంగా కోరుకుంటున్నారు. ఈ కల ఎప్పుడు నెరవేరుతుందో?! :)

    ReplyDelete
  8. నాగరాజ్ గారు,

    మీరు మంచి ఫ్లోలో చక్కగా రాస్తారు. అభినందనలు.

    మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

    ReplyDelete
  9. ఏమిటి అండి ఈ మద్య ఎక్కువగా న్యూస్ పేపర్ లో రాస్తున్నారు . ఆంధ్రజ్యోతి పేపర్ లో ఏమి అన్న పార్ట్ టైం చేస్త్తున్నరా ?
    సరదాకి అన్నాను . article బావుంది

    ReplyDelete
    Replies
    1. @sai krishna alapati,

      ఆంధ్రజ్యోతివాళ్ళకి తెలుగు బ్లాగర్ల మీద ప్రేమ పెరిగిపోయినట్లుంది! :)

      నాకెందుకో బ్లాగు రాసుకోటమే సుఖంగా ఉంది.

      మనం రాసింది వాళ్ళెప్పుడు వేస్తారో తెలీదు. వేసిందాన్ని ఎవడన్నా చదివాడో లేదో కూడా తెలీదు!

      Delete

comments will be moderated, will take sometime to appear.