Wednesday 12 June 2013

కనకం


విజయ వారి 'షావుకారు' అనేక విధాలుగా విశిష్టమైనది. సినిమా చూస్తూ కథలో పూర్తిగా లీనమైపోతాం. ఈ సినిమాలో పల్లె వాతావరణాన్ని హాయిగా సహజంగా చిత్రీకరించారు. ఎంత సహజంగానంటే.. మనమే ఆ పల్లెటూరులో ఉన్నట్లుగాను, సినిమాలో పాత్రలు మన చుట్టూతా తిరుగుతూ మాట్లాడుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. ఒక మంచి నవల చదువుతున్నట్లుగా కూడా అనిపిస్తుంది.

షావుకారు సినిమాలో చాకలి రామి పాత్రని పోషించిన నటి పేరు కనకం. చాలా ఈజ్‌తో సరదాసరదాగా నటించేసింది.  సున్నం రంగడు (ఎస్వీరంగారావు) దగ్గర వగలు పోతుంటుంది. అతన్ని ఆట పట్టిస్తుంటుంది, రెచ్చగొడుతుంటుంది. అందుకే - అంత లావు రౌడీ రంగడు రామి దెబ్బకి పిల్లిలా అయిపోతుంటాడు.

పాత సినిమాల్లో నటులు చాలా ప్రతిభావంతులని నా నమ్మకం. ఇట్లా నమ్మటానికి నాక్కొన్ని కారణాలున్నాయి. ఉదాహరణకి కన్యాశుల్కం సినిమాలో నటించిన గోవిందరాజుల సుబ్బారావు నిజజీవితంలో పురోహితుడనుకుని భ్రమపడ్డాను. ఈ సంగతి ఇంతకుముందు "గోవిందరాజుల సుబ్బారావు.. నా తికమక!"  అనే పోస్టులో రాశాను.

ఆరుద్ర రాసిన 'సినీ మినీ కబుర్లు'లో కనకం గూర్చి ఒక చాప్టర్ వుంది. కనకం హీరోయిన్ పాత్రల కోసం ప్రయత్నిస్తూనే చాలా సినిమాల్లో కామెడీ వేషాలు వేసిందని.. సినిమాల్లో అవకాశాలు తగ్గాక కాంట్రాక్టు నాటకాల్లో కృష్ణుడు వేషాలు వేసిందని.. వృద్దాప్యంలో పేదరికంతో విజయవాడలో జీవిస్తుందని.. ఇట్లాంటి విశేషాలు, వివరాలు ఆ పుస్తకంలో చాలానే వున్నాయి.  

దర్శకులు హీరోయిన్ పాత్ర గూర్చి చాలా శ్రద్ధ తీసుకుని, సపోర్ట్ కేరక్టర్ల గూర్చి తక్కువ శ్రద్ధ తీసుకుంటారు అనుకునేవాణ్ని. ఈ సినిమా చూశాక నా అభిప్రాయం మార్చుకున్నాను. దర్శకుడు ఎల్వీప్రసాద్ చాకలి రామి పాత్రని ఆకర్షణీయంగా, సహజంగా కన్సీవ్ చేశాడు. 

యూట్యూబ్ లో కనకం రేలంగిని పొగక్కాడ అడిగే సన్నివేశం కూడా ఉంది (ఆసక్తి కలవారు చూసుకోవచ్చు). రామి, రంగడు పాత్రల రూపకల్పనలో చక్రపాణి పాత్ర ఎంతో మనకి తెలీదు. కుటుంబరావు మాత్రం షావుకారు సినిమా మొత్తానికి చక్రపాణి కంట్రిబ్యూషన్ చాలానే ఉందంటాడు. కనకం తనే పాడుకుని నటించిన పాట ఇస్తున్నాను. చూసి ఆనందించండి.



(photo courtesy : Google)

24 comments:

  1. షావుకారు నాకు చాలా ఇష్టమైన సినిమా. పోస్ట్ చిన్నగా ఉంది. అప్పుడే అయిపోయిందే అనిపించింది. .

    ReplyDelete
    Replies
    1. అలాగా! very sorry.

      ఈ పాటంటే నాకు ఇష్టం. పన్లోపనిగా తెలుగు బ్లాగర్లకి కనకాన్ని పరిచయం చేస్తూ ఓ నాలుగు ముక్కలు రాశాను.

      (ప్రస్తుతం కనకం ఎడ్రెస్ వెతికే పన్లో కూడా ఉన్నాను.)

      Delete
    2. > ప్రస్తుతం కనకం ఎడ్రెస్ వెతికే పన్లో కూడా ఉన్నాను.
      మంచి పని.
      కాని డాక్టరుగారూ, TV9 ఛానెలు వారు 'అన్వేషణ' అని ఒక ప్రోగ్రాం చేస్తున్నారు.
      పాత తారలను వెదికిపట్టుకుని పునఃపరిచయం చేస్తున్నారు.
      వారిని మీరు సంప్రదించండి.

      Delete
    3. శ్యామలీయం గారు,

      thank you.

      విజయవాడకి చెందిన డాక్టర్లకి, medical representative లకి కనకం ఎడ్రెస్ కనుక్కొమ్మని చెప్పాను. త్వరలోనే దొరకొచ్చు.

      Delete
  2. కనకం లేరు అని దాదాపు రెండేళ్ళ క్రితం పత్రికలో చదివినట్టు గుర్తు .. ఈ కామెంట్ పబ్లిష్ చేయకండి .. ఆమె అడ్రస్ లభిస్తే సంతోషం ..

    ReplyDelete
    Replies
    1. comment moderation లేదు. కావున మీ వ్యాఖ్య పబ్లిష్ అయిపోయింది.

      (కనకం గూర్చి మీ అనుమానమే ఒకళ్ళిద్దరు వ్యక్తం చేశారు.)

      Delete
  3. ఆరుద్రగారూ, శాస్త్రిగారూ, కుటుంబరావుగారూ, ఇంకా అలాంటి వాళ్ల గురించి రాసేటప్పుడు ప్రతీసారీ గారు అనకపొయినా అన్నారు, చెప్పేరు, రాసేరు అంటే బాగుంటుందేమో. ఆలోచించండి.
    శ్యామ్

    ReplyDelete
  4. కనకమా చిట్టి కనకమా ముద్దు కనకమా నా మాట వినుమా
    అని ఒక పాట విన్నాను గతం లో..ఈమె గురించి కాదేమో?

    ReplyDelete
    Replies
    1. కాదండి. మీ పాట ఇదుగో.

      https://www.youtube.com/watch?v=2H0ZsOjfMRo

      Delete
  5. కనకమా చిట్టి కనకమా ముద్దు కనకమా పాట భార్యాభర్తలు సినిమాకోసం రమణారెడ్డి, సంధ్యల పై చిత్రీకరించారని గుర్తు.

    ReplyDelete
  6. పనిలేక అంటారేం......ఇంత మంచిపని చేస్తూ :-)

    ReplyDelete
  7. Actress Kanakam in need of financial help
    Here is a TV9 story on Kanakam. I wish they gave address and other details for the audiences to help her.

    ReplyDelete
  8. కనకం చివరిదశలో ఆర్థిక దుస్థితిలోకి జారి వెతలు అనుభవించడం విషాదాంతం!!ఆమె దారిద్ర్యస్టితి టి‌విలో చూశాను!ఆరోజుల్లో చిన్న నటీనటుల పారితోషికాలు అంతంతమాత్రంగా ఉండేవి!They have struggled to make both ends meet!పెద్ద అందగత్తె కాకున్నా కనకం మంచి నటి!అప్పట్లో నటీనటులు ఇప్పటివారిలా గడుసువారు కాదు!దీపాలుండగానే ఇళ్ళు చక్కపెట్టుకోలేకపోయారు!

    ReplyDelete
    Replies
    1. కనకం సొంతసినిమా తియ్యబోయి ఆర్ధికంగా చితికిపోయింది.

      మంచి సరదా మనిషనీ, ఒకసారి తనకి ఆప్యాయంగా అడవిపంది మాంసం వడ్డించిందని ఆరుద్ర రాశాడు.

      Delete

  9. ఈ షావుకారు చిత్రం లో ప్రతి ఒక్కరూ టాప్ నటనే కనబరిచారు కూడాను. పోటా పోటీ లా ప్రతి పాత్ర గొప్ప గా నటించిన చిత్రం మరి !

    ఇక ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ - మార్కుస్ బార్ట్లే - ఈ యన గురించి తెలుగు లోకం లో వివరాలు చాలా తక్కువ గా ఉన్నట్టుంది ! ప్రతిభావంతం గా చిత్రీకరణ చేసేడు సెల్యు లాయిడ్ మీద ( కొన్ని ఫ్రేమ్స్ లో నటుల నీడ సందర్భానికి తగ్గట్టు పెద్దగానో, కాకుంటే వేరే విధం గానో ఒక అర్థం దాంట్లోనూ కనిపించేలా చేసేడు .

    ఈయన గురించి వివరాలు తెలిసిన వాళ్ళు రాస్తే కూడా బాగుంటుంది

    (ఈ చిత్రం లో కనకం అప్పట్లోనే లో నెక్ జాకెట్లో కనబడటం, కొంత ఎక్స్పోసింగ్ చూపించడం ఒక విశేషం కూడాను అప్పట్లో, అదిన్నూ, విజయా వారి చిత్రం లో - అంటే చూడండీ పాత్రని ఎంత గా మలిచేరో మరి దర్శకులు(ప్రసాద్) సందర్భానికి తగ్గట్టు గా !--> ఈ కాలానికి అబ్బో అని పించ పోక వచ్చు గాని , మా కాలాని కి గుస గుసలె మరి !)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. మార్కస్ బారట్లే గురించి maganti.org లో ఒక వ్యాసం చదివినట్టు గుర్తు. ఆ సైటునోసారి తిరగెయ్యండి. ఇలాంటి వ్యాసాలకు అది మంచి నెలవు.
      (మార్కుస్ బార్ట్లే కోసం గూగిలించేటపుడు మార్కస్ బార్ట్లే, మార్కస్ బారట్లే,.. వగైరాల గురించి కూడా చూసే ఉంటారు. లేదంటే, అలా కూడా చూడండి.)

      Delete
    2. చదువరి గారు చెప్పినట్లు మాగంటి సైట్ లో మార్కస్ బార్ట్‌లీ గారి గురించి మంచి వివరాలున్నాయి.

      Delete
    3. వీకీపీడియా లింకు కూడా చూడండి.

      Delete
    4. ఆయన భార్యతో ఫోటోఇక్కడుంది.

      Delete
    5. Sorry for the multiple posts. I finally figured out how to place links, but, had trouble with multiple links in the same post.

      Delete
  10. గత ఆదివారం యుట్యూబ్‌లో ఈ సినిమా చూసాను. చాలా బాగుంది.
    నాకైతే అందరి నటీనటుల కంటే "కనకం" సహజంగా నటించినట్టు అనిపించింది.
    మిగతా పాత్రలు నెమ్మదిగా ఉండి కొంచెం బోరు కొట్టించాయి.

    ReplyDelete
    Replies
    1. bonagiri గారు,

      అలాగా! షావుకారు బాగా పాతసినిమా. అప్పటి సినిమాల్లో narration నెమ్మదిగా ఉంటం మూలాన.. (ఇప్పటి సినిమాలు అలవాటైనవారికి) కొంచెం బోరు కొట్టే అవకాశం ఉంది.

      కనకం చాలా ఎనర్జీ ఉన్న నటి. మీక్కూడా కనకం నచ్చినందుకు సంతోషం.

      Delete
    2. నిజానికి ఈ షావుకారు సినిమాలో‌ పాత్రలు సహజమైన రీతిలో నడిచాయి. మనం ప్రతీ విషయంలోనూ‌ వేగానికి అలవాటు పడటం కారణంగా అవి నెమ్మదిగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తాయంతే. మీరు జాగ్రత్తగా గమనించండి, అన్ని సినామాలలోనూ ముఖ్యంగా నేటివాటిలో పాత్రలు ఒకదాని వెనుక ఒకటి వేగంగా స్పందిస్తూ వేగంగా మాట్లాడుతూ‌ పోతాయి. ఇప్పటికీ, ఇంత వేగవంతమైన జీవితాల్లోనూ‌ మనం అంత చకచకా మాట్లడేస్తూ ఉంటామా అరుదుగా సందర్భాన్ని బట్టి తప్ప? అలా అరుచుకుంటూ మట్లాడుకుంటామా? ఈ కృత్రిమత్వాలను చూడటానికి అలవాటు పడిపోతున్నామంతే.

      Delete

comments will be moderated, will take sometime to appear.