Wednesday 14 November 2012

గోవిందరాజుల సుబ్బారావు.. నా తికమక!

                                                  - 1 -

అమ్మానాన్నలతో  సినిమాకి  రెడీ  అయిపొయ్యాను.

"అమ్మా! ఏం సినిమాకెళ్తున్నాం?"

"కన్యాశుల్కం."

"పేరేంటి అలా ఉంది! ఫైటింగులున్నాయా?"

"ఉండవు. నీకు నచ్చదేమో. పోనీ సినిమా మానేసి ఆడుకోరాదూ!"

ఫైటింగుల్లేకుండా సినిమా ఎందుకు తీస్తారో! నాకు చికాగ్గా అనిపించింది. అయితే నాకో నియమం ఉంది. సినిమా చూడ్డనికి వచ్చిన ఏ అవకాశమూ వదలరాదు. నచ్చినా, నచ్చకపోయినా సినిమా చూసి తీరాలి. ఇది నా ప్రతిజ్ఞ!

అమ్మానాన్నల మధ్య కూర్చుని సినిమా చూశాను. సినిమా హాల్లో  అమ్మానాన్నల మధ్యసీటు కోసం నాకు అక్కతో చాలాసార్లు తగాదా అయ్యేది. బొమ్మ తెరపై వెయ్యడానికి ముందు హాల్లో లైట్లు తీసేసి చీకటిగా చేస్తారు. ఆ చీకటంటే నాకు చచ్చేంత భయం. అటూఇటూ ఇంట్లోవాళ్ళుంటే.. మధ్యన కూర్చుని సినిమా చూడ్డానికి ధైర్యంగా ఉంటుంది. అదీ అసలు సంగతి!

'కన్యాశుల్కం' సినిమా ఎంతసేపు చూసినా ఒక్కముక్క కూడా అర్ధం కావట్లేదు. నాకస్సలు నచ్చలేదు. అయినా సావిత్రి ఉండవలసింది రామారావు పక్కన గదా? మరి ఎవరెవరితోనో చాలా స్నేహంగా మాట్లాడుతుందేమి! తప్పుకదూ!

పైపెచ్చు ఒక ముసలాయనకి పిలక దువ్వి, నూనె రాస్తుంది. నాకు ఇది మరీమరీ నచ్చలేదు. ఎన్టీరామారావు ఎంత పక్కన లేకపోతే మాత్రం సావిత్రి అంతగా సరదాలు చెయ్యాలా?

ఈ ముసలాయన్ని ఎక్కడో చూసినట్లుందే! ఎక్కడ చూశానబ్బా? ఆఁ! గుర్తొచ్చింది. ఈ ముసలాయన మా నందయ్యగారే! అదేంటి! నందయ్యగారు సినిమాల్లో వేషాలు కూడా వేస్తారా? ఉన్నట్లుండి నాకు సినిమా ఆసక్తిగా మారింది. బలవంతానా ఆపుకుంటున్న నిద్ర మాయమైంది. నందయ్యగారు యాక్షను బానే చేశారు. మరి సావిత్రితో తన పిలకకి నూనె ఎందుకు పెట్టించుకున్నాడబ్బా!

'ఎవరా నందయ్య గారు? ఏమాకథ?'

ఈ భూప్రపంచమందు అత్యంత సుందరమైన ప్రాంతం మా గుంటూరు. అందు మా బ్రాడీపేట మరింత సుందర ప్రదేశము. ఈ సంగతి మీకు ఇంతకుముందు కూడా బల్లగుద్ది చెప్పాను. మీరు మర్చిపోతారేమోనని అప్పుడప్పుడూ ఇలా మళ్ళీ బల్ల గుద్దుతుంటాను.

మా బ్రాడీపేట మూడవ లైను మొదట్లో.. అనగా ఓవర్ బ్రిడ్జ్ డౌన్లో నందయ్యగారి ఇల్లు. పక్కన మాజేటి గురవయ్యగారి ఇల్లు. ఆ పక్కన ముదిగొండ భ్రమరాంబగారి ఇల్లు. చింతలూరివారి ఆయుర్వేద వైద్యశాల. దాటితే డాక్టర్ ఆమంచర్ల చలపతిరావుగారి ఇల్లు. ఎదురుగా ఇసుకపల్లి వేంకట కృష్ణమూర్తిగారి ఆయుర్వేద వైద్యశాల ఉంటుంది.

సాయంకాలం సమయానికి ఈ అరుగులన్నీ పురోహితులతో కళకళలాడుతుండేది. గుంపులు గుంపులుగా కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేసేవారు. వాతావరణం చాలా సందడిగా, కళకళలాడుతుండేది. ఊళ్ళో ఎవరికైనా పూజలు, వ్రతాలకి  పురోహితుల అవసరం వచ్చినప్పుడు అక్కడే ఎప్పాయింట్ మెంట్లు ఖరారయ్యేవి.

మంజునాథ రెస్టారెంట్ పక్కనే ఉన్న నశ్యం షాపు ఆ సమయంలో చాలా బిజీగా ఉండేది. పొడుంకాయ ఫుల్లుగా నింపడానికి ఐదు పైసలు. పొడుగ్గా ఉండే కాడ చివర బుల్లి గరిటె. ఆ గరిటెతో చిన్నజాడీలోంచి నశ్యాన్ని లాఘవంగా స్కూప్ చేస్తూ పొడుంకాయ నింపడం అద్భుతంగా ఉండేది. ఆ నశ్యం నింపే విధానం అబ్బురంగా చూస్తూ నిలబడిపొయ్యేవాడిని.

నశ్యం పట్టు పడుతూ.. సందడిగా, సరదాగా కబుర్లు చెప్పుకునే పురోహితులు ఒక వ్యక్తి కనపడంగాన్లే ఎలెర్ట్ అయిపోయేవారు. నిశ్శబ్దం పాటించేవారు. వినయంగా నమస్కరించేవారు. ఆయనే నందయ్య గారు.

నందయ్యగారింట్లో ఆడామగ అనేక వయసులవారు ఉండేవారు. ఇంటి వరండాలో చెక్కబల్లపై నందయ్యగారు కూర్చునుండేవారు. తెల్లటి తెలుపు. నిగనిగలాడే గుండు. ఒత్తైన పిలక. చొక్కా వేసుకొంగా ఎప్పుడూ చూళ్ళేదు. పంచె మోకాలు పైదాకా లాక్కుని, ఒక కాలు పైకి మడిచి కూర్చుని ఉంటారు. మెళ్ళో రుద్రాక్షలు. విశాలమైన నుదురు. చేతులు, భుజాలు, నుదుటిపైనా తెల్లటి వీభూది. పంచాంగం చూస్తూ వేళ్ళతో ఏవో లెక్కలు వేస్తుండేవారు.

ఇంటికి వచ్చినవారు నందయ్యగారికి వినయంగా నమస్కరించేవారు. పెద్దవాళ్ళు నాలాంటి పిల్లకాయల చేత ఆయన కాళ్ళకి నమస్కారం చేయించేవాళ్ళు. మహానుభావుల కాళ్ళకి నమస్కరిస్తే చదువు బాగా వంటబడుతుందని అమ్మ చెప్పింది. చదువు సంగతి అటుంచి.. కనీసం మా లెక్కల మాస్టారి తన్నులైనా తప్పుతయ్యేమోననే ఆశతో నందయ్యగారి కాళ్ళకి మొక్కేవాణ్ని.

మళ్ళీ మన 'కన్యాశుల్కం' లోకి వద్దాం. సినిమా అయిపొయింది. అమ్మానాన్న రిక్షాలో కూర్చున్నారు. యధావిధిగా నా ఉచితాసనంపై కూర్చున్నాను. ఏదో గొప్ప కోసం గంభీరంగా ఉంటుందని 'ఉచితాసనం' అని రాస్తున్నానుగానీ.. అసలు సంగతి రిక్షాలో నా ప్లేస్ కాళ్ళు పెట్టుకునే చోట.. అమ్మానాన్న కాళ్ళ దగ్గర.

మా ఇంట్లో అందరిలోకి నేనే చిన్నవాణ్ణి. అంచేత రిక్షా సీటుపై ఎవరు కూర్చున్నా.. నా పర్మనెంట్ ప్లేస్ మాత్రం వాళ్ళ కాళ్ళ దగ్గరే! ఆ విధంగా పెద్దయ్యేదాకా రిక్షా సీటుపై కూర్చునే అవకాశం పొందలేకపోయిన నిర్భాగ్యుడను.

"సినిమాలో మన నందయ్యగారు భలే యాక్టు  చేశారు." అన్నాను.

నాన్నకి అర్ధం కాలేదు.

"నందయ్యగారా! సినిమాలోనా!" అన్నాడు నాన్న.

"అవును. సావిత్రి ఆయన పిలకకేగా నూనె రాసింది." నాన్నకి తెలీని పాయింట్ నేను పట్టేసినందుకు భలే ఉత్సాహంగా ఉంది.

నాన్న పెద్దగా నవ్వాడు.

"నువ్వు చెప్పేది లుబ్దావధాని గూర్చా! ఆ పాత్ర వేసినాయన డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు. ఆయన గొప్పనటుడు. బాలనాగమ్మలో మాయల మరాఠీగా వేశాడు. దడుచుకు చచ్చాం." అన్నాడు నాన్న.

నమ్మలేకపోయాను. నాన్న నన్ను తప్పుదోవ పట్టిస్తున్నాడా? ఛ.. ఛ! నాన్న అలా చెయ్యడు. బహుశా నాన్న నందయ్యగారిని గుర్తుపట్టలేకపోయ్యాడా? అలాంటి అవకాశం లేదే! నాన్నకి నందయ్యగారు బాగా తెలుసు. నందయ్యగారు నాన్నని 'ఏమిరా!' అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు.

ఆలోచనలతోనే ఇంట్లోకొచ్చిపడ్డా. నాన్నకిష్టమైన, నాకు అత్యంత అయిష్టమైన కాకరకాయ పులుసుతో నాలుగు ముద్దలు తిన్నాను. నాన్న చాలా విషయాల్లో డెమాక్రటిక్ గా ఉండేవాడు. కానీ ఎందుకో కాకరకాయ పులుసు విషయంలో హిట్లర్ లా వ్యవహరించేవాడు. వారంలో ఒక్కసారైనా ఇంట్లోవాళ్ళం నాన్నకిష్టమైన కాకరకాయ పులుసుతో శిక్షించబడేవాళ్ళం.

కాకరకాయ పులుసు కడుపులో తిప్పుచుండగా.. నందయ్య గారి ఆలోచన మనసులో తిప్పుచుండెను. ఆలోచిస్తున్న కొద్దీ.. ఈ లుబ్దావధాని, గోవిందరాజుల సుబ్బారావు, నందయ్యగార్ల ముడి మరింతగా బిగుసుకుపోయి పీటముడి పడిపోయింది.

అటు తరవాత నందయ్యగారి సినిమా వేషం సంగతి నా అనుంగు స్నేహితుడైన దావులూరి గాడి దగ్గర ప్రస్తావించాను. వాడు నాకన్నా అజ్ఞాని. తెల్లమొహం వేశాడు. పరీక్షల్లో నాదగ్గర రెగ్యులర్ గా కాపీకొట్టే సాగి సత్తాయ్ గాడు మాత్రం నేనే కరక్టని నొక్కివక్కాణించాడు. ఏవిటో! అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది!

                                                     - 2 -

కాలచక్రం సినిమారీల్లా గిర్రున తిరిగింది. ఇప్పుడు నేను పెద్దవాడనైనాను. రిక్షాలొ కాళ్ళ దగ్గర కూచోకుండా సీటు మీదే కూర్చునే ప్రమోషనూ వచ్చింది. నా సాహిత్యాభిలాష చందమామ చదవడంతో మొదలై ఆంద్రపత్రిక, ప్రభల మీదుగా కథలు, నవలలదాకా ప్రయాణం చేసింది.

ఈ క్రమంలో కన్యాశుల్కం గురజాడ అప్పారావు రాసిన నాటకమనీ, అది సినిమాగా తీశారనీ తెలుసుకున్నాను. లుబ్దావధానిని నందయ్యగారిగా పొరబడ్డందుకు మొదట్లో సిగ్గు పడ్డాను. అటుతరవాత నవ్వుకున్నాను. నేనెందుకు తికమక పడ్డాను!?

కొన్నాళ్ళకి కన్యాశుల్కం నాటకం చదివాను. నాటకం గూర్చి అనేకమంది ప్రముఖుల వ్యాఖ్యానాలూ చదివాను. తెలుగు సాహిత్యంలో కన్యాశుల్కం ప్రాముఖ్యత గూర్చి ఒక అంచనా వచ్చింది. సినిమా మళ్ళీ చూడాలని.. పెరిగిన వయసుతో, పరిణిత మనసుతో హాల్లోకి అడుగెట్టాను.

సినిమా మొదలైన కొంతసేపటికి సినిమాలో పూర్తిగా లీనమైపొయ్యాను. కారణం.. గోవిందరాజుల సుబ్బారావు అద్భుత నటన. ఆంగ్లంలో 'స్పెల్ బౌండ్' అంటారు. తెలుగులో ఏమంటారో తెలీదు. లుబ్దావదానిగా గోవిందరాజుల సుబ్బారావు నటించాడనడం కన్నా..  ప్రవర్తించాడు అనడం కరెక్ట్.

గోవిందరాజుల సుబ్బారావు వృద్దుడయినందున లుబ్దావధాని ఆహార్యం చక్కగా కుదిరందని కొందరు అంటారు. వాస్తవమే అయ్యుండొచ్చు. అయితే ఇది నటుడికి కలసొచ్చిన ఒక అంశంగా మాత్రమే పరిగణించాలని నా అభిప్రాయం.

వృద్ధాప్యంలో 'డిమెన్షియా' అనే మతిమరుపు జబ్బు మొదలవుతుంది. ఎదుటివాడు చెప్పేది అర్ధం చేసుకుని చెప్పడానికి సమయం పడుతుంది. శరీర కదలికల వలె మానసికంగా కూడా నిదానంగా రియాక్ట్ అవుతుంటారు. ఎటెన్షన్ మరియు కాన్సంట్రేషన్ తగ్గడం చేత ఒక్కోసారి అర్ధం కానట్లు చేష్టలుడిగి చూస్తుండిపోతారు. ఇవన్నీ మనకి సినిమా లుబ్దావధానిలో కనిపిస్తాయి.

నా తికమక నటుడిగా గోవిందరాజుల సుబ్బారావు సాధించిన విజయం. అందుకు నేనేమీ సిగ్గు పడటం లేదు. ఆయన మరీ అంత సహజంగా పాత్రలోకి దూరిపోయి అద్భుతంగా నటించేస్తే తికమక పడక ఛస్తానా! అంచేత 'నేరం నాదికాదు! గోవిందరాజుల సుబ్బారావుది.' అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను!

యూట్యూబులోంచి ఆయన నటించిన సన్నివేశం ఒకటి పెడుతున్నాను. చూసి ఆనందించండి.



చివరి తోక..

శ్రీ ముదిగొండ పెదనందయ్యగారు :  వేదపండితులు. ఘనాపాఠి. ఆరాధ్యులు. సంస్కృతాంధ్ర పండితులు.

కృతజ్ఞతలు..

ఈ పోస్టులో నేను రాసిన ఇళ్లేవీ ఇప్పుడు లేవు. అన్నీబహుళ అంతస్తుల బిల్దింగులుగా మారిపోయ్యాయి. పోస్ట్ రాస్తున్న సందర్భాన నా మెమరీని రిఫ్రెష్ చేసిన మిత్రుడు ములుగు రవికుమార్ (నందయ్యగారి మనవడు) కి కృతజ్ఞతలు.

(photos courtesy : Google)

38 comments:

  1. ఆంగ్లంలో 'స్పెల్ బౌండ్' అంటారు. తెలుగులో "మంత్ర ముగ్ద" అంటారు. గోవిందరాజుల సుబ్బారావు గారి గురించి చాలా బాగా వ్రాశారు. బెజవాడలో డాక్టరుగా చేస్తూ నాటకాలు వేస్తూ ఉండేవారు. నా చిన్నప్పుడు వారు నాకు మందు ఇచ్చి నా జబ్బు నయం చేసారుట.

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ!

      నేను విన్నది సుబ్బారావు గారు LMP qualification తో తెనాలిలో ప్రాక్టీస్ చేశారని. తరవాత కాలంలో ఎలోపతీ నుండి హోమియోపతికి మారారు.

      Delete
    2. నేను చిన్నప్పుడు తెనాలి చుట్టూతా తిరుగుతూ బెజావాడ గుంటూరుల చుట్టూతా ప్రదక్షణలు చేసేవాడ్ని. ఆ మూడిట్లో ఎప్పుడూ తికమక పడుతూ ఉంటాను. తెనాలిలో ఆకాలంలో పెద్ద నాటక సమాజం ఉండేదని విన్నాను.

      Delete
  2. చాల బాగుంది అండి..
    మన చిన్నతనం లో ఊహలు
    పెద్ద వాళ్ళం అయాక వెనక్కి
    తిరిగి చూసుకుని ,సరి చూసు కోవడం
    ఒక తీయని అనుభూతి, అనుభవించిన
    మనకే అది అర్ధం అవుతుంది, కాని పంచుకోవాలని
    ఒక కోరిక కూడా ఆపలేం..
    కన్యాశుల్కం నవల ,సినెమా
    రెండూ,రెండే..
    వసంతం.

    ReplyDelete
    Replies
    1. vasantham గారు,

      చిన్నతనం జ్ఞాపకాల గూర్చి మీ అభిప్రాయమే నా అభిప్రాయం కూడా.

      Delete
  3. నా వయసు ఇప్పుడు 35, 10 సంవత్సరాల క్రితం మాట, అప్పటికి ఈ సినిమా పేరు వినడమే తప్ప ఎప్పుడు చూడలేదు, ఒక సారి చూసే అవకాశం..కాదు.. భాగ్యం కలిగింది. మీరు పైన పెట్టిన సీన్ ఎన్ని సార్లు చూసానో లెఖ్ఖలేదు. లుబ్ధావధాలు, రామప్ప పంతులు పాత్రల్లో వారు జీవించారు, లుబ్ధావధానులుని పెళ్ళికి ట్రాప్ చెయ్యడం చాలా అద్భుతంగా తీసారు, ఎంత అద్భుతంగా అంటే అది సినిమాలో సీనా లేక లుబ్ధావధానులు ఇంటి గేటు ముందు నుంచుని జరుగుతున్నది చూస్తున్నానా అనిపించేంతగా ఉంటుంది. ఇప్పుడు నాకు ఈ సినిమా(ఇంకొన్ని కూడ ఉన్నాయి లెండి)చూడటం ఒక వ్యసనం ఐపొయింది :-)

    ReplyDelete
    Replies
    1. లుబ్దావధాని పాత్రని గోవిందరాజుల అత్యంత సహజంగా పోషించారు. నాటకం చదివేప్పుడు (లుబ్దావధాని పాత్ర మాట్లాడేప్పుడు) గోవిందరాజుల మాట్లాడినట్లే మనకి తోస్తుంది. దెయ్యం పట్టిందని సిద్ధాంతి గోవిందరాజులని వేపమండలతో కొట్టే సన్నివేశం కూడా చాలా సహజంగా ఉంటుంది.

      తెలుగు సినిమా చరిత్రలో లుబ్దావధాని పాత్రపోషణ top 10 లో ఉంటుందని నా అభిప్రాయం.

      Delete
  4. ముందుగ మీకు ధన్యవాదాలు రమణగారు మీ మూలాన మానాన్నగారి ని గురుంచి కూడా తలచుకోవడం జరిగింది.
    గోవిందరాజుల సుబ్బారావు గారు గురుంచి మా నాన్నగారు ఎప్పుడు చెబుతూ వుండేవారు,చాల మంచి నటులని మాకు ఆయన గురుంచి తెలిసేసరికే ఆయన కీర్తిశేషులు అయ్యారు. కాని మా నాన్నగారు చెప్పడంవల్ల కావచ్చు ఆయన నటించిన 'కన్యాశుల్కం' ఇప్పటికి ఎన్నిసార్లు చూసామో లెక్కలేదు.
    కాకపొతే ఆయన లాంటి వాళ్ళని మేము కూడా చూసాము బాగాచిన్నతనంలో మా అమ్మగారి వూరు అమలాపురం దగ్గర పేరూరు అనే చోట.
    నిజంగా ఇవ్వన్ని కూడా అనుభవించిన మనకు మాత్రమె వాటిలోని 'గుబాళింపు' తెలుస్తుంది.అది చూపించలేము.అది అనుభవంలోకి రావాలి

    ReplyDelete
    Replies
    1. పూర్వ ఫల్గుణి గారు,

      థాంక్యూ!

      నా చిన్నతనం + నా ఊరు + నాకు నచ్చిన సినిమా/సాహిత్యం కలిపి కబుర్లుగా రాయడం నాకిష్టం.

      తెలుగు సాహిత్యంలో లుబ్దావధాని పాత్ర చాలా ప్రముఖమైనది. ఆ పాత్రని పోషించి, మెప్పించడం సాధారణ విషయం కాదు. లుబ్దావధానిగా గోవిందరాజుల ప్రతిభని ప్రస్తావిస్తూ ఆ రోజుల్లో వచ్చిన రివ్యూలు మనకి తెలీదు.

      Delete
  5. డియర్ రమణ,

    దర్శకుల సినిమాలని, నటీనటుల సినిమాలని విడివిడిగా ఉంటాయి. అట్లాంటి నటీనటుల సినిమాల్లో ఓ సినిమా కన్యాశుల్కం. అందులో చాలామంది నటులు జీవించగా, కొంతమంది దర్శకుని దర్సకత్వం మేరకు నటించారు. గోవిందరాజుల సుబ్బారావు, సి.యస్.ఆర్. లాంటి వారు దర్శకుని పర్వ్యవేక్షణలో నటించగా మిగతావారు దర్శకుని దర్సకత్వం మేరకు నటించారు.

    గోవిందరాజుల నటన గురించి పెద్దగా చెప్పుకోదగింది ఏమిలేదు. ఎందుకంటె అయన నటించలేదు కాబట్టి! ఆ పాత్రలో పరకాయప్రవేశం చేసాడు. ఆ కూర్చునే విధానం దగ్గిరనుంచి తలకాయ ముందుకి పెట్టి మాట్లాడటం దాకా చాలా మామూలుగా చేసాడు.

    ఈ మనిషే మాయల ఫకీరు వేషం వేసి 'సంగూ' అని అరుస్తూ భయపెట్టాడు అంటే నమ్మబుద్ది వేస్తుందా?

    ఒరిజినల్ నాటకాన్ని భ్రష్టు పట్టిన్చినా మనలాంటి సామాన్యులకి నచ్చిన సినిమాగా నిల్చిపోయింది 'కన్యాశుల్కం' - జ్ఞా పకాలకి కృతఙ్ఞతలు.

    ఇంక బ్లాగ్ గురింఛి వేరే చెప్పేదేముంది! ఇంటర్వెల్ ముందు తర్వాతలుగా చక్కగా విడగొట్టావు. బాగుంది.

    గోపరాజు రవి

    ReplyDelete
    Replies
    1. డియర్ రవి,

      థాంక్యూ!

      నేనీ టపా పూర్తిగా గోవిందరాజుల సుబ్బారావుకి డెడికేట్ చేశాను. కాబట్టి 'కన్యాశుల్కం' సినిమా మంచిచెడ్డల జోలికి పోలేదు. నాకు సినిమా ఎండింగ్ పట్ల తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. ఆ చివరి పావు గంట మర్చిపోతే మంచిది.

      అవును. లుబ్దావదానిని మాయల మరాఠీగా ఊహించుకోవడమే కష్టం. హ్యాట్సాఫ్ టు గోవిందరాజుల సుబ్బారావు.

      ఎందుకనో తెలుగులో సినిమా జర్నలిజం చాలా అధమ స్థాయిలో ఉంటుంది. పాతతరం నటుల గూర్చి క్రిటికల్ గా ఎనలైజ్ చేస్తూ ఒక్క మంచి వ్యాసం కూడా (నాకు తెలిసి) లేదు. కొన్ని ఉన్నాయి. అయితే అది ఎనాలిసిస్ కాదు. సన్మాన పత్రాలు! నాకు అలంకారిక భాషన్నా, పొగడ్తల వ్యాసాలన్నా ఎలర్జీ.

      Delete
    2. రమణ,

      నిన్న అంతా పవర్ వస్తూ పోతూ ఉండడంతో మళ్ళీ రాయలేకపోయాను. చలసాని ప్రసాద్ అబిప్రాయపడ్డట్లుగా సిహెచ్.నారాయణరావు, భానుమతులతో కన్యాశుల్కం తీస్తే ఎలా వుండేదో కాని.. రామారావు, సావిత్రిలు మన మనస్సుల్లో పాతుకుపోయారు. నువ్వు పెట్టిన సీను కాకుండా వేరు సీన్ గురించి ఆలోచిస్తే గోవిందరాజులుని ఏ సీనులో తీసివేయటానికి తోచలేదు.

      సావిత్రి గురించి చెప్పాలంటే 'లోట్టిపిట్ట' అని ఒక్క మాటంటే చాలు రాత్రిదాక నవ్వుకుంటూనే వుంటాము. నీ టపా గోవిందరాజులకే పరిమితమయినా.. ఒక్క ముక్క అటుఇటు రాయకుండా వుండలేము కదా. నువ్వు అన్నట్టు చివరి పావుగంట సినిమా మర్చిపోతేనే మంచిది. ఈ సంగతి సినిమా వాళ్ళకి కూడా తెలుసు అనుకుంటాను. అందుకే సినిమాలోనూ, సిడి లోనూ చివరి పావుగంట గందరగోళం చేసి మొదటిసారి చూస్తున్నవారికి అర్థం కాకుండా చేసారు.

      'నాయిల్లు గుల్ల చేయాలి.' - లుబ్దావధనులు
      'తెలిసినవారిని చేస్తే లౌక్యం - తెలియెనివారిని చేస్త్తే మోసం.' - రామప్పపంతులు
      'తాంబూలలిచ్చేసాను తన్నుకుచావండి.' - అగ్నిహోత్రావధానులు

      ఇవి మచ్చుకి కొన్ని డైలాగులు మాత్రమే - ఇలా రాసుకుంటూ పొతే మొత్తం సినిమానో, నాటకాన్నో ఎత్తి రాయల్సివుంటుంది - కాబట్టి ప్రస్తుతానికి ఇంతే.

      గోపరాజు రవి

      Delete
  6. అత్యద్భుతంగ వ్రాసారు

    ReplyDelete
  7. balanagamma (Gemini) lo maa naanna ki oka paatra vundi.
    balavardhi raju gaa (master viswam), evarikaina aa cinema kaavalante adagandi, andulo mayala phakir gaa jeevincharu govindarajula subbarao garu. aayana Einstein to kuda correspondence chesaru. I will send. 94414 81014

    ReplyDelete
    Replies
    1. sri గారు,

      'బాలనాగమ్మ' నేను చూళ్ళేదు. విన్నాను. తప్పకుండా కాల్ చేస్తాను.

      Delete
  8. చాలా బాగా వ్రాసేరు.ఈ సినిమాలో గోవిందరాజుల సుబ్బారావు గారు నటంచలేదు జీవించారనడం అతిశయోక్తి ఎంతమాత్రం కాదు.ఇతర పాత్రధారులు కూడా చాలా బాగా కుదిరి నటించిన చిత్రం ఇది. ముఖ్యంగా సియస్సార్,సావిత్రులు వేసిన పాత్రలు వేరే వారు వేయలేరు.ఈ సినిమా తీయడంలో నాటకాన్ని చెడగొట్టారనే విమర్శ అప్పడే వచ్చింది కాని సినిమాలకున్న పరిధుల దృష్ట్యా ఇంతకంటె బాగా ఎవరూ తీయలేరనే నాకనిపిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. అవును. నా అభిప్రాయం కూడా మీ అభిప్రాయమే. అన్ని పాత్రలకి పాత్రధారులు చక్కగా అమరిన సినిమా.

      మొన్నామధ్య చలసాని ప్రసాద్ ఆంధ్రజ్యోతిలో వ్యాసం రాశారు. ఆయన గిరీశంగా ch.నా్రాయణమూర్తి, మధురవాణిగా భానుమతి అయితే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

      Delete
  9. Very nice. నాకిప్పుడు అర్జంటుగా ఈ సినిమా చూడాలనిపిస్తున్నది. అగ్నిహోత్రావధాన్లుగా విన్నకోట రామన్నపంతులు గారు కూడా చాలా అద్భుతమైన నటన కనబరిచారు.

    ReplyDelete
    Replies
    1. అవును. అగ్నిహోత్రావధాన్లుగా విన్నకోట రామన్నపంతులు అద్భుతమే.

      బాపురమణల 'సాక్షి' లో పంతులు గారిని గుర్తు పట్టలేకపోయాను. అంతలా మారిపోయారు.

      Delete
  10. "ఈ భూప్రపంచమందు అత్యంత సుందరమైన ప్రాంతం మా గుంటూరు. అందు మా బ్రాడీపేట మరింత సుందర ప్రదేశము. ఈ సంగతి మీకు ఇంతకు ముందు కూడా బల్ల గుద్ది చెప్పాను. మీరు మర్చిపోతారేమోనని అప్పుడప్పుడూ ఇలా మళ్ళీ బల్ల గుద్దుతుంటాను"..

    రమణ గారు మీరు పైన చెప్పిన దాన్ని నేను ఇంతకు ముందు కూడా సమర్దించాను. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించడం ఎంత నిజం మీరు చెప్పింది కూడా అంతే నిజం. అందు వల్లను మీతో పాటు నేను కూడా బల్ల గుద్దుతునాను.

    ReplyDelete
    Replies
    1. hareen గారు,

      మీ వంటి నిజాయితీపరులు, వాస్తవాలు మాట్లాడేవారు ఉండబట్టే అప్పుడప్పుడూ వర్షాలు కురుస్తున్నాయి! మీ లాంటి ఉత్తముల తోడ్పాటు ఉంటే బల్ల గుద్దడం ఏం ఖర్మ! ఏకంగా బల్లనే విరక్కొట్టేద్దాం!

      Delete
    2. నేనుప్పుకోను, మా లచ్చీపురమే అత్యంత సుందర ప్రదేశం, మీ బ్రాడీపేట అభిజ్యతాన్ని ఖండిస్తున్నా, మా ప్రత్యేక లచ్చీపుర రాష్ట్రం మాక్కావాలి.

      చాలా బాగా రాశారు రమణగారు, మళ్ళీ ఇన్నాళ్ళకి మీ బ్లాగులో కామెంటాలనిపించింది, ఈ సెలవల్లో కన్యాశుల్కం చూసెయ్యాలని ఫిక్స్ అయ్యా..

      ఇవాళ ఓ పదిసార్లు చదివుంటా ఈ టపాని

      తార

      Delete
    3. తార గారు,

      ధన్యవాదాలు.

      మీ లక్ష్మీపురం బిల్డింగుల ముందు మా బ్రాడీపేట రెండుమూడు గదుల కొంపలు ఏపాటి లేండి!

      సినిమా పట్ల ఎవరికెన్ని అభ్యంతరాలున్నా.. టాప్ ఏక్టర్స్ అయిన రామారావు, సావిత్రిలతో 'కన్యాశుల్కం' తియ్యడం మూలాన.. కన్యాశుల్కం పాపులారిటీ పెరిగిందనే అభిప్రాయం నాకుంది.

      'మనసు ఫౌండేషన్' రాయుడు గారు గురజాడ complete works ప్రచురించారు. కొనండి. చదవండి. చదివే ఓపిక లేకపోతే దాచేసుకోండి. భవిష్యత్తులో మీ పిల్లలకి ఉపయోగపడుతుంది.

      Delete
  11. కోస్తా జిల్లాలలో గుంటూరు చాలా డల్ గా ఉంట్టుందని నా మిత్రుడు చెప్పేవాడు. అంటే కలకత్తా లాగా పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నమాట. ఇక్కడ మీరు ఆ ఊరినిపొగుడుతూంటే, ఆంధ్రాలో మీరు ఇంకే ఊర్లు చూసినట్టులేదు. అందుకే కామోసు మీకు పాత సినేమాలు చిత్తూరి నాగయ్యవి నచ్చుతాయి.

    ReplyDelete
    Replies
    1. అజ్ఞాతవర్యా,

      నేను ఆంధ్రాలో అన్ని ఊళ్ళని కాటా వేసి గుంటూరు గొప్ప ఊరు అని చెప్పట్లేదు. మిగిలిన ఊళ్ళ సంగతి నాకనవసరం. నేను గుంటూరులో పుట్టి, పెరిగాను. అంచేత నాకీ ఊరు చాలా గొప్పది.

      చిత్తూరు నాగయ్యని అభిమానించడానికీ, గుంటూరుకి సంబంధం అర్ధం కావట్లేదు.

      Delete
    2. ప్రపంచం లో అన్నిటికంటే చక్కని నగరం గుంటూరు అని నేను బల్ల గుద్ది చెబుతాను . (ఎందుకో నాకు గుంటూరు నగరం రోడ్ల మీద తిరుగుతుంటే కలిగే ఆనందం మరి దేనిలోను కలగదు ముఖ్యంగా లక్షిపురం నా ప్రాణం)
      ఐనా ఈ అజ్ఞాత ప్రవీణ్ లాగ ఉన్నాడు కావున మనం పట్టించుకోనవసరం లేదు . ఇంకా కన్యాశుల్కం గురుంచి చెప్పే అంత వాణ్ణి కాదు అది ఒక అద్భుతం . నాటకం మరియు సినిమా కూడా . గోవింద రాజులూ గారు మా తెనాలి కి చెందినా వారు అవ్వటం ఇంకా గొప్ప విషయం (మేము తెనాలి తాలూకా కి చెందిన వాళ్ళము కానీ చదవు సాగింది అంతా గుంటూరు లోనే ) .కళాకారులకి పుట్టినిల్లు మా తెనాలి అని కూడా నేను బల్ల గుద్ది చెబుతున్నాను .

      Delete
    3. నన్ను ప్రవీణ్ తో పోలుస్తావా? ప్రవీణ్ డాక్టర్ గారి ఆప్తమిత్రుడ ని నీకు తెలియదా? డాక్టర్గారు ప్రవీణ్ ఎగతాళి చేస్తే ఫీలౌతారు.

      Delete
  12. స్వామి గారు సరిగా గుర్తుచేసారు.సమయానికి రామన్న పంతులు గారి పేరు గుర్తుకు రాక వ్రాయలేదు.కరటక శాస్త్ర్తులు వేషంలో వంగర కూడా రాణించారు.కన్యాశుల్కం సినిమాలో గుండులా ఉన్న రామన్న పంతులుగారు సుగరు వ్యాధి కారణంగా నేమో సాక్షి సినిమా వేళకి బాగా సన్నబడిపోయారు.స్నేహం సినిమాలో అనుకుంటాను, డాక్టరు వేషంలో పేషంటును చూడడానికి వచ్చి అక్కడ గెష్టహౌసు మెట్లెక్కలేక "కొండమీద కట్టించాడేవిట్రా యిల్లూ"అంటూ జా పోస్తూ ఆయాసపడిపోవడం భలే నవ్వు తెప్పిస్తుంది.

    ReplyDelete
  13. కోప్పడకండి.

    ఈ మధ్య మీరు మరీ 'ముసలి' టపాలు వ్రాస్తున్నారు.

    ReplyDelete
    Replies
    1. bonagiri గారు,

      అయ్యో! నేనెందుకు కోప్పడతానండి?

      నా పోస్టులకి ముడిసరుకు నా చిన్ననాటి స్నేహితుల కబుర్లు. కొన్ని దశాబ్దాలుగా వృత్తి రీత్యా రోజులో ఎక్కువ భాగం నాలుగ్గోడల మధ్యే నివాసం. కొత్త స్నేహాలు ఉండవు. అందుకు సమయమూ లేదు. కొత్త సినిమాలు చూడను. పత్రికలు చదవను. ఇంక నాకు 'కుర్ర' ఐడియాలు ఎక్కణ్ణుండి వస్తాయి?

      అంచేత నా పోస్టులు పాత సినిమాని కొత్తగా రిలీజు చేసినట్లు ఉండొచ్చు. ఇది నాకున్న పరిమితి.

      Delete
  14. చాల్లెండి. వెనుకటికెవరో "తాను వలచినది రంభ, తానున్నది టొక్యో" అన్నాడట. అలా ఉంది మీ గుంటూరు వీరాభిమానం. అయినా మధురవాణి పరివారం ఉన్న ముంబై నగరమే గొప్పదని అంటున్నారే ఇప్పుడు!!

    ReplyDelete
    Replies
    1. శ్రీ సూర్య గారు,

      రావిశాస్త్రి అంతటివాడే విశాఖ వీరాభిమానంలో కూరుకుపోయాడు. ఇంక నేనెంత?!

      మీరు 'కన్యాశుల్కం' చదవలేదని అనిపిస్తుంది. దయచేసి చదవండి. మీకు మధురవాణి వ్యక్తిత్వం అర్ధమవుతుంది. నాకైతే మధురవాణిలో గురజాడవారు కనిపించారు.

      Delete
  15. రమణగారూ, నిజం. నాకు కన్యాశుల్కం చదివే అవకాశం రాలేదు. పుస్తకాల షాపుల్లో నాకు కంటపడకపోవుటచే కొనలేకపోయాను. మీలాంటివారు దాన్ని ఓ చిన్న కథగా నైనా పోస్టు రాస్తే నాలాంటివారికి ముందుమాటగా ఉపయోగపడుతుంది. ఇక మధురవాణి అంటే నాకు చిన్నచూపు అనుకుంటున్నారేమో. నా దృష్టిలో ఆమె కూడా సమాజం లో ఒక వ్యక్తి. మనలో చాలా మంది మసాలా పాటలని కళ్ళింత చేసుకుని చూసేస్తూ కూడా ఫ్రెండ్స్ దగ్గర "అది బోకు ఇది బోకు" అని చెప్పటం చూస్తే చిరాకు వేస్తుంది. అలాంటి హిపోక్రసీ కి నేను వ్యతిరేకిని.

    అన్నట్టు పైన వీడియో లో "మారకం ఉందిట" అంటే అర్థం కాలేదు. ఆ "మారకం" అంటే ఏంటో వివరించగలరా?

    ReplyDelete
    Replies
    1. శ్రీ సూర్య గారు,

      సందర్భం బట్టి 'చావు' అని అర్ధం చేసుకున్నాను. అంతకు మించి తెలుగు నాకు రాదు.

      ఏదో 'పని లేక.. ' అప్పుడప్పుడు బ్లాగుతుంటాను. నేను రాసేవన్నీ కేవలం సరదా కోసమే. ఈ బ్లాగుడు ఎంత కాలం సాగుతుందో కూడా తెలీదు.

      అంచేత.. చెప్పొచ్చేదేమనగా.. 'కన్యాశుల్కం' ని కథగా రాసే ఓపిక నాకు లేదు. అన్యధా భావించకండి. మీకు నాటకం లభ్యమైనప్పుడే చదువుకోండి.

      Delete
    2. naaku link dorikindi

      http://www.scribd.com/doc/7196654/Kanya-sulkam-rareebookstk

      Delete
    3. congratulations!

      This is second edition (1909) of కన్యాశుల్కం, rewritten and expanded by Gurazada (first edition - 1897)

      Delete
    4. or even the download version is available:
      http://www.ziddu.com/download/6276422/KanyaSulkamfull.PDF.html

      Delete

comments will be moderated, will take sometime to appear.