Friday 17 August 2012

సినిమా పాటల ప్రత్యేకత


ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా కూర్చొని మైసూరు పాక్ తింటున్నారు, వారిద్దరికీ ఆ స్వీట్ ఎంతగానో నచ్చింది. ఆ ఇద్దర్లో ఒకాయన జ్ఞాని, వంటలో కూడా అనుభవం ఉంది, పైగా కవి. అంచేత - ఆయన తనకెంతగానో నచ్చిన ఆ స్వీటుని మెచ్చుకుంటూ.. దాని రుచికి కారణమైన పంచదార పాకాన్ని, నెయ్యిని వర్ణిస్తూ మాట్లాడసాగాడు. అంతేనా! కొద్దిసేపటికి అద్భుతంగా కవిత్వం చెప్పడం కూడా మొదలెట్టాడు.

ఆ రెండోవాడు అజ్ఞాని. వాడికసలు మైసూర్ పాకం తయారీలో శెనగ పిండి, నెయ్యి వాడతారని కూడా తెలీదు. కానీ - తియ్యతియ్యగ, మెత్తమెత్తగా నోట్లోకి జారిపోతున్న మైసూరు పాకాన్ని ఆపకుండా మింగుతూనే ఉన్నాడు. వాడు కవిగారి కవిత్వాన్ని వింటున్నాడు గానీ అర్ధం చేసుకోలేకపోతున్నాడు! అయితే - మైసూర్ పాక్ ముక్కల్ని కవిగారి కన్నా ఎక్కువే పొట్టలోకి పంపేశాడు.

ఇదంతా నే రాయదలచుకున్న విషయానికి ఉపోద్ఘాతం. పై కథలో అ అజ్ఞానిని నేనే! నాకు సంగీత పరిజ్ఞానం లేదు, కానీ పాటలు వింటాను, చాలా పాటలు చాలాసార్లు వింటాను. కొన్ని పాటలంటే మరీమరీ ఇష్టం. పాటలకి ముడిసరుకు సంగీతం. మరి సంగీతంలో ఓనమాలు కూడా తెలీని నేను పాటల్ని ఎందుకు ఇష్టపడుతున్నాను? ఇందుకు కారణాలు (నాకు తోచినవి) రాస్తాను.

ఆలోచించగా - నా 'ఫలానా పాట ఇష్టం' అనేది, నా 'ఫలానా సినిమా ఇష్టం'తో కలిసిపోయి ఉందని అనిపిస్తుంది. నేను సినిమా పాటని సినిమాలో భాగంగా మాత్రమే చూస్తాను. సినిమాని ఒక 'ఇల్లు'గా ఊహించుకుంటే, పాట ఆ ఇంట్లో ఒక గది వంటిది. ఇల్లంతా శుభ్రంగా ఉంటేనే ఆ గదికూడా శుభ్రంగా ఉంటుంది, లేకపోతే లేదు. అంతే! ఇంకొంచెం వివరంగా చెబుతాను.

సినిమా దృశ్యప్రధానమైనది. పాటలు కథలో కలిసిపోయి ఉంటాయి, అంటే - పాట అనేది ఒకకథ చెప్పేవిధానంలో భాగం. దర్శకుడు కథని ముందుకు నెట్టడానికో, విషయాన్ని మరింత గాఢంగా చెప్పడానికో పాటని వాడుకుంటాడు. అంచేతనే మనకి బాగా నచ్చిన పాటలు రేడియోలో వింటున్నా ఆ సినిమా సన్నివేశం గుర్తొస్తుంది. అంటే ఒకపాట మెదడులో దృశ్యపరంగా స్టోర్ అయ్యుంటుంది, సినిమా పాటలకి మాత్రమే ఈ రకమైన కండిషనింగ్ ఉంటుంది. క్లాసికల్ సంగీతం ధ్వని ప్రధానమైనది, కాబట్టి ఈ లక్షణం కలిగుండదు.

ఒక పాట సాహిత్యం కాగితంపై చదువుతాం, 'బాగుంది'. అదే పాటని ఒక మంచి గాయకుడు భావయుక్తంగా ఆలపించాడు, 'ఇంకా బాగుంది'. అదే పాటకి నటనని జోడించి సినిమాలో దృశ్యపరంగా చూశాం. ఇప్పుడు మనసు సాహిత్యాన్ని ఫాలో అవుతుంది, చెవి శబ్దాన్ని (సంగీతం) ఫాలో అవుతుంది, కన్నుదృశ్యాన్ని ఫాలో అవుతుంది.  ట్రిపుల్ ధమాకా! జ్ఞానేంద్రియాల్లో visual impact బలమైనది. అంచేత ఇప్పుడా పాట ఇంకాఇంకా బాగుంటుంది. ఈ విషయం మరింత వివరించడానికి నాకెంతో ఇష్టమైన ఆవకాయ ఉదాహరణ రాస్తాను.

ఇవ్వాళ మీరు డైటింగ్ చేస్తున్నారు, కాబట్టి - ఈ రోజంతా ఏమీ తినకూడదని డిసైడైపొయ్యారు. ఇంతలో ఎదురుగా - ఒక గిన్నెలో అప్పుడే కలిపిన కొత్తావకాయ కనిపిస్తుంది. కమ్మని ఆవఘాటు ముక్కుపుటాల్ని తాకింది - ఇది  olfactory (వాసన) sense. ఎర్రటి ఆవకాయ చూడ్డానికి కన్నుల పండుగలా ఉంటుంది - ఇది visual sensory (కంటిచూపు) impact. ఇప్పుడు olfactory + visual sensory organs మెదడులోని hypothalamus లో ఆకలిని కలిగించే నాడీవ్యవస్థని stimulate చేస్తాయి - నోట్లో నీరూరుతుంది. ఇక్కడ ఆవకాయ రుచి gustatory (రుచి) sense, కావున - ఆకలి నకనకలాడుతుంది.

ఇంక ఆ ఆవకాయని వేడివేడి అన్నంలో ఎర్రెర్రగా కలుపుకుని తినకుండా ఆపడం ఎవరి తరం? ఎవడన్నా ఆపుదామన్నా మర్డర్ చేసెయ్యమా? ఆవకాయని కళ్ళు మూసుకుని వాసన చూసినా, ముక్కు మూసుకుని కంటితో చూసినా ఇంత ఆకలి వెయ్యదు. అంటే - ఇక్కడ మూడు sensory organs ఒకదాన్ని ఇంకోటి compliment చేసుకున్నాయి, అదీ సంగతి! 'ఒక దృశ్యరూపం మైండ్ లో స్థిరంగా స్థిరపడిపోతుంది.' అన్న నగ్నసత్యం మీక నా ఆవకాయ పచ్చడి ఉదాహరణ ద్వారా అర్ధమైందని అనుకుంటున్నాను. ఇక్కడిదాకా నా వాదన మీరు ఒప్పుకున్నట్లయితే, ఇప్పుడు ఇదే వాదనని సినిమా పాటల్లోకి  లాక్కెళ్తాను.

ఇందుకు ఉదాహరణగా 'మూగ మనసులు'లోని పాటొకటి తీసుకుంటాను. ఈ సినిమాలో 'పాడుతా తీయగా చల్లగా.. ' అనే పాట నాకు చాలా ఇష్టం. దిగుల్లో ఉన్న అమ్మాయిగార్ని ఓదార్చడానికి గోపి పడే వేదనలో చావుపుట్టుకల మర్మమంతా వండి వార్చేశాడు ఆత్రేయ. నాకీ పాట వింటున్నప్పుడల్లా సావిత్రి, నాగేశ్వరరావులే కళ్ళముందు కనిపిస్తారు. దుఖాన్ని గొంతునిండా నింపుకున్న ఘంటసాలని భారంగా కె.వి.మహాదేవన్ సంగీతం ఫాలో అవుతుంది. ఈ పాట ఇంతలా నాకు గుర్తుండిపోడానికి కారణం ఘంటసాల, ఆత్రేయ, కె.వి.మహదేవన్, నాగేశ్వరరావు, సావిత్రి. ద స్కోర్ ఈజ్ పెర్ఫెక్ట్ టెన్!

అయితే - వీళ్ళంతా ఎవరికేవారే గొప్పప్రతిభావంతులు. వీళ్ళని సరీగ్గా వాడుకోగలగడమే అసలైన సవాల్. వీళ్ళ ప్రతిభని తన వంటలో దినుసులుగా సమపాళ్ళలో దట్టించి కమ్మగా వంట చేసిన హెడ్ చెఫ్ ఆదుర్తి సుబ్బారావు. నాకు టోపీ లేదు, అయినా - హేట్సాఫ్ టు యు ఆదుర్తి! ఇక్కడ దర్శకుడి కాంట్రిబ్యుషనే ఈ పాటకి ఇంత చిరస్మరణీయతని ఇచ్చింది. ఆయనీ పాటని సినిమాలో చొప్పించిన సందర్భం, సన్నివేశం అద్భుతం. ఇప్పుడో చిన్న ప్రయోగం. ఈ పాట వింటూ పాట సన్నివేశ దృశ్యాన్ని, సావిత్రి, నాగేశ్వరరావుల ఇమేజెస్ ని బలవంతంగా పక్కనపెట్టటానికి  ప్రయత్నిద్దాం. చాలా వెలితిగా, ఇబ్బందిగా ఉంది కదూ (ముక్కు మూసుకుని కొత్తావకాయని చూసినట్లు)!

నే చెప్పదలచుకుంది ఇదే. బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, ఆదుర్తి మొదలైనవారు దర్శకత్వం వహించిన సినిమాల్లో పాటల్ని గుర్తు తెచ్చుకోండి. దాదాపు అన్నిపాటలూ దృశ్యంగానే కళ్ళముందు కదలాడుతాయి. అందుకే - సినిమా పాటల్ని కేవలం సంగీతపరంగా అంచనా వెయ్యరాదని నా అభిప్రాయం. పాట బాగుంది, కాని సన్నివేశం బాలేదనిపిస్తే.. స్వీట్ బాగుంది, కానీ నెయ్యి ఎక్కువైందన్నట్లుగా ఉంటుంది. అప్పుడు స్వీట్ వెగటుగా ఉంటుంది.

ఇప్పుడు చెడిన వంటకి ఉదాహరణ చెబుతాను. నే చదువుకునే రోజుల్లో 'కన్నెవయసు' అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో 'ఏ దివిలో విరిసిన పారిజాతమో.. ' అనే పాట సూపర్ హిట్. సత్యం చక్కగా స్వరపరిచాడు. బాలసుబ్రహ్మణ్యం అప్పుడప్పుడే గాయకుడిగా నిలదొక్కుకుంటున్నాడు. పాపం కష్టపడి పాడాడు. హీరో మా గుంటూరబ్బాయే! సినిమా చూడ్డానికి నాకింతకన్నా కారణమేం కావాలి? రిలీజ్ రోజే  సినిమాని శేషమహాల్లో చూశాను - పరమ చెత్త. పాటని చెడగొట్టటానికే సినిమా తీసినట్లున్నారు!

'కన్నెవయసు' హీరో సున్నిత మనస్కుడు, కవి. హీరోయిన్నికావ్యకన్యగా భావిస్తాడు. దాశరధి, సత్యం, బాలుల మేజిక్ 'ఏ దివిలో విరిసిన పారిజాతమో.. ' పాట. మంచిభోజనం పెట్టేముందు పరచిన చక్కటి అరిటాకులా, ఈపాట సినిమా మొదట్లోనే వచ్చేస్తుంది. కానీ అక్కడ అరిటాకు తప్ప భోజనం ఘోరం! ఇంత మంచిపాట ఆ సినిమాకి ఉపయోగపళ్ళేకపోయింది. 'పాడుతా తీయగా.. ' పాటని ఆదుర్తి ఆకాశమంత ఎత్తుకి తీసికెళితే, ఇక్కడ ఇంకో దర్శకుడు ఒక మంచిపాటని పాతాళానికి తొక్కేశాడు. అదీ కథ! అందువల్ల - 'ఏ దివిలో విరిసిన పారిజాతమో.. '  పాట మాత్రమే 'మంచిపాట' అన్నట్యాగుతో అలా మిగిలిపోయింది.

అవడానికి రెండూ మంచి పాటలే. ఒకటి మంచిసినిమాలో స్థానం సంపాదించుకుని వన్నె పెంచుకుంటే, మరోటి బురదలో మందారంలా అక్కడే ఉండిపోయింది. నాకు చింతపండు పులిహోర భలే ఇష్టం. పులిహోర తయారీలో పచ్చిమిరపకాయల్ని ముందుగా చింతపులుసులో ఉడికించాలి. అప్పుడా చింతపులుపు పట్టిన పుల్లమిరపకాయల్ని పులిహోరలో నంజుకుంటుంటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్నట్లుంటుంది. అలాగే - ఒక మంచిపాట కూడా 'కథ' అనే పులుసులో బాగా ఉడకాలి, అప్పుడే రుచి!

అమెరికా రోడ్ల మీద గుంపులుగా కనిపించే అందమైన కార్లు, అక్కడి రోడ్లమీద తిరిగితేనే బాగుంటాయి. అక్కడ బాగున్నాయి కదాని వాటిని మనూళ్ళో తిప్పితే దిష్టిపిడతల్లా ఉంటాయి, అట్లే - మనూరికి మూడుచక్రాల ఆటోలే అందం (అది చూసేవాడి దృష్టికోణం బట్టి ఉంటుంది). అమెరికా భారత సంతతి బోల్డెంత సొమ్ము పోసి నేర్చుకున్న కూచిపూడి నాట్యాన్ని రవీంద్ర భారతిలో ప్రదర్శిస్తేనే శోభిస్తుంది (గొప్పకళని ఖరీదైన కళారాధకులు మాత్రమే ఆస్వాదించగలరు), శ్రీరామనవమి పందిళ్ళలో కాదు. కావున - ఒక మంచి పాటకి మంచి సన్నివేశం జత అయితేనే మరింతగా ప్రకాశిస్తుంది, లేకపోతే లేదు, అదీ సంగతి!              

(photo courtesy : Google)

36 comments:



  1. మీరు రాసింది పాక్షికసత్యమే.మంచి సినిమా ,మంచి చిత్రీకరణ,నటనతో బాటు మంచిపాట ఐతే' బంగారానికి తావి అబ్బినట్లు 'మరీ బాగుంటుంది.కాని visual and olfactory sensations లేకపోయినా auditory sensation బాగా ఉంటే ఇప్పటికీ గుర్తుండిపోయి మనల్ని అలరిస్తూఉంటాయి.ఉదాహరణకు 'నీలి మేఘాలలో గాలి కెరటాలలో ' పయనించె మనవలపులనావ ',నిరంతరమూ వసంతములే '' ,'ఈ చైత్ర వీణా జుమ్మనీ' వంటి పాటలు సినిమాతోని,సిటుయేషన్ తోని సంబంధంలేకుండా హృదయాన్ని హత్తుకుంటాయ్.అలాగే 'ఏ దివిలో విరిసిన పారిజాతమో 'పాటకూడా.నాకు కొన్ని లతాజీ పాడిన చాలా ఇష్టమైన పాటలు ఏ సినిమాలోవో కూడా గుర్తుండదు.అవి చాలా ఇష్టమైన రాగాలలో కూర్చబడి లతగారి మధురస్వరంలో వినిపించినవి కాబట్టి ఎప్పుడూ ఆకర్షిస్తూ ఉంటాయి.

    ReplyDelete
    Replies
    1. కమనీయం గారు,

      స్పందనకి ధన్యవాదాలు. కొద్దిగా ఫిజియాలజీ మాట్లాడుకుందాం.

      auditory sensation is processed in primary auditory cortex situated in temporal lobe of brain whereas visual cortex is in occipital lobe.

      my proposal is stimulation of two is better than one.

      i have taken two songs for my comparative study. my methodology is simple and the conclusion is a director can take a good song to a next level.

      మధ్యలో ఆవకాయ, పులిహోరా గుర్తొచ్చాయి. ఇరికించేశాను!

      My close friend, a neurologist in US reads my posts regularly. let us see whether he can through some light on this subject.

      Delete
    2. టపా బావుంది. చాలా సింపుల్ ఉదాహరణలతో కాంప్లెక్స్ విషయాన్ని విశదీకరించే మీ ప్రయత్నం నాకు నచ్చింది. (నాయనా, నా అసలు ప్రయత్నం అదికాదు. సింపుల్ విషయాలని గురించి సింపుల్ గా చెప్పటమే నా ఉద్దేశ్యం అంటారా...:) అయితే వాకే. )

      నాకు ఫిజియాలజీ గురించి తెలియదు. కానీ మీరు చెప్పిన పాయింటు నిజమేననిపిస్తుంది. Stimulation of more than one sense will leave a deeper impact than stimulation of one sense.

      I think, apart from stimulation of senses there is something which will make the impact and recollection very effective. Weaving a pattern around the stimulation of senses is much more effective. If you take the example of the pickle you gave, the experience of tasting the pickle will be much more deeper if the stimuli are fitting into a suitable context. In the example of a movie song.. the story line of the movie provides that context and pattern to hold the stimuli and is much deeper. In simple what I am trying to say is...

      Stimulation of two senses is more effective than one. Stimulation of two senses in a suitable context is more effective as it helps the pattern formation of the brain.

      Delete

    3. టీ కప్పులో ఈగలా గిలగిలలాడుతున్న నన్ను బయట పడేశారు. థాంక్యూ!

      మీ వ్యాఖ్యే (నూటికి నూరు పాళ్ళు) నే చెప్పదలచుకున్న విషయం.

      Delete
  2. రాయటానికేమీ లేక ఈ పాటల సొల్లు పెట్టాను అని ఒక్క ముక్కలో చెప్పరాదూ డాక్టేరూ
    ఎందుకిట్టా మా బుర్రలు తింటావు???

    ReplyDelete
    Replies
    1. ఈ పోస్ట్ మీకు అలా అనిపించిందా! సారీ.

      Delete
  3. మీరు ఎలా చెప్పినా రెండూ మంచి పాటలు :)

    ReplyDelete
    Replies
    1. ఒప్పుకుంటున్నాను!

      Delete
  4. నిజమే. కొన్ని పాటలు చాలా బాగుంటాయి కాని, దృశ్యం డల్‌గా ఉంటుంది.
    బహుశా సినిమా, లోబడ్జెట్‌లో తీసి ఉంటారు.

    తెలుగులో సత్యం, రాజన్ నాగేంద్రల పాటలకి ఇలాంటి అన్యాయం జరిగిందనుకుంటా.

    ఆ రెండో పాట నేను చూడలేదు. విన్నాను.
    ఇంతకీ మీ గుంటూరబ్బాయి పేరు వ్రాయలేదు.

    ReplyDelete
    Replies
    1. మా గుంటూరబ్బాయి పేరు 'లక్ష్మీకాంత్' (అనుకుంటా)!

      Delete
  5. 'ఏ దివిలో ' పాటను విన్నప్పుడు ఇన్నాళ్ళు చాల ఊహించుకొన్నాం. చూడడానికి ఒక్క శాతం కుడా బాలేదు కాని, మనకి కనిపించే దృశ్యాలను కవి ఊహలతో చూడాలి . అంటే చూస్తున్నప్పుడు మీకు ఇంకెవరో కనిపించాలి :p అప్పుడు కళ్ళు మూసుకొని ఉంటారు కాబట్టి తెరపై దృశ్యం ఎందుకు :D

    'జగమంత కుటుంబం' పాట చదివినప్పుడు, చర్చలు చూసినప్పుడు అసలు బాలేదు. vedio చూస్తూ విన్నపుడు నచ్చింది నాకు . మొత్తం గా కృష్ణవంశీ వంటకం కొంత వరకూ బావుంది.

    హ్మ్ పాటల గురించి వ్రాసారు కాని, ఆవకాయకే మార్కులు ఎక్కువ పడతాయి :)

    ReplyDelete
    Replies
    1. >>హ్మ్ పాటల గురించి వ్రాసారు కాని, ఆవకాయకే మార్కులు ఎక్కువ పడతాయి.<<

      నేను సినిమా పాటల గూర్చి రాద్దామనే సిన్సియర్ గా మొదలెట్టాను. ఈ మధ్య VAK రంగారావు గారితో చాలాసేపు కబుర్లు చెప్పాను. ఆయన నన్ను సంగీత ప్రపంచంలో ముంచేశాడు. కష్టంగా ఈదుకుంటూ బయటపడ్డాను. ఎందుకో సడెన్ గా ఆయన గుర్తొచ్చాడు. రాయ బుద్దెయ్యలేదు. అంతలో నాకూ, ఆయనకి తేడా అనేది మైసూర్ పాక్ ఉదాహరణతో రాయడం మొదలెట్టాను. అదీ మధ్యలో వదిలేశాను.

      (నా బ్లాగ్ పాలసీకి విరుద్ధంగా) మధ్యలో సెన్సరీ సిస్టమ్ గూర్చి రాశాను. కొద్దిగా మకతిక పోస్ట్. సారీ!

      Delete
    2. ఇకముందు మీనుండి చక్కని పాటల విశ్లేషణలు వస్తాయన్న మాట. ఎత్తుగడ బావుంది

      Delete
  6. మీ విశ్లేషణలో పాయలు ఎక్కువయ్యి ఒకదానికోటి ముడేసి మొత్తానికి విశదపరచడానికి బదులు చిక్కుముడి చేసి వొదిలారు :)
    ప్రతిపాదన 1: "మనకి బాగా నచ్చిన పాటలు రేడియోలో వింటున్నా ఆ సినిమా సన్నివేశం గుర్తొస్తుంది. అంటే ఒక పాట మెదడులో దృశ్యపరంగా స్టోర్ అయి ఉంటుంది."
    కాదు. కచ్చితంగా కాదు. తెలుగు సినిమా పాటల్లో దృశ్యంకన్నా, సాహిత్యంకన్నా మౌలికంగా శ్రోతని ఆకర్షించేది సంగీతమే. ఉదాహరణలు కోకొల్లలు.
    ప్రతిపాదన 2: "ఇంకో దర్శకుడు ఒక మంచి పాటని పాతాళానికి తొక్కేశాడు. "
    నిజమే. సరైన దృష్టిలేని దర్శకుడూ, మంచి పాటనే కాదు, ఎన్నో మంచి వనరుల్ని వృధా చేస్తాడు. దీనిక్కూడా ఉదాహరణలు కోకొల్లలు.

    ReplyDelete
    Replies
    1. >>మీ విశ్లేషణలో పాయలు ఎక్కువయ్యి ఒకదానికోటి ముడేసి మొత్తానికి విశదపరచడానికి బదులు చిక్కుముడి చేసి వొదిలారు<<

      అది మా వృత్తి ధర్మం!

      మీ మొదటి ప్రతిపాదన నేనొప్పుకోను. ఒక ఉదాహరణ. 'మాయాబజార్' సినిమా చూడని వారికి సుశీల పాడిన 'అహ నా పెళ్ళియంట.. ' పాట వినిపిద్దాం. మంచిపాట కాబట్టి వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. ఇపుడు సినిమా చూపిద్దాం. సినిమా చూసినవారికి ఆ పాట బాగా నచ్చుతుంది. ఇప్పుడు మళ్ళీ ఆ పాట వినిపిద్దాం. ఇప్పుడు మొదటిసారి కన్నా ఆ పాటని ఇంకా బాగా ఇష్టంగా వింటారు. ఎందుకంటే వాళ్ళిప్పుడు సావిత్రి అభినయం, ఘటోత్కచుని interlude చూసి వున్నారు కనుక.

      Delete
  7. రమణ గారు.. మంచి పని చేస్తున్నారు. పాట వైపు ఆకర్షితులు కాకుండా ఎవరు ఉండగలరు చెప్పండి? ఇక మీ బ్లాగ్ లో అన్ని సానుకూల వ్యాఖ్యలే ! అనుకుంటున్నాను.
    మంచి పాటలని పరిచయం చేసారు. ధన్యవాదములు. ఇప్పటికి, ఎప్పటికి పాట ని రేడియోలో వింటేనే బావుంటుంది అండీ!!

    'దున్నేవాడిదే భూమి. వినేవాడిదే పాట. రాసేవాడిదే బ్లాగు!' :) :) :)

    ReplyDelete
  8. As far as I remember, in Kannevayasu movie, hero does not kill the heroine. He kills his friend because the friend hurt the girl. The song is beautiful. But the movie being tragic used to affect my listening pleasure for a long time.
    In my opinion the picturisation suits the song well enough.
    Yes, if everything came together perfectly (or nearly so), it would make a greater impression on us. But we don't get to see all the songs that we hear and like. And some songs are better not seen :)

    ReplyDelete
    Replies
    1. మరి హీరోయిన్ని ఎవరు చంపుతారు? మనకి హీరో ఫ్రెండ్ మీద అనుమానం ఉండేలా కథ ఉంటుంది. కానీ ఆ అమ్మాయిని ఎవరు చంపారన్నది suspense.

      Let us not get into the specifics. I too like this kannevayasu song. t tried to tell a point. i may be wrong in choosing this song.

      Delete
    2. "హీరోయిన్ని చంపే నీచ హీరోకి దాశరధి కవిత్వం అనవసరం." This prompted me to comment the way I did. I think the heroine commits suicide. There must be someone more knowledgeable here who can clarify this.
      The story being what it is kept me from enjoying the song for a long time as I already mentioned. I think that means I do agree about the effect of other factors on enjoying movie songs.
      My original comment was lengthy. But I cut it short after realising that I actually seem to agree with the points you made to a great extent. But you seemed to ahve got the opposite idea :(

      Delete
    3. లలిత గారు,

      ఇన్నాళ్ళు recent memory loss తో DAT (dementia of Alzheimer's type) first phase లో ఉన్నాననుకొని బ్రతికేస్తున్నాను. ఇప్పుడర్ధమయ్యింది. నా వ్యాధి రెండో దశకి చేరుకుంది. remote memory loss కూడా మొదలైంది. నాకెందుకో మీరే కరెక్టనిపిస్తుంది. కాబట్టి నా పోస్ట్ ఎడిట్ చేద్దామని నిర్ణయించుకున్నాను.

      కన్నెవయసు మాతృక లింక్ ఇస్తున్నాను.

      http://en.wikipedia.org/wiki/Chembarathi

      Delete
  9. భోనగిరి గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను , రాజన్ నాగేంద్ర లు అద్భుత మైన సంగీత దర్శకులు .
    అయినా పండిపోయిన (ముదిరిపోయిన ) నాగేశ్వర రావు , సావిత్రి ఘంటసాల ఎక్కడ , అప్పుడే గుడ్డు లోంచి బయటికి వస్తున్న లక్ష్మి కాంత్, రోజా రమణి బాలసుబ్రమణ్యం లు ఎక్కడ . ఆ పోలికతో చూసినట్లయితే ఏ దివిలో పాటే మహా అద్భుతం.

    ReplyDelete
    Replies
    1. ఈ రెండూ నాకిష్టమైన పాటలే. మంచి పాటలే. అందుకే నా పాయింట్ కోసం discussion లో వాడుకున్నాను. కాకపొతే రెండో పాట selection లో దెబ్బ తిన్నాను.

      క్షమించాలి. నేను ఈ రెండు పాటలకి పోటీ పెట్టి.. ఏది మంచి పాటో opinion poll అడగలేదు. గమనించగలరు.

      కమనీయం గారి లానే నేనూ (సినిమా పేరు కూడా తెలీదు) ఎన్నో పాటలు ఇష్టంగా వింటాను. భాష కూడా తెలీకుండా కొన్ని పాటలు ఇష్టంగా వింటాను. సంగీతానికి, సాహిత్యానికి ఉన్న శక్తి చాలా గొప్పది. కాదనగల వారెవరు!

      పైన Weekend Politician గారి వ్యాఖ్య చదవండి. నే చెప్పదల్చుకున్న పాయింట్ ఆయన నాకన్నా బాగా రాశారు.

      Delete
  10. బాగుంది.చాలా బాగా రాశారు.

    ReplyDelete
  11. డాక్టర్ గారు,
    కూర కన్నా మసాలా ఎక్కువైన వంటలా వుందండి మీ బ్లాగోతం.ఒక్కోసారి ఉట్టి పుణ్యానికే కొందరికి పేరు వస్తుందనటానికి ఉదహరణ కన్నెవయసు లోని ఆ పాట.అదే పాట ను జానకి గారి గొంతులొ వినిచూడండి..ప్రయత్నిస్తే నెట్ లో దొరుకుతుంది.

    ReplyDelete
  12. రమణగారు,

    మీలాంటి అనుభవమే ఒకసారి ఎదురైంది. ఆ మధ్య తెలుగు సినేమాలో రాధకృష్ణుల పైవచ్చిన పాటలు అన్నింటిని చిమటా మ్యుజిక్ లో సర్చ్ చేసి వినటం మొదలు పెట్టాను. అందులో సాహిత్యపరంగా ఆత్రేయగారు రాసిన "పొన్నచెట్టు నీడలో కన్నయ పాడితే రాగాలే రేగాయి రాధమ్మ మది లో " అనే పాట నాకు చాలా నచ్చింది. ఆపాటను ఎక్కువగా ఊహించుకొని, చూడాలని ఎంతో ఆత్రుతతో యుట్యుబ్ గాలించి పట్టుకొన్నాను. ఆపాటలో మల్లయోధురాలు లాగా ఉన్న, ముదురు రాధను చూసి హతాశుడైయ్యాను. ఇటువంటి రాధలను అరుదు గా చూస్తాం . మీరూ ఒకసారి చూడండి.

    http://www.youtube.com/watch?v=U9HTTlKvQ2U


    SriRam

    ReplyDelete
    Replies
    1. బుల్లబ్బాయ్19 August 2012 at 04:26

      అడ్డెడ్డె... ఎంత మాట అనేసారు... మా బాపూ హీరోవిన్ ని పట్టుకుని....

      Delete
    2. ఏం బాపు హీరొయినో, ఆ ముదురు రాధమ్మని, రమణగారు చూసి జడుసుకొనట్లున్నారు. నిన్నంగావ్యాఖ్య రాస్తే ఇప్పటివరకు ఉలుకు పలుకు లేదు.

      SriRam

      Delete
    3. అయ్యో! అదేం లేదండి. నిన్న మా ఖడ్గ తిక్కన వచ్చాడు.

      http://yaramana.blogspot.in/2011/11/blog-post_06.html (పోస్టులో వ్యక్తి) రోజంతా వాడితోనే సరిపోయింది.

      ఈ పాట నేనెప్పుడూ విన్లేదు. ఇప్పుడు చూశాను. నాకు పాట కూడా ఆకాశవాణి లలిత సంగీతం (ప్రైవేట్ గీతాలు) వింటున్నట్లుగా అనిపిస్తుంది. లింక్ కి ధన్యవాదాలు.

      Delete
    4. సరిపోయింది. మీరు ఆపాటవిని ఇలా అంటారని అనుకోలేదు. మీరు రాధా తత్వం బాగా అర్థం చేసుకోవలసిన అవసరం ఎంతైనాఉంది :) ఈ క్రింది టపా చదివి ప్రేమ గురించి తెలుసుకోండి.

      రాధా తత్త్వం
      http://teluguyogi.blogspot.in/2012/08/blog-post_14.html

      SriRam

      Delete
    5. శ్రీరాం గారు,

      నేను వృత్తి రీత్యా మనస్తత్వం అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తుంటాను. ఇప్పుడు మీరు రాధా తత్వం అంటున్నారు. ప్రయత్నిస్తాను.

      Delete
    6. డాక్టర్ గారు,

      ఫీజు తీసికోని వైద్యం చేస్తే అది మనస్తత్వం. తీసికోకుండా చేస్తే రాధా తత్త్వం :)

      Delete
  13. There are a couple of dimensions thay you may like to ponder:

    1. Even if the picture itself is a flop, the particular scene may be be effective. Nehru's funeral scene was used in a otherwise forgettable movie with Kaifi's tribute (meri awaz suno) played in the background.

    2. The visuals may not even be from a movie. The patriotic non-filmi song "ai mere watan ke logo" brings up visuals of Lata's addressing the troops. Similarly Rafi's "kar chale hum fida" conjures up images of streets lined with flags with the music blaring on loudspeakers that we see every year (and not the actual movie scene).

    Sorry for my examples but it is just a couple of days after August 15. Try as I might, I can't erase these so quickly!

    ReplyDelete
  14. Dear Ramana, excellent post as usual. Adding visuals certainly set the scene for a memorable musical experience. It is wonderful when all the elements fall in place like the Mugamanasulu song you referenced. I personally like the picturization of "Muddabanti Poovulo" much better. I refuse to see David Copperfield movie to this day because I have my own reels in my brain from reading the Charles Dickens book from my childhood that I don't like to be messed with.

    One small correction with regard to appetite and hypothalamus. Perhaps, you meant feeding center (lateral hypothalamus) when you said satiety center which as the name implies suppresses hunger and is located in the ventromedial hypothalamus.

    http://www.youtube.com/watch?v=UrGzsGZYedg

    BSR

    ReplyDelete

  15. డాటేరు రమణ గారి టపాలు గుత్తి వంకాయ లాంటి 'ఉప్మానాలతో' లేకుంటే ఎట్లా చదవ లేమో అట్లా అని చెప్పండి ఈ 'దృశ్య శ్రవణ ' వాక్య కావ్య రస రమ్య గీతికలు

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
    Replies
    1. జిలేబి గారు,

      అంతే! అవును. నిజం. బాగా గ్రహించారు. ధన్యవాదాలు.

      Delete
  16. రమణా,

    ముందుగా ఓ మాట. నువ్వు రాసిన టపా చదివి కామెంట్ రాసే లోపు ఇంకో టపా వచ్చి పడుతోంది. నిజానికి నేను చైనా, చదువులు గురించి రాద్దామనుకుంటున్నాను. కాని ఈ లోపే చంద్రబాబు, పాటలు వగైరాలు వచ్చేసినాయి. ఇంకా అక్కడే వుంటే నిన్న వెళ్ళిపోయిన సినిమాకి ఈ రోజు చప్పట్లు కొట్టినట్టు వుంటుంది అని వర్తమానంలోకి వచ్చేసాను.

    ఐనా నువ్వు అలా పుంఖాను పుంఖాలుగా తమిళనాడు ఎక్స్ ప్రెస్ లాగ రాసుకుంటూ పొతే మాలాంటి గూడ్స్ బళ్ల పరిస్థితి ఏమిటి? అప్పుడప్పుడన్నా మాక్కోడా ఓ మీటరు గేజీ కాకపోయినా కనీసం నేరో గేజీలోనన్నా కాస్త చోటివ్వు మిత్రమా.

    సిసుర్వేత్తి పసుర్వేర్తి.. అన్నారు. సంగీతానికి భాష, ప్రాంత తరతమ బేధాలు లేవు కాబట్టి ఎవర్ని ఐనా అలరిస్తుంది. ఐతే నువ్వు చెప్పినట్టు ఆడియో విజువల్ ఎఫెక్ట్ చాల వుంటుంది. మా చిన్నప్పుడు లోవేర్ ఫోరమ్స్ చదివే రోజుల్లో సోషల్ స్టడీస్ క్లాసులో ఎప్పుడన్నా మ్యాప్ లు తీసుకొచ్చి చెప్పిన పాఠాలు నాకు ఇప్పటికి గుర్తు ఉన్నాయి.

    మంచి డైరెక్టర్, మంచి కథతో మంచి పాటని మంచి ట్యూన్ తో మంచి నటీనటుల మీద మంచిగా చిత్రించి మంచి పేరు సంపాదిస్తాడు. ఆ పాట నాలుగు కాలాల పాటు నలుగురి నోళ్ళలో నానుతుంది.

    'మనకి చాల ఇష్టమయిన పాట.. మనం స్నానం చేస్తున్నప్పడు.. పక్కింటి వాళ్ళ రేడియోలో వస్తుంటే.. చక్కగా వినలేకపోతున్నందుకు పడే బాధ వర్ణనాతీతం.' - అని రఘు అంటుండేవాడు.

    ఇప్పుడు వస్తున్న పాటల్లో సాహిత్యం తక్కువ సౌండ్స్ ఎక్కువ అవటంతో పుబ్బలో పుట్టి మఖలో మరణిస్తున్నాయి. ఓ ఫ్రెండ్ చెప్పాడు 'మెలోడీ' అంటే అక్కడక్కడ కొన్ని మాటలు ఉంటాయట! 'మ్యూజికల్' అంటే అన్నీ సౌండ్స్ మాత్రమే ఉంటాయట!

    మంచి పాటలు, మరణం లేని పాటలు రావాలంటే ఓ టీం ముఖ్యం - కథకుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు, కొండొకచో సింగర్ పాటల రచయితతో కలసి పాటని తయారుచేస్తారు. ఆ పాట పదికాలాలు బతుకుతుంది.

    కామెంట్ పోస్ట్ అంత అవుతుంది. అందుకని ఓ చిన్న ఉదాహరణ చెప్పి ఆపేస్తాను. హిందీలో బర్మన్ ని వదిలేసి.. నాకునచ్చిన ఓ గొప్ప టీం రాజకపూర్, శంకర్-జైకిషన్, శైలేంద్ర, ముఖేష్. రాజకపూర్ కి శివరంజని రాగం అంటే చాల చాల ఇష్టంట. చివరిగా తీసిన 'మేరా నామ్ జోకర్' తో పాటు అన్ని రాజ్ కపూర్ సినిమాల్లోనూ ఆ రాగంలో ఓ పాట ఉంటుంది.

    'జిస్ దేశమే గంగ బెహతి హై' లో 'జీనా యహా మర్నా యహా' ట్యూన్ వినిపిస్తుంది. అంటే అప్పటికే ఓ ట్యూన్, దానికి తగ్గ ఓ పాట బేసిక్ గా తయారు అయి ఉన్నాయి. కేవలం పాటల కోసమే మేరా నామ్ జోకర్ సినిమాని దాదాపుగా ఓ ముప్పై సార్లయిన చూశానని చెబితే నన్ను నీ పేషెంట్ అనుకుంటావేమో! కాని ఇది నిజంగా నిజం. నువ్వు చెప్పినది యెంత కరెక్టో గదా!

    అన్నట్టు ఈమధ్య నువ్వు రాసే పధ్ధతి కొద్దిగా రంగనాయకమ్మని గుర్తుకు తెస్తోంది. కీప్ ఇట్ అప్

    గోపరాజు రవి

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.