Friday 21 June 2013

మధుబాల డార్లింగ్


"సుబ్బు!"

"ఆఁ!"

"ఈ వెన్నెల ఎంత హాయిగా యున్నది!"

"ఇట్లాంటి మాటలు మాట్లాడుకోవాల్సింది ప్రేమికులు. మనం కాదనుకుంటాను."

"ఈ చల్లని వెన్నెల సమయాన మధుబాల గుర్తోస్తుందోయి?"

"glenfiddich అడుగంటుతుంది. సరిపోదేమోనని భయంగా ఉందోయి."

"మొగలే ఆజమ్ లో మధుబాల ఎంతందంగా ఉంది! ఈ సృష్టిలో మధుబాల అద్భుత సౌందర్యానికి  గులాము కాని వెధవ ఎవడన్నా ఉంటాడా! మొగలే ఆజాం సినిమా చూడనివాడు గాడిద. మధుబాల అందాన్ని మెచ్చనివాడు పంది."

"సర్లే! ఇప్పుడు కాదన్నదెవరు? ఊరికే ఆయాసపడకు."

"పాపం! తొందరగా వెళ్ళిపోయింది సుబ్బు! అక్బర్ కొడుకేం ఖర్మ! సాక్షాత్తు బ్రహ్మదేవుడే తను సృష్టించిన అపరంజిబొమ్మ అందానికి దాసుడయ్యుంటాడు. అందుకనే తొందరగా తీసుకుపోయ్యాడు."

"అంతేనంటావా? పాపి చిరాయువు అన్నారు పెద్దలు. కాబట్టి మనం సేఫ్."




"ఆహాహా.. ఏం పాట సుబ్బు! 'ప్యార్ కియా తో డర్నా క్యా?' అంటూ పంచరంగుల్లో మెరిసిపోయింది. నా కళ్ళల్లోకళ్ళు పెట్టి చూస్తూ 'ప్రేమిస్తే తప్పేంటి? ఈ లోకంలో ప్రేమని తప్ప దేన్నీ లెక్క చేయను.' అంటుంటే ఆనందంతో ఏడుపొచ్చేసింది."

"వచ్చే ఉంటుంది. ఇప్పుడు నీ ఎమోషన్ చూస్తుంటే అర్ధమౌతుందిలే."

"గుండెలనిండా నిఖార్సైన ప్రేమభావం నింపుకున్న నిజాయితీ.. ఎవ్వరినీ లెక్కచేయ్యనీదేమో! స్వచ్చమైన ప్రేమ ముందు చావు చాలా చిన్నది. ఏంటి సుబ్బూ! అలా చూస్తున్నావ్!"

"ఏం లేదు. glenfiddich ని హడావుడిగా సేవిస్తే కలిగే దుష్పరిణామాలు గాంచుతున్నాను. అందుకే నిదానం ప్రధానం అన్నారు పెద్దలు."
             
"పాటకి అర్ధం తెలుసా సుబ్బూ! ప్రేమించటానికి భయం దేనికి? ప్రేమ తప్పెలా అవుతుంది? తప్పవటానికి ఇది దొంగతనం కాదు. ఈరోజు నా గుండెకధ చెపుతా. నన్ను చంపినాసరే, నా ప్రేమజ్యొతి వెలుగుతూనే ఉంటుంది. ఈ పరదాల చాటున నా ప్రేమని దాచలేను."

"ప్రేమ విషయంలో నేను వీక్. హిందీలో ఇంకా వీక్. కాబట్టి నువ్వు  చెప్పింది ఒప్పుకోక తప్పదు."

"ఆహా లతా దీది! నమస్కార్. నౌషాద్ భయ్యా! అదా బర్సే. ఆసిఫ్ భాయ్! ధన్యవాద్."

"మధుబాలని మర్చిపోయ్యావ్."

"ఛ ఊరుకో సుబ్బు! ఇంట్లో మనుషులకి ఎవరైనా థాంక్సులు చెబుతారా? అలా చెబితే మధుబాల డార్లింగ్ ఫీలవదూ!"


(pictures courtesy : Google)

22 comments:

  1. నిజం చెప్పండి.. మీరు ఏ కాలేజ్ లో చదువుతున్నారు?? ఆ ప్రొఫైల్ పిక్ మీది కాదు కదూ.. ఇంట్లో వాళ్లకు భయపడి వేరే పేరుతో రాస్తున్నారు కదూ? అలాగే అనిపిస్తోంది మరి మీ పోస్ట్స్ కొన్ని చూస్తే :)

    ReplyDelete
    Replies
    1. దయచేసి ఈ రహస్యం ఎవరికీ చెప్పొద్దు.

      Delete
    2. హహ్హహ్హహ.. :P

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. nenu priya gaaritho ekibhavaisthunnanu.mee thoughts anne young gaa untay.

      Delete
    5. @thanooj,

      >>mee thoughts anne young gaa untay.<<

      ధన్యవాద్!

      (కొంపదీసి మీరు నన్ను mentally retarded అనడంలేదు గదా!)

      Delete
  2. ప్రేమ విశ్వజనీనమైనది. మేమూ మధుబాలను మీరు ప్రేమించినంతగా ప్రేమిస్తున్నాం.

    ReplyDelete
    Replies
    1. మధుబాల ప్రేమికుల సంఘానికి సుస్వాగతం!

      Delete
  3. మధుబాల పోస్టులో సుబ్బు మరీ వినడానికే పరిమితుడయ్యాడు అంటేనే తెలుస్తోంది మధుబాల పై ఉన్న "ప్రేమ" ముందు సుబ్బు కూడా.....తక్కువే అని!!

    ReplyDelete
    Replies
    1. సుబ్బుకి ఆడలేడీస్ సంగతులు తెలీదు. అంచేత ఈ పోస్టులో సుబ్బుని నేను డామినేట్ చేసేశాను(of course, with the help of glenfeddich).

      Delete
  4. మధుబాల.. ఆహా ఎంత అద్భుతమైన నటి! కాశ్మీరం లో భర్త విడుదలకోసం ప్రయత్నించే అమాయకపు యువతిలా ఎంత బాగా నటించింది!! "కిట్టూ కి దొంగతనం అంటే నచ్చదు" అని జెంటిల్మెన్ సినిమాలో ఎంత బాగా చెప్తుంది!

    ReplyDelete
    Replies
    1. మీరు చెప్పేది ఒక తమిళనటి గూర్చి కదూ?

      (నేనావిడ సినిమాలు చూళ్ళేదు. ఇప్పుడు మీరు చెబుతున్నారు కాబట్టి, అవకాశం దొరికితే చూడ్డానికి ప్రయత్నిస్తాను.)

      Delete



  5. అద్భుతమైన అందానికి ఏదో శాపం ఉంటుందేమో ననిపిస్తుంది.ఉదాహరణకి ,మధుబాల,కాంచనమాల,మెర్లిన్ మన్రో,రాణీ పద్మిని--తల్చుకుంటే బాధగా వుంటుంది.

    ReplyDelete
  6. I feel that madhubala is merlini manro, at 60+ still i admire her( love analaemo. andukochina godava? :)

    ReplyDelete
  7. by the way... who is your best choice... madhu or savitri?

    ReplyDelete
    Replies
    1. ఫణి గారు,

      I don't think it is fair to compare Madhubala and Savitri.

      ఇంతకుముందోసారి రాశాను. నాకు అందాల పోటీల భామలు ప్రాణంలేని పిండిబొమ్మల్లా కనబడతారు. నాకు ఈ పాటలో మధుబాల అందంగా కనబడ్డానికి కారణం.. అతిసామాన్యురాలైన ఒక నర్తకిలో కనిపించిన (మహాచక్రవర్తిని లెక్కజెయ్యని) మొండిదనం, ధిక్కారం, తెగింపు మొదలైన లక్షణాలు. hats off to Asif's characterization of this role.

      ఈ 'characterization' అనే కారణం చేతనే నాకు సావిత్రి సావిత్రిలా గుర్తుండదు. ఒక పార్వతి, ఒక మిస్సమ్మ, ఒక మాయాశశిరేఖ.. ఇలా పాత్రలుగా గుర్తుండిపోయింది. ఆరకంగా చూస్తే.. 'మిస్సమ్మ'కి కనీసం దరిదాపులకి వచ్చేంత అందమైన యువతి ఇంతవరకు నాక్కనపళ్ళేదు.

      Delete
    2. మీ వివరణ ప్రకారమైతే.. ఎడాపెడా జనాలని దులిపేసే మీ అభిమాన రచయిత్రి మాత్రమే విశ్వసుందరి కిరీటానికి అర్హురాలు. బావుందండీ మీ టాస్టు! నేనేగనుక మీ పక్కింట్లో ఉండిఉంటే మీ టేస్టుగురించి మీ శ్రీమతిగారికి వివరించి ధిక్కారమంటే ఎంత సమ్మగా ఉంటుందో మీకు రుచి చూపించి మీ తిక్క కుదిర్చేవాడిని. హతవిధీ..అట్టి అవకాశమే లేకపోయెనే!

      Delete
    3. @సూర్య,

      నా అభిమాన రచయిత్రి?!

      (నాకు తెలియని నా అభిమాన రచయిత్రి ఎవరబ్బా!!)

      Delete
  8. మధుబాల చాలా బోలెడు అందచందాల నటి!నేనయితే చూడలేదుకాని చెక్కిన శిల్పంలా ఉండేదట!దిలీప్ కుమార్ను వెర్రిగా ప్రేమించింది అతనూ పెళ్ళిచేసుకోవడానికి అంగీకరించాడు కాని ఆమె తండ్రి బంగారుగుడ్డుపెట్టేబాతును వదులుకోవడానికి ఇష్టపడలేదు!దిలీప్ తానే ఒక సినిమాను నిర్మించి దాని ఆదాయం మొత్తం ఆమె తండ్రికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు అయినా అతను ఆమె పెళ్లి దిలీప్ తో జరపడానికి అంగీకరించలేదు !అప్పుడు దిలీప్ ఆమె తండ్రిని వదలివస్తే వివాహం చేసుకుందామని ఏదో ఒకటి తేల్చుకొమ్మన్నాడు!మధు తండ్రి అనుమతిస్తేనే వివాహం చేసుకుందామన్నది!ఇక అంతే!దిలీప్ ఒక నిర్మాత మధుబాలమీద పెట్టిన కేసులో ఆమెకు వ్యతిరేకముగా కోర్టులో సాక్ష్యమ్ చెప్పాడు!గాయకుడు కిషోర్ కుమార్ ను పెళ్లి చేసుకున్నా అతను ఆమెను సరిగా చూడలేదు!అనారోగ్యంతో మధుబాల చిన్నవయసులోనే చనిపోయింది!చల్తీ కా నాం గాడీ లో హాస్యపాత్రలో కిషోర్ తో చలాకీగా చాలా బాగా నటించింది!మధుబాల ను సావిత్రితో పోల్చలేము!సావిత్రి మహానటి.ఏ రసమయినా అవలీలగా ఒప్పిస్తుంది!సాధారణంగా సావిత్రిని మీనాకుమారితో సుచిత్రాసేన్ తో పోలుస్తుంటారు కాని సావిత్రి వారిని మించి నటించింది!

    ReplyDelete
    Replies
    1. వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      మధుబాలని మీరు చూళ్ళేదా! ఇప్పుడు యూట్యూబు నిండా ఆవిడ పాటలు ఉన్నాయిగా!!

      మధుబాల VSD (ventricular septal defect) అనే ఒక గుండెజబ్బు (పుట్టినప్పుడే ఉంటుంది) తో చనిపోయింది. ఆవిడ ఇంగ్లాండులో కూడా చాలా వైద్యం చేయించుకుంది. ఇప్పుడు VSD కి గుంటూర్లో కూడా ఆరోగ్యశ్రీ కార్డుపై ఉచితంగా వైద్యం చేస్తున్నారు. చాలా routine surgery అయిపొయింది.

      సుచిత్రా సేన్ సినిమాలు ('ఆంధీ' ఒక్కటే చూశాను) నేను చూళ్ళేదు. కాబట్టి ఆవిడ సావిత్రి కన్నా తక్కువనటి అని చెప్పటం కష్టం. ఎవరి భాష / నటి వాళ్లకి ఎక్కువ.

      కిశోర్ కుమార్ మధుబాలని 'సరీగా చూడలేదు' అనడానికి ఆధారం లేదు. వారి relationship లో కిశోర్ కూడా పెద్దగా బావుకున్నదేమీ లేదు.

      (అయినా ఈ 'సరీగా చూడటం' అనే కాన్సెప్ట్ కొద్దిగా క్లిష్టతరమైనది. పెంపుడు జంతువుల పట్ల వర్తించినంత సింపుల్ గా మనుషులకి వర్తించదనుకుంటాను.)

      Delete


  9. సావిత్రిని మీనాకుమారి తో పోలుస్తారు నటనలో.అంటే సావిత్రి అందంగాఉండదనిగాని ,మధుబాల మంచి నటి కాదని కాదు.మధుబాల సౌందర్యం ఆమె నటనని డామినేట్ చేసింది.అలాగే సావిత్రి అభినయం ఆమె అందాన్ని డామినేట్ చేసింది.ఈరోజుల్లో ఐతే మధుబాల VSD సర్జెరీ ద్వారా బాగయి ఉండేది.అప్పట్లో cardiac surgery,treatment ,ఇంత అభివృద్ధి చెందలేదు.

    ReplyDelete
    Replies
    1. కమనీయం గారు,

      అసలు 'అందం' అంటే ఏమిటి!? ఒక పోస్ట్ రాయాల్సినంత పెద్ద టాపిక్. వీలు చూసుకుని రాస్తాను.

      (నేను అందం గూర్చి రాసిన విశేషణలు ఈ పాటకి మాత్రమే పరిమితం.)

      Delete

comments will be moderated, will take sometime to appear.