Monday 17 December 2012

యబిచారం.. తప్పు కాదు! మంచిది కూడా!!

"ఇదిగో సారూ! యబిచారం సేసేటప్పుడు ఒళ్ళంతా యమ యేడి. ఒకటే సెగలు పొగలు. సేసిం తరవాత కళ్ళమ్మట, సెవుల్లో యేడి పొల్లుకొస్తంది. కాళ్ళూ, సేతులూ ఒకటే పీక్కపోతన్నాయి. ఎన్ని కొబ్బరి బొండాలు తాగినా బాడీలో ఓవర్ వీట్ తగ్గటల్లా. ఆ యేడంతా పోవాలా. బాబ్బాబు! మంచి మందులు రాయండే! సచ్చి నీ కడుపున పుడతా." అన్నాడు పుల్లయ్య.

పుల్లయ్య ఒక సన్నకారు రైతు. కష్టజీవి. అతనిది ప్రకాశం జిల్లా పుల్లల చెరువు ప్రాంతం. ఎత్తుగా, బలంగా ఉంటాడు. తెల్ల చొక్కా. రంగు లుంగీ. భుజంపై తుండుగుడ్డ. నున్నగా గీయించిన గెడ్డం. సన్నటి మీసం. తలకి పాగా.

ఓరి వీడి దుంప దెగ! హాయిగా వ్యభిచారం చేసుకుంటాడా! దానికి నేను మందులివ్వాలా! హథవిధి! సమాజంలో డాక్టర్ల పరిస్థితి ఎంతలా దిగజారిపోయింది! అసలు నన్నిట్లా అడగడానికి ఈ పుల్లయ్యకెంత ధైర్యం! నాకు ఒళ్ళు మండిపోయింది.

"ఏం పుల్లయ్యా! బ్రతకాలని లేదా? ఈ రోజుల్లో వ్యభిచారం ఆత్మహత్యతో సమానం. ఎయిడ్స్ రోగం వస్తుంది. హెపటైటిస్ వ్యాధి వస్తుంది. పిల్లలు గల వాడివి. వ్యభిచారం, గిభిచారం అంటూ వెధవ్వేషాలెయ్యకు. ఆ పాడు అలవాటు అర్జంటుగా బంద్ చేసెయ్యి. అర్ధమైందా?" గద్దించాను.

పుల్లయ్య ఆశ్చర్యపొయ్యాడు. ఏదో ఆలోచించాడు. సందేహంగా, బెరుగ్గా అడిగాడు. "అప్పుడప్పుడయినా.. "

"నీకసలు బుద్ధుందా? ఆప్పుడు లేదు ఇప్పుడు లేదు. నువ్వు చేసేది చాలా ప్రమాదకరమైన పని. అన్యాయంగా చచ్చిపోతావ్. గెట్ లాస్ట్!" కోపంగా అరిచాను.

పుల్లయ్య భయపడి పోయాడు.

"అట్లాగా! నాకు తెలవదు సార్! తప్పయిపోయిందయ్యా. ఇంకెప్పుడూ ఆ పాడు పని సెయ్యను. చదువు సంధ్య లేని మోటోణ్ణి సార్. తెలిసీ తెలీక ఏదో వాగాను. కోపం చేసుకోమాక సార్. ఉంటా దొరా!" అంటూ ఒంగి ఒంగి దణ్ణాలు పెడుతూ నిష్క్రమించాడు పుల్లయ్య.

నాకు మూడాఫ్ అయిపొయింది. గవర్నమెంట్ ఎయిడ్స్ ప్రాజెక్టులంటూ కోట్లు ఖర్చు పెడుతుంది. అయినా ఏం లాభం? ఈ పుల్లయ్య వంటి అజ్ఞానులున్నంత కాలం ఈ దేశం బాగుపడదు.

నెల రోజుల తరవాత..

ఆ రోజు హాస్పిటల్లో సోమవారం హడావుడి. మధ్యాహ్నం రెండింటి సమయంలో ఒక పొడుగాటి వ్యక్తి నీరసంగా నా కన్సల్టేషన్ చాంబర్లోకి అడుగెట్టాడు. ఎక్కడో చూసినట్లుందే! అరె! పుల్లయ్య! అతని ఆకారం చూసి ఆశ్చర్యపోయ్యాను. గుర్తు పట్టలేనంతగా చిక్కిపోయున్నాడు. పెరిగిన గడ్డం. రేగిన జుట్టు. నలిగిన చొక్కా. మాసిపోయిన లుంగీ. గాజు కళ్ళు. నడిచి వచ్చిన శవంలా ఉన్నాడు.

పక్కనే ఒక ఆడమనిషి. భార్య అనుకుంటాను. బక్కగా ఎండిన కట్టెలా ఉంది. కర్రకి చీర కట్టినట్లు, దుఖానికి దుస్తులు తొడిగినట్లుంది. పెద్దాస్పత్రిలో పెద్ద జబ్బుతో పది రోజులు వైద్యం చేయించుకుని ఇప్పుడే డిశ్చార్జ్ అయినట్లుంది. నన్ను బెరుకుగా చూస్తూ నమస్కరించింది.

"ఈ మడిసి నా ఇంటాయనండి. మీ కాడ్నించి వచ్చినంక బాగా తేడా పడిపోయిండు సార్. పొద్దుగూకులు ఏందో ఆలోచిస్తా ఉంటాడు. ఉన్నట్టుండి పిల్లలు జాగరత్తంటూ ఏడస్తన్నాడు. నలుగురు మడుసుల కట్టం చేసేటోడు. మూడు పూటలా మడంతలు తినోటోడు. ఆ ఇజాన మంచాన పడ్డాడు. సూళ్ళేకపోతన్నా. ఆ మడిసికేవన్నా అయితే పిల్లలు, నేను ఏవయిపోవాలా. మాకు సావు తప్ప యేరే దారి లేదు దొరా!" అంటూ కన్నీరు పెట్టుకుంది.

'అవును తల్లీ అవును.. ఏ దేశ మేగినా ఏమున్నది గర్వ కారణం? స్త్రీ జాతి సమస్తము పురుష పీడన పరాయణం. ఏ మొగుడి చరిత్ర చూసినా అంతా విశృంఖల కేళీ విలాసము. భార్యల బ్రతుకు ఖేద భరిత విలాపములే. నీ వ్యధాభరిత దుఃఖ గాధ గాంచి సానుభూతి వినా నేనేమివ్వగలను తల్లీ?' ఆలోచిస్తూ ఆవిడ చెప్పిందంతా విన్నాను.

తరవాత మళ్ళీ మాట్లాడతానని చెప్పి ఆమెని బయటకి పంపాను. రూంలో పుల్లయ్య, నేను. కొద్దిసేపు నిశ్శబ్దం.

"ఏంటి పుల్లయ్యా! ఏమయ్యింది?" అడిగాను.

అప్పటిదాకా కనీసం నోరు విప్పని పుల్లయ్య ఒక్కసారిగా పెద్దగా చిన్నపిల్లాళ్ళా ఏడవడం మొదలెట్టాడు. కొద్దిసేపు అలాగే ఏడవనిచ్చాను.

"ఆ రోజు మీరు యబిచారం సేస్తే సస్తానని సెప్పారు. యెల్లిన నాలుగు రోజులకే తప్పు సేసాను దొరా. పిల్లలు సిన్నోళ్ళు. నా పెళ్ళాం ఎర్రి బాగుల్ది. నన్ను బతికించు దొరా!" ఏడుస్తూనే చెప్పాడు.

"చిలక్కి చెప్పినట్లు చెప్పాను. బుద్ధుండాలి. ఇప్పుడేడ్చి ఏం లాభం? అనుభవించు." విసుక్కున్నాను.

"మీరు కరస్టుగానే సెప్పార్సార్. కానీ మా ఆడది ఊరుకోటల్లేదు. రెచ్చగొడతాంది. తప్పని సెప్పినా ఇనుకోటల్లేదు. దానికి బుద్ది సెప్పండి. గడ్డి పెట్టండి. అందుకే యెంటబెట్టుకోచ్చా." కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు పుల్లయ్య.

"ఆ దరిద్రపు అలవాటుతో నీ భార్యకి సంబంధమేంటి పుల్లయ్యా?" చిరాగ్గా అన్నాను.

"మరెవరితో సంబందం? నే యబిచారం చేసేది మా ఆడోళ్ళతోనే గదా!" ఆశ్చర్యపోతూ అన్నాడు పుల్లయ్య.

గతుక్కుమన్నాను. అర్ధం కాలేదు. ఎక్కడో ఏదో పొరబాటు జరిగింది. కుడికన్ను అదరసాగింది. మనసు కీడు శంకించ సాగింది.

"పుల్లయ్యా! నీ దృష్టిలో 'యబిచారం' అంటే ఏమిటి?" సూటిగా చూస్తూ నిదానంగా అడిగాను.

"నువ్వు మరీ సార్! ఎంత సదువు లేకపోయినా ఆ మాత్రం తెలీదా యేంది? యబిచారం అంటే ఆడామగా సంబందమేగా?" సిగ్గుపడ్డాడు పుల్లయ్య.

చచ్చితిని. ఘోరం జరిగిపోయింది. మహాపాపం చేశాను. పుల్లయ్య భాష అర్ధం చేసుకోలేక అతనికి తీవ్రమైన అన్యాయం చేశాను. పుల్లయ్య భాషలో 'యబిచారం' అంటే భార్యతో సెక్సువల్ ఇంటర్ కోర్స్! గ్రామీణ వాతావరణం, భాష పట్ల నాకు అవగాహన లేకపోవడం పుల్లయ్య పట్ల శాపంగా పరిణమించింది. ఒక్కసారిగా నీరసం ఆవహించింది.

ఆలోచనలో పడ్డాను. ఇప్పుడు నా కర్తవ్యమేమి? పుల్లయ్యకి సారీ చెప్పినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. జరిగిన పొరబాటు వివరించినా పుల్లయ్య నమ్మకపోవచ్చు. అసలిక్కడ సమస్య జరిగినదానికి సారీలు చెప్పుకోవడం కాదు. జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలనేదే. క్షణకాలం బుర్రకి సాన బెట్టాను. మెరుపు మెరిసింది.

"చూడు పుల్లయ్యా! నువ్వు చాలా అదృష్టవంతుడువి. పదిరోజుల క్రితమే అమెరికావాడు వ్యభిచారానికి మందు కనిపెట్టాడు. నీక్కొన్ని గొట్టాలు రాసిస్తా. ఓ నెల్రోజులు వాడు. ఆ గొట్టాలు నీ ఒంట్లో వేడి లాగేస్తాయి. హాయిగా ఉంటావు." అన్నాను.

నీరసంగా, దుఃఖంగా ఉన్న పుల్లయ్య మొహం ఒక్కసారిగా కళకళలాడసాగింది. ఒంగిపోయి, ఒరిగిపోయి కూర్చున్నవాడు నిటారుగా అయిపోయాడు.

"నిజంగానా సారూ? మరి వెయిడ్స్ రోగం.. "

"ఇంకే రోగం నీ దగ్గరికి రాదు. నీకు హామీ ఇస్తున్నాను. నీ ఇష్టమొచ్చినన్ని సార్లు వ్యభిచారం చేసుకో. నీకేమవ్వదు. నాదీ పూచి. అయితే ఈ గొట్టాలు నీ భార్యతో వ్యభిచారం చెయ్యడానికే పని చేస్తాయి. బయటవాళ్ళతో వ్యభిచారం చేస్తే రియాక్షన్ ఇస్తాయి. చాలా ప్రమాదం." పుల్లయ్య చేతిని నా చేతిలోకి తీసుకుని అనునయిస్తూ, ధైర్యం చెప్పాను.

"నాకట్టాంటి పాడలవాట్లు లెవ్వు సారు. దేవుళ్ళాంటోరు. మీ కాడ అబద్దం సెపుతానా!" అన్నాడు పుల్లయ్య.

పుల్లయ్య భార్యని లోపలకి పిలిపించి ఆమెకి కూడా ధైర్యం చెప్పాను. పుల్లయ్యకి కొద్దిపాటి నరాల బలహీనత ఉందని, మందులు వాడితే గ్యారంటీగా తగ్గిపోతుందని ఘాట్టిగా నొక్కి వక్కాణించాను. ఖరీదైన 'బి కాంప్లెక్స్' గొట్టాలు రాసిచ్చాను. ఆ గొట్టాలు అన్నం తిన్న పది నిమిషాల్లోనే మింగాలనీ.. రోజూ పాలు, గుడ్లు తీసుకుంటే ఇంకా బాగా పని చేస్తాయని పలు జాగ్రత్తలు చెప్పాను.

ఇంకో నెల రోజులు తరవాత..

పుల్లయ్య మళ్ళీ వచ్చాడు. చలాకీగా, హుషారుగా ఉన్నాడు. ఒళ్ళు చేశాడు. దాదాపు మొదట్లో నేచూసినప్పటిలానే ఉన్నాడు. నాకు చాలా రిలీఫ్ గా అనిపించింది. చేసిన తప్పుని దిద్దుకునే అవకాశం లభించింది. నావల్ల ఒక అమాయకుడు ఎంత బాధ ననుభవించాడు! మొత్తానికి కథ సుఖాంతమైంది. థాంక్ గాడ్!

"మీరిచ్చిన గొట్టాలు బాగా పని చేశాయి సార్! ఇప్పుడు యబిచారం చేసినాంక యేడి పారాడటల్లేదు. మందులు ఇంకో నెల వాడితే ఇబ్బంది లేదుగా?" అన్నాడు.

"అస్సలు ఇబ్బంది లేదు పుల్లయ్యా! నీ ఇష్టం." రిలాక్స్డ్ గా అన్నాను.

సందేహిస్తూ నెమ్మదిగా అడిగాడు పుల్లయ్య.

"అయితే యబిచారం సేస్తే తప్పు లేదుగా సారూ?"

"అదంతా పాతమాట పుల్లయ్యా! ఇప్పుడు నువ్వు వాడింది ఆషామాషీ మందులు కాదు. అమెరికా వాడి మందులు. వాటికి తిరుగు లేదు. ఇంక నీ ఇష్టం. అసలిప్పుడు వ్యభిచారం ఎంత చేస్తే అంత మంచిది. బాగా చాకిరీ చేస్తావు కదా! ఆ వేడిని వ్యభిచారం ఎప్పటికప్పుడు బయటకి పంపించేస్తుంది." స్థిరంగా అన్నాను.

పుల్లయ్య ఆనందంగా ఇంకోసారి నమస్కరించి నిష్క్రమించాడు.

చివరి తోక..

ఇది కథ కాదు. నా అనుభవం. పేషంట్ పేరు, ప్రాంతం మార్చాను.

(picture courtesy : Google)

39 comments:

  1. I'm glad you "fixed" his problem, which brings another aspect of our profession!! Language and communication skills are as important as having the knowledge to diagnose and treat the diseases. Hope he didn't google "yabicharam" and learn all / actual meaning and didn't do what you thought he did in the beginning!!! Just kidding

    ReplyDelete
    Replies
    1. I was worried about that possibility also. But i had no choice.

      Delete
  2. నిజమా? ఆశ్చర్యంగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. అవును. ఆశ్చర్యమే! ఈ లోకంలో డాక్టర్లుగా నావంటి అజ్ఞానులు కూడా ఉన్నారు!

      Delete
  3. డాక్టర్ గారు,

    అదే బలమనుకొని ఎక్కడబడితే అక్కడ చేస్తాడేమో చూడండి

    మొత్తానికి మంచి సొల్యూషన్ చెప్పారు

    జి రమేష్ బాబు
    గుంటూరు

    ReplyDelete
    Replies
    1. డియర్ రమేష్ బాబు,

      నేను ఆ జాగ్రత్త కూడా తీసుకునే సలహా చెప్పాను. రాయడంలో మర్చిపొయ్యాను. ఇప్పుడు incorporate చేస్తూ ఎడిట్ చేశాను. థాంక్స్.

      Delete
  4. really interesting

    ReplyDelete
  5. సన్నబడ్డ పుల్లయ్యని మీరు చూడగానే నేనూ అనుకున్నాను పాపం వెయిడ్స్ సోకిందేమోనని, హత విధీ!! ఎప్పుడూ నవ్వించే మీరు పొద్దున్నే బాధ పెట్టబోతున్నారేమో అనిపించింది. అసలు విషయం తెలిసి రిలాక్సయ్యాను. మొత్తానికి సమస్యని తెలివిగా పరిష్కరించారు. అతని భాష మీకు అర్ధం కాకపోయినా మీ సమయస్ఫూర్తి అతడిని కాపాడింది.

    ReplyDelete
    Replies
    1. మాధవ్ గారు,

      పేషంట్ చెప్పేది ఓపిగ్గా వినడం, అర్ధం చేసుకోవడం.. ఆపై (వీలైనంత మేరకు) ఎఫెక్టివ్ గా కమ్యూనికేట్ చెయ్యగలగడం డాక్టర్ల ఫండమెంటల్ డ్యూటీ. ఒక్కోసారి హడావుడిలో ఓవర్ లుక్ చేసెయ్యడం వల్ల పేషంట్లకి నష్టం జరుగుతుంది. ఆ విధంగా ఈ 'పుల్లయ్య కేస్' నన్ను చాలా ఎడ్యుకేట్ చేసింది.

      Delete
  6. నాకెందుకో ఇక్కడా ఎవరి తప్పు లేదనిపిస్తుంది.
    వ్యభిచారం అంటే అర్ధం అయినకి తెలియకపోవడం, మీకు తెలియడం.
    ఎందుకైనా మంచిది మిగతా పదాలకి కూడా అర్ధం కనుక్కుని ఉండాల్సింది. అంటే సంసారం, కాపురం etc.. ఏమో అందులో ఏ అర్దాలున్నాయో , ఇంకొకరు వచ్చి సంసారం చేస్తుంటే చాలా ప్రొబ్లెంస్ వస్తున్నాయని చెప్తే ?? ముందు ముందు పనికొస్తాయి కదా.
    :venkat

    ReplyDelete
    Replies
    1. వెంకట్ గారు,

      ఈ కేసులో మాత్రం తప్పు పూర్తిగా నాదే. ఈ కేసే కాదు.. ఏ కేసులోనైనా పేషంటే కరెక్ట్.

      గ్రామీణుల వాడుక పదాలు తెలీకపోతే ఇబ్బందులు తప్పవు.

      అవును. మీరు సూచించినట్లు వాళ్ళతోనే సమయం వెచ్చించడం వల్ల డాక్టర్లకి కూడా వాడుక భాష బాగా తెలుస్తుంది.. అలవడుతుంది. ఇది వైద్యవృత్తిలో ఉన్నవారికి ఎంతో ఉపయోగం. పేషంటుకి సాధ్యమైనంత సమయం ఇవ్వడం మంచి డాక్టర్ లక్షణం (ఇప్పుడు నామీద నాకు అనుమానం కలుగుతుంది).

      Delete
  7. పిచ్చిపుల్లయ్య దగ్గర ఫీజెంత లాగారు? నిజం చెప్పండి.:)
    అతనికి అర్థం వివరించకపోవడాన్ని అధిక్షేపిస్తున్నా. రేపు మరో కార్పొరేట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడనుకోండి, ఇల్లు గుల్లైపోదూ?

    ReplyDelete
    Replies
    1. SNKR గారు,

      ఇప్పుడు డాక్టర్ల ఫీజుల వివరాలు.. హోటల్లో ఇడ్లీ, అట్టు ధరల పట్టిక వలె బోర్డులు ఉంటున్నాయండి. లేకపోతే మా హాస్పిటల్ రిజిస్ట్రేషన్లు రద్దవుతాయి.

      పుల్లయ్యని ఎడ్యుకేట్ చెయ్యడం కన్నా, సమస్యని పరిష్కరించడం ముఖ్యం కదూ!

      Delete
    2. No, Doctor, no! Temporary cure is not a solution.

      “Give a man a fish; you have fed him for today. Teach a man to fish; and you have fed him for a lifetime”

      Delete
    3. SNKR గారు,

      మీరు చెప్పింది వాస్తవం. పూర్తిగా ఒప్పుకుంటున్నాను.

      అయినా మీరేంటండి మరీను.. ప్రభుత్వాలే 'రొజుకో చేపనిస్తాం. హాయిగా ఒండుకు తినండి.' అంటుంటే.. బ్రతుకుతెరువు కోసం వైద్యం చేసుకుంటున్న అర్భకుణ్ణి.. నన్ను ప్రభుత్వం వారి పని చెయ్యమంటున్నారు!

      Delete
  8. @ఎడ్యుకేట్ చెయ్యడం కన్నా, సమస్యని పరిష్కరించడం ముఖ్యం

    ఎడ్యుకేట్ చెయ్యాలని తాపత్రయ పడటం వృధా అంటారు. నమ్మకం ఉంటె వివరించి చెప్పనవసరం లేకుండానే చెప్పింది ఫాలో అవుతారు కదా. అయినా పాడు మనసు ఊర్కోదు. మల్లి మల్లి చదివి నవ్వుకున్నాను. ఆ పదాల కూర్పుకోసం పది సార్లు చదివినా చాలదు :)

    ReplyDelete
    Replies
    1. Mauli గారు,

      పేషంట్లని ఎడ్యుకేట్ చెయ్యాలా!!!

      వృధా అనను గానీ.. ప్రాక్టికల్ గా చాలా కష్టం.

      మా దగ్గరకొచ్చే వాళ్ళల్లో ఎక్కువమంది మంత్రం, తంత్రం, గాలి, ధూళీ, దెయ్యం, భూతం, పిశాచం, మందు కక్కించటం, మసీదు, దర్గా, చర్చి, తాయెత్తు, వాస్తు, ఆయుర్వేదం, హోమియోపతి, ఫ్లవర్ థెరపి, ఆయిల్ పుల్లింగ్, రేకీ.. ఇంకా ఏమన్నా ఉంటే అవి కూడా.. ఇలా అన్నీ అయ్యాక.. తప్పనిసరి పరిస్థితుల్లో (ఏడ్చుకుంటూ) వస్తారు. చదువుకున్నవాళ్ళకయితే నమ్మకాలు మరీమరీ ఎక్కువ.

      వీళ్ళని ఎడ్యుకేట్ చెయ్యాలంటే.. మా గుంటూరుకే కనీసం లక్ష మంది వాలంటీర్లు కావాలి. ఈ ఎడ్యుకేట్ చేసే ప్రాసెస్ లో ఆ వాలంటీర్లలో కొందరు నెత్తురు కక్కుకుని (వాగీ వాగీ) చస్తారు. కావున సైకియాట్రీ పేషంట్లని, వారి కుటుంబాన్ని ఎడ్యుకేట్ చెయ్యడం ప్రాణాంతకమైనది. అంచేత.. బ్రతుకుతెరువు కోసం ఈ విధంగా చచ్చేకన్నా.. మా ఊళ్ళో ఆటో నడుపుకుంటూ హాయిగా బతికెయ్యొచ్చు.

      మొదట్లో (బుద్ధి లేక) చెప్పడానికి ప్రయత్నించేవాడిని. ఇప్పుడు అవసరమైనంత మేరకు (వైద్యానికి కో-ఆపరేట్ చేసేంత మేరకు) చెబుతున్నాను.

      Delete
    2. This comment has more punch than the actual post. My hat is off.

      Delete
    3. అ యితే ఆయుర్వేదం పనిచేయదంటారా డాక్టర్ గారు. మానసిక సమస్యలకి.

      భాస్కర్.

      Delete
    4. @ చాతకం గారు

      BINGO

      Delete
  9. మీధైర్యానికి నా జొహారులు. ఇటువంటి విషయాన్ని చాలా సాధారణం గా ఏటువంటి అసభ్యత కి తావు లేకుండా చాలా బాగా చెప్పేరు.

    ReplyDelete
    Replies
    1. kamudha గారు,

      హాస్పిటల్ అనుభవం గుర్తొచ్చి.. చకచకా రాసి పడేశాను. ఇప్పుడు మీ వ్యాఖ్య చదివి ఆశ్చర్యపోతున్నాను.

      (నేను మొదట్నుండీ అంతేనండి! ఏది రాసినా చాలా ధైర్యంగా రాస్తాను!!)

      Delete
  10. అంతా బానే ఉంది కాని, ఆ పేషెంటు మామూలు డాక్టర్ దగ్గరకి వెళ్ళకుండా, మీ దగ్గరకి ఎందుకు వచ్చాడంట?
    అతనో "పిచ్చి పుల్లయ్య" అని చెప్పకండి.

    ReplyDelete
    Replies
    1. "ఆ పేషెంటు మామూలు డాక్టర్ దగ్గరకి వెళ్ళకుండా, మీ దగ్గరకి ఎందుకు వచ్చాడంట?"

      "bonagiri" గారి మాటే నాది కూడానయ్యా నీ దగ్గర్కి వచ్చిన ఆడికి పిచ్చా??
      లేకపోతే ఇదంతా చదివి నిజమని నమ్మటాకి మేము పిచ్చినాయాళ్ళమా??

      Delete
    2. bonagiri గారు,

      ఈ ప్రశ్న మీదగ్గర్నుండి రావడం ఆశ్చర్యంగా ఉంది. మీకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.

      సైకియాట్రిస్టుగా బ్లాగుల్లో నా పేషంట్ల గూర్చి (ఎంత పేర్లు, ఊర్లు మార్చినా) రాయడంలో నాక్కొన్ని ఇబ్బందులున్నాయి. ఇంతకు ముందోసారి నా ఆస్పత్రి కబుర్లు రాసినప్పుడు.. ఏక్టివ్ గా ప్రాక్టీస్ చేస్తూ.. ఇలా పేషంట్ల గూర్చి రాయడాన్ని ఒక అజ్ఞాత తీవ్రంగా తప్పు పట్టారు. అలా రాయొద్దని నాకు మెయిల్స్ కూడా వచ్చాయి.

      నేనీ పోస్ట్ రాసేప్పుడు ఎక్కడా నా పేషంట్ గూర్చి నెగెటివ్ గా రాయలేదు. అతని భావం నాకు అర్ధం కాక.. నేను చేసిన పొరబాటుగా మాత్రమే రాశాను.

      అయితే ఈ పోస్ట్ ఇలా రాయడం కూడా నా సైకియాట్రీ మిత్రులకి నచ్చలేదు.. పేషంట్లని ఎగతాళి చేసినట్లు ఉంటుందని, breach of confidentiality అవుతుందేమోనని.

      నేను నా పేషంటుకి 'పుల్లయ్య' అనే పేరు 'ఇచ్చాను'. మీరు ఆ పేరుని ఎగతాళి చెయ్యడం సభ్యత కాదు.

      మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. అతను నా దగ్గరకి panic disorder తో వచ్చాడు. ఆ కేస్ షీట్ చాంతాడంత ఉంది. అయితే ఈ వివరాలు నే రాయదలచుకున్న విషయానికి అనవసరం. రాసేప్పుడు 'సంక్షిప్తత' కూడా పాటిస్తాను.

      సమాధానం పొడుగ్గా అయిపోయింది. సారీ!

      Delete
    3. @Anonymous (17:02),

      మీరు ఆవేశం తగ్గించుకుంటే మంచిదేమో! ఆపై మీ ఇష్టం. వ్యాఖ్యకి ధన్యవాదాలు.

      Delete
    4. అయ్యో! సారీ అండి.
      ఆ రెండో వాక్యం రాయకుండా ఉండాల్సింది. ఏదో ప్రాస కలిసిందని వ్రాసేసాను.
      అతను వేరే సమస్యతో మీ దగ్గరకు వచ్చాడని మీరు వ్రాసి ఉంటే అపార్థం జరిగేది కాదు.

      Delete
    5. బోనగిరి గారు ,

      మీరొక్కరే అడిగారు, కాని అందరికి వచ్చిన ఆలోచనే అయ్యుంటుంది. మనకి తెలిసిన, మన వూరి డాక్టర్ అంటే అన్నింటికీ సంప్రదిస్తాము. అంతే అయ్యుండొచ్చు అని వదిలేస్తాము :)
      ఆ కేసు వివరాలన్నీ వ్రాసి మనల్ని ఎడ్యుకేట్ చెయ్యాలంటే వాలంటీర్లు కావాలేమో :)

      Delete
  11. గోపరాజు రవి18 December 2012 at 18:49

    दूसरोम्पर हसना आसान है - अपने आप पर हसना सीखो गिंदगी आसन होजाईगी అన్నాడు ఓ గొప్పవాడు (నేనేలే).

    చేసిన పాపము చెప్పుకుంటే పోతుందని కూడా పెద్దలు చెప్పారు. పేరున్న డాక్టరువైనా చేసిన తప్పు ఒప్పుకుని, దిద్దుకున్నావు.

    శెభాష్ రమణా శెభాష్, వేసుకో రొండు వీరతాళ్ళు.

    నీతి - క్లయింట్ అయినా పేషెంట్ అయినా వాళ్ళు చెప్పేటప్పుడు సరదాగా కాకుండా శ్రధగా వినాలి.

    గోపరాజు రవి

    ReplyDelete
    Replies
    1. డియర్ రవి,

      థాంక్స్! ఒక వీరతాడు glenlivet 18 గాడికి చెందుతుంది!

      Delete
    2. సీఖ్‌తా కాని, 'గిందగీ' అంటే ఏమిటో మీరు చెప్పాలి. హిందీమాస్టారు చేతిలో తిన్న దెబ్బలు నాకు యాద్ కొస్తున్నాయి. మీ ఇందీ మాస్టారు సానా మంచోడని తెలుస్తొంది. :)

      Delete
    3. గోపరాజు రవి19 December 2012 at 11:37

      @SNKR,

      ముద్రారాక్షసము

      जिन्दगी కు బదులుగా गिंदगी అని టైపు అయ్యింది. విజ్ఞులు సహృదయంతో అర్థంచేసుకుని క్షమించగలరు.

      గోపరాజు రవి

      Delete
    4. సో, నేననుకున్నట్టు 'గందగీ' కాదన్న మాట! :))
      అర్థమయినా అర్థం కానట్టు వుండే ఆనందీ కుచ్ ఔర్ హై. :) ఈమాత్రానికే సహృదయాలు, విజ్ఞులు, క్షమాపణలెందుకు సార్? take it easy.

      Delete
  12. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  13. You are really a gifted writer Ramana. Your style is very impressive.

    ReplyDelete
    Replies
    1. డియర్ సుధ,

      మనూళ్ళో బిల్డింగులెక్కువైపోయి.. మునగచెట్లు మాయమైపొయ్యాయి. అదీగాక నాకు చెట్లెక్కడం రాదు.. భయం కూడా! కాబట్టి నీ కామెంట్ చదివి కూడా నేల మీదే నిలబడి ఉన్నాను. థాంక్యూ!

      Delete
  14. మీ పోస్ట్ చదివి అవాక్కయ్యానండీ! నిజంగానా!! strange.
    కాముధ గారి మాటే నాదీను :)

    మీ పోస్ట్ చదివాక చివర్లో నాకు అనిపిచింది...తాత్కాలికంగా సమస్యని పరిష్కరించారుగానీ దానర్థం ఏమిటో అతనికి వివరించి చెప్పుండాల్సింది అని, కానీ మీ కామెంట్లు చూసాక అర్థమయ్యింది అది అంత సులువైన పని కాదని :)

    ReplyDelete
  15. సూపర్... ;) ;)
    అ.సౌమ్య గారి మాటే నాదీనూ ;)

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.