Friday 29 June 2012

నా 'గురజాడ' కష్టాలు

"గురజాడ అప్పారావు!? ఎవరీ గురజాడ? స్వాతంత్ర సమరయోధుడా? రాజకీయ నాయకుడా? నాటకాలేస్తాడా? పాటలు పాడతాడా? సినిమాలు తీస్తాడా? వున్నాడా? పొయ్యాడా? పేరు గంభీరంగానే వుంది, గాంధీగారికి శిష్యుడా? గురజాడా! మై డియర్ గురజాడా! హూవార్యూ?" నన్నునేనీ ప్రశ్నలడుక్కోవడం ఇది డెబ్భైనాలుగోసారి, బట్ నో సమాధానం!

అది మా హైస్కూల్. ఇంకొంతసేపట్లో వ్యాసరచన పోటీ జరగబోతుంది. టాపిక్ - 'గురజాడ అప్పారావు' అని మొన్ననే తెలుసు. రెండ్రోజుల క్రితం క్లాసులోకి ఈ వ్యాసరచన తాలూకా నోటీసు వచ్చింది. మా క్లాస్ టీచర్ 'పాల్గొనువారు' అంటూ ఏకపక్షంగా కొందరిపేర్లు రాసేశారు. పిమ్మట 'మీకు ప్రైజ్ ముఖ్యం కాదు, ఆ మహానుభావుడి గూర్చి నాలుగు ముక్కలు రాయడం ముఖ్యం!' అంటూ వాక్రుచ్చారు. ఆవిధంగా నా ప్రమేయం లేకుండానే వ్యాసరచన పోటీదారుణ్ని అయిపొయ్యాను. ఆరోజు స్కూల్ అయిపోంగాన్లే గురజాడ గూర్చి వివరాలు సేకరించే పనిలో పడ్డా.

శాస్త్రిగాడి నమ్మకద్రోహం నా కొంప ముంచింది. ఇప్పుడు శాస్త్రిగాడి గూర్చి నాలుగు ముక్కలు. శాస్త్రిగాడు నా క్లాస్మేట్. గత రెండేళ్ళుగా నాపక్కనే కూచుంటాడు, వాడికి నా పక్కన ప్లేసు చాలా ఇష్తం! ఎందుకని? పరీక్షల్లో వాడు నా ఆన్సర్ షీటుని జిరాక్స్ మిషన్ కన్నా వేగంగా కాపీ కొడతాడు. అదీ సంగతి! అందుకు కృతజ్ఞతగా కొన్ని సందర్భాల్లో వాడు నాకు అసిస్టెంటుగా వ్యవహరించేవాడు.

'ఉరేయ్! గురజాడ అప్పారావు గూర్చి నువ్వస్సలు వర్రీ అవ్వకు. మా బాబాయ్ దగ్గర ఇట్లాంటి విషయాల మీద మోపులకొద్దీ మెటీరియల్ ఉంటుంది. రేపు తెచ్చిస్తాను.' అని హామీ ఇచ్చాడు శాస్త్రి. విషయం చిన్నదే కాబట్టి శాస్త్రిగాణ్ణి నమ్మి, ఇంక నేనావిషయం పట్టించుకోలేదు.

మెటీరియల్ అదిగో, ఇదిగో అంటూ చివరి నిమిషందాకా లాగాడు శాస్త్రి. ఇప్పుడు మొహం చాటేశాడు. మిత్రద్రోహి! మొన్న క్వార్టర్లీ పరీక్షల్లో ఇన్విజిలేటర్ కఠినంగా ఉన్నందున, శాస్త్రిగాడికి చూసి రాసుకునేందుకు ఎప్పట్లా పూర్తిస్థాయిలో 'సహకరించ'లేకపొయ్యాను. అదిమనసులో పెట్టుకున్నాడు, దుర్మార్గుడు! కుట్ర పన్నాడు. ఆ విషయం గ్రహించలేక కష్టంలో పడిపొయ్యాను.

ఇంక లాభం లేదు, ఈ గరజాడ ఎవరో అడిగి తెలుకోవాల్సిందే. 

"ఒరే నడింపల్లిగా! గురజాడ గూర్చి తెలిస్తే కాస్త చెప్పరా!"

"గురజాడా! ఎవరాయన? నాకు తెలీదు." అంటూ జారుకున్నాడు నడింపల్లిగాడు.

'దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా' అంటూ బట్టీవేస్తున్న పంగులూరిగాడు, నన్ను చూడంగాన్లే హడావుడిగా కాయితం జేబులో పెట్టుకుని క్లాస్ రూములోకి పారిపొయ్యాడు.

"ఒరేయ్! నువ్వు ఇవ్వాళ మాక్కూడా చూపించు! ఎంతసేపూ ఆ శాస్త్రిగాడికే చూపిస్తావేం? ఊరికినే చూపించమనట్లేదు! సాయంకాలం మామిడి కాయలు తెచ్చిస్తాంలే!" అంటూ బేరంపెట్టారు జంటకవులైన భాస్కరాయ్, సత్తాయ్ ద్వయం.

భాస్కరాయ్, సత్తాయ్ ప్రాణస్నేహితులు. మా బ్రాడీపేట ఇళ్ళల్లో మామిడిచెట్లకి రక్షణ లేదు. కాయలు ఉన్నట్టుండి మాయమైపొయ్యేవి. అది వీరి చేతిచలవే! ఇలా కొట్టేసిన కాయల్తో వీరు వాణిజ్యం చేసేవాళ్ళు. పరీక్షల్లో కాపీకి సహకరించే స్నేహితుల, ఇన్విజిలేటర్ల ఋణం మామిడికాయల్తోనే తీర్చుకునేవాళ్ళు. పరీక్షలయ్యాక టీచర్ల ఇళ్ళకి వెళ్ళి 'మా పెరట్లో చెట్టుకాయలండి' అంటూ భక్తిప్రవృత్తులతో గురుపత్నులకి సాష్టాంగప్రణామం చేసి బుట్టెడు కాయలు సమర్పించుకునేవాళ్ళు. వీరీ మంత్రాంగంతో విజయవంతంగా అనేక పరీక్షల్లో పాసు మార్కులు సంపాదించారు.

"ఏంటి మీకు నేను చూపించేది! శాస్త్రిగాడు నన్ను మోసం చేశాడు. నాకే ఏం చెయ్యాలో అర్ధం కావట్లేదు." అన్నాను దీనంగా.

"నీకేం తెలీదు, శాస్త్రిగాడు నిన్ను మోసం చేశాడు, ఇదంతా మేం నమ్మాలి! బయటకొస్తావుగా, అప్పుడు తేలుస్తాం నీ సంగతి." అంటూ గుడ్లురిమారు జంటకవులు.

క్లాసురూములోకి అడుగుబెట్టాక అక్కడి వాతావరణం చూసి నీరుగారిపొయ్యాను. పబ్లిక్ పరీక్ష రాయిస్తున్నట్లు అందర్నీ దూరందూరంగా కూర్చోబెట్టారు, పక్కనున్నవాడిని అడిగే అవకాశం లేదు. నా మిత్రశత్రువులు, శత్రుమిత్రులు అందరూ వారివారి స్థానాల్లో ఆశీనులై ఉన్నారు. ఇప్పటిక్కూడా గురజాడ ఎవరో కనీసం ఒక చిన్న హింట్ కూడా నాదగ్గర లేదు!

నా వెన్నుపోటుదారుడైన శాస్త్రిగాడు కొత్త పెళ్ళికొడుకులా ముసిముసిగా నవ్వుకుంటూ చాలా కాన్ఫిడెంటుగా ఉన్నాడు. నేను శాస్త్రిగాడి దగ్గరకెళ్ళాను. కసిగా, కర్కశంగా, కోపంగా ఒక్కోఅక్షరం వత్తిపలుకుతూ నిదానంగా, నెమ్మదిగా వాడిచెవిలో అన్నాను.

"ఒరే శాస్త్రిగా! దరిద్రుడా, దౌర్భాగ్యుడా, నికృష్టుడా! పంది, ఎద్దు, దున్న! నీలాంటి నీచుణ్ణి నేనింతమటుకూ చూళ్ళేదు. నువ్వు గురజాడ గూర్చి చాలా విషయాలు బట్టీ కొట్టావని నాకు తెలుసురా. కనీసం ఇప్పుడయినా రెండు పాయింట్లు చెప్పిచావు, నిన్ను క్షమించేస్తాను." అంటూ వాడి పాపపరిహారానికి చివరి అవకాశం ఇచ్చాను. శాస్త్రిగాడు నామాట వినబడనట్లు మొహం పక్కకి తిప్పుకున్నాడు.

నేను కోపంగా నా స్థానంలోకొచ్చి కూర్చున్నాను. నాకు గురజాడ గూర్చి తెలీకపోవడం కన్నా.. నా స్నేహితులు నాకు ఇంతలా సహాయ నిరాకరణ చెయ్యడం చాలా అవమానకరంగా అనిపిస్తుంది. బాధగా ఉంది, ఏడుపొస్తుంది. బహుశా బ్రిటీషోడిక్కూడా గాంధీగారు ఇంత ఘోర సహాయ నిరాకరణ చేసుండరు! 

వ్యాసరచన సమయం మొదలైంది. మిత్రులంతా కళ్ళు మూసుకుని, శబ్దం బయటకి రాకుండా పెదాలు కదుపుతూ సరస్వతీ ప్రార్ధన చేసుకున్నారు. అయోమయంగా వాళ్ళని చూస్తుండిపొయ్యాను. నా జీవితంలో నాకెప్పుడూ ఇలాంటి అనుభవం లేదు. 

కొద్దిసేపటికి నిదానంగా ఆలోచించడం మొదలెట్టాను. 'ఎలాగూ గంటదాకా బయటకెళ్ళనివ్వరు. ఏదోకటి రాస్తే నష్టమేముంది? అయినా గురజాడ అప్పారావు గూర్చి తెలుసుకుని రాస్తే గొప్పేముంది? తెలీకుండా రాయడమే గొప్ప!' అంటూ ఒక నిర్ణయం తీసుకున్నాను. కొద్దిగా ఉత్సాహం వచ్చింది.

నా తెలుగు, సోషల్ పాఠాలు జ్ఞప్తికి తెచ్చుకున్నాను. శ్రీకృష్ణదేవరాయలు, ఝాన్సీ లక్ష్మీబాయి, టంగుటూరి ప్రకాశం, గాంధీ మహాత్ముడు, సర్దార్ పటేల్.. ఇట్లా గుర్తున్నవారందర్నీ బయటకి లాగాను. అందర్నీ కలిపి రోట్లో వేసి మెత్తగా రుబ్బి, ఇంకుగా మార్చి పెన్నులో పోశాను. ఇంక రాయడం మొదలెట్టాను.

'అమృతమూర్తులైన గురజాడ అప్పారావు గారు కారణజన్ముడు. వీరు భరతమాత ముద్దుబిడ్డ. అసమాన ప్రజ్ఞాసంపన్నుడు, మహోన్నత వ్యక్తి. వీరి ప్రతిభ అపూర్వం, పట్టుదల అనితరసాధ్యం! ఈ పేరు వినంగాన్లే తెలుగువారి హృదయం ఆనందంతో పులకిస్తుంది, గర్వంతో గుండెలు ఉప్పొంగుతాయి. ఇంతటి మహానుభావుడు మన తెలుగువాడు కావడం మన అదృష్టం. ఆయన నడయాడిన ఈ పుణ్యభూమికి శతకోటి వందనాలు. మన తెలుగువారి ఉన్నతి గురజాడవారి త్యాగఫలం! సూర్యచంద్రులున్నంత కాలం గురజాడవారి కీర్తి ధగధగలాడుతూనే ఉంటుంది. గురజాడవంటి మహానుభావుని గూర్చి రాయడం నా పూర్వజన్మ సుకృతం. నా జీవితం ధన్యం..... ' ఈ విధంగా రాసుకుంటూ పోయాను. నా చేతిరాత అక్షరాలు పెద్దవిగా వుంటాయి. ఒక పేజికి పదిలైన్లు మించి రాసే అలవాటు లేదు. తదేక దీక్షతో అనేక ఎడిషనల్ షీట్లు రాసేశాను.

ఎక్కడా పొరబాటున కూడా గురజాడ గూర్చి చిన్న వివరం ఉండదు! కానీ చాలా రాశాను, చాలాచాలా రాశాను. శాస్త్రిగాడు చేసిన ద్రోహానికి కోపంతో రాశాను, ఆవేశంగా రాశాను. అది ఒక రాత సునామి, ఒక రాతా తాలిబానిజం, ఒక రాతా రాక్షసత్వం. కోపం మనలోని భాషాప్రావిణ్యాన్ని బయటకి తెస్తుందేమో!

వ్యాసం రాయడానికి ముందు 'శ్రీరామ' అని పెద్దక్షరాలతో హెడింగ్ పెట్టుకుని ఏంరాయాలో తెలీక పక్కచూపులు చూస్తున్న సత్తాయ్, భాస్కరాయ్ గాళ్ళు నా రాతోన్మాదాన్ని చూసి కోపంతో పళ్ళు నూరుతున్నారు. నిక్కర్ లోపల్నించి చిన్నస్లిప్ తీసి మేటర్ మూణ్ణిమిషాల్లో రాసేసిన నడింపల్లిగాడు దిక్కులు చూస్తూ కూర్చున్నాడు. బట్టీకొట్టిన పదిపాయింట్లు పదినిమిషాల్లో రాసేసిన శాస్త్రిగాడు నన్ను ఆశ్చర్యంగా గమనిస్తున్నాడు. ఆమాత్రం కూడా గుర్తురాని పంగులూరి గాడు బిత్తరచూపులు చూస్తున్నాడు. ఆరోజు ఆ వ్యాసరచన పోటీలో అందరికన్నా ఎక్కువ పేజీలు ఖరాబు చేసింది నేనేనని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదనుకుంటా!

ఓ పదిరోజుల తరవాత వ్యాసరచనా పోటీ ఫలితాల్ని ప్రకటించారు. దాదాపు యాభైమంది రాసిన ఆ పోటీలో నాకు ద్వితీయ బహుమతి వచ్చింది. ప్రధమ, తృతీయ స్థానాలు ఎవరివో గుర్తు లేదు. స్నేహద్రోహి శాస్త్రిగాడికి ఏ బహుమతీ రాలేదు. అది మాత్రం గుర్తుంది. నాక్కావల్సిందీ అదే. మనసులోనే వికటాట్టహాసం చేసుకున్నాను.

ఆ రోజు స్కూల్ ఎసెంబ్లీలో ఫలితాల్ని ప్రకటిస్తూ హెడ్ మేస్టరుగారు అన్నమాటలు కూడా గుర్తున్నాయి. "అద్భుతంగా రాశావు బాబు. కానీ గురజాడ ఎవరో రాయడం మర్చిపొయ్యావు. కనీసం గురజాడ 'రచయిత' అన్న ఒక్కపదం రాసినా నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. అందుకే ఇంత బాగా రాసినా ఆ ఒక్కకారణంగా నీకు సెకండ్ ప్రైజ్ ఇవ్వాల్సొచ్చింది." అని మెచ్చుకుంటూ తెగ బాధపడ్డారు.

నాకు గురజాడ 'రచయిత' అన్న పదం తెలీదని ఆయనకి తెలీదు. పాపం హెడ్ మేస్టరుగారు! విద్యార్ధుల్లో నాలాంటి మోసకారులుంటారని ఆయనకి తెలిసినట్లు లేదు!  

67 comments:

  1. కర్రా ఇరక్కుండా పామూ చావకుండా బాదటం అంటే ఇదే! (మమ్ముల్ని కాదులే ఉపాధ్యాయ ప్రధానోపాధ్యాయుల్ని బాదావన్న మాట!) ఆ మాటకొస్తే మనమందరమూ ఎప్పుడొ ఒకసారి ఈ బాట పట్టిన వాళ్ళమే! కొంతమంది పాత మిత్రులి పేర్లు గుర్తు చేసావ్ , క్రుతగ్ఙతలు! ఆర్తనాదం కాదులే కేక పెట్టించేట్లుగానే రాసావ్--- నీ శైలిలో!
    గత రెండు సార్లు కామెంటెట్ట టానికి సమయం దొరకలా! గుండమ్మత్త గురించి, కాకా గురించి. నీ రాత చూసి, మళ్ళీ DVD బయటకు తీసి చూసా, ఆనందించా. ప్చ్ కాకా ఏం చేస్తాం. ఒంటరితనం, మందు, మనోవ్యాధి ... నీ రంగమే. వెళ్ళి నయం చెయ్యకూడదూ!అన్నీ ఇక్కడే రాసానని సౌండివ్వమాకు! సౌండినపడకుండా మర్ధన చెయ్యాల్సొస్తుంది!
    గౌతం

    ReplyDelete
    Replies
    1. నీకు మన పాత రోజులు గుర్తొచ్చాయి అంటే నేను పోస్ట్ బాగానే రాసినట్లే! నావంటి దుష్టుణ్ణి బాగుచేసిన మన స్కూలుకి జోహార్లు. మన టీచర్లు మన బాగు (బాగు.. బ్లాగు కాదు) కోసం బాగా కష్టపడ్డారు. వారికి హృదయపూర్వక వందనాలు.

      Delete
  2. రమణ గారు గురజాడ రచయిత అనగానే నమ్మేశారా ?
    నిర్ధారించుకోవడానికి ప్రయత్నించారా ?

    ReplyDelete
    Replies
    1. చెప్పినవారు మా ప్రధానొపాధ్యాయులు. నమ్మక తప్పదు!

      ఐనా.. అటు తరవాత 'కన్యాశుల్కం' పలు మార్లు చదివి పాపపరిహారం చేసుకున్నాన్లేండి!

      Delete
  3. విద్యార్ధుల్లో నాలాంటి మోసకారులుంటారని ఆయనకి తెలిసినట్లు లేదు!!
    --------------------
    నా ఉద్దేశంలో మోసకారుల్లో మొదట శాస్త్రి, నడింపల్లి గాడు, పంగులూరి గాడూ,----, చివర Yaramana (స్కూల్లో ఏమని పిలిచే వాళ్ళో తెలియదు).

    వాళ్ళు గనుక ఆ నాలుగు ముక్కలూ గురజాడ గురించి చెబితే అందరూ మోసకారులు అయ్యే వాళ్ళు కాదు.
    బాధేస్తుంది! ఎవరి మూలానో జీవితంలో మనకిష్టంలేకుండా "మోసకారు" అవ్వల్సోస్తుంది. నా ప్రఘాడ సానుభూతి.

    ReplyDelete
    Replies
    1. ఆ రోజుల్లో పక్కవాణ్ణి పక్కనెయ్యడానికి తెలిసినా చెప్పేవాళ్ళు కాదులేండి! నాకు ఇవన్నీ గొప్ప నోష్టాల్జియా!

      Delete
  4. Ramana, M.D exam kuda ilane raasava, appudu kuda chala additional papers tisukunnavu? :)

    ReplyDelete
    Replies
    1. చాలా బాగుంది చిన్నతనం లొ ఇవి ప్రతివక్కరికీ అనుభవమే . పల్లెటుర్లలొ అయిత ఇంకా తమాషా అయిన సంఘటనలు జరుగుతూ వుంటాయి. కొంతమంది విమర్శ పేజీల కొద్దీ వుంటుంది కాని అందులొ విషయం ఒక ముక్కా వుండదు. అలాగే వుంది మీరు గురజాడ గురించిరాసింది.

      Delete
    2. @Krishna Mohan,

      ఏం చెయ్యమంటావు నాయనా? గురజాడ వ్యాసంతో పట్టిన ఊకదంపుడు అలంకారిక భాషా రోగం ఇప్పటికీ వదలట్లేదు!

      Delete
    3. రామమొహన్ గారు,

      అప్పుడప్పుడు ఉదయాన్నే తెలుగు న్యూస్ చానెళ్ళలో చర్చా కార్యక్రమాలు చూస్తుంటాను. నాకు వాళ్ళు నా 'గురజాడ వారసులు' గా కనిపిస్తారు!

      Delete
  5. ఓర్నాయనో ! పిచ్చి పిచ్చి గా నవ్వుకున్నాను. మా బాసుడు ఎప్పుడూ ఏడ్చినట్టుండే నా మొహం ఇలా వికసించేసరికీ, పిచ్చి చూపులు చూసాడు. థాంకులు మీకు.

    ReplyDelete
    Replies
    1. ఒట్టి థాంక్సులు నాకెందుకండి! బ్లాగుల్లో consultation fee తీసుకునే సౌలభ్యమేమన్నా ఉందా?

      Delete
  6. విషయం లేకుండా పేజీలకు పేజీలు నింపారా, శభాష్. అదే స్పూర్తితో రాజకీయాలకు వెళ్లుంటే బాగుండేది.

    ఉపన్యాసం నిండా hot air, gestures & హావభావాలు నింపే వారే రాణిస్తారు. ఉ. NTR మాట్లాడితే ఆయన ఎ విషయం పై స్పీచు దంచారో ఎవరికీ గుర్తు ఉండదు.

    ReplyDelete
    Replies
    1. నాకు NTR హావభావాలు, భాష దుర్యోధనుడి డైలాగుల్లా ఉంటాయి. విషయం లేకుండా సాగతీతలో KK ది అగ్రస్థానం. ఇంక మనకెక్కడుంది ప్లేస్!

      Delete
  7. "ఒక రాత సునామి. ఒక రాత తాలిబానిజం. ఒక రాత రాక్షసత్వం."

    "అద్భుతంగా రాశావు బాబు. కానీ గురజాడ ఎవరో రాయడం మర్చిపొయ్యావు. కనీసం గురజాడ 'రచయిత' అన్న ఒక్క పదం రాసినా నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. అందుకే ఇంత బాగా రాసినా ఆ ఒక్క కారణంగా నీకు సెకండ్ ప్రైజ్ ఇవ్వాల్సొచ్చింది."

    -- Mind Blowing

    ReplyDelete
  8. @నా జీవితంలో మొదటిసారిగా బ్లాంక్ మైండ్ తో, చేష్టలుడిగి కొన్ని క్షణాలు అలా కూర్చుండిపోయాను. కొద్దిసేపటికి నిదానంగా ఆలోచించడం మొదలెట్టాను. @@

    కధ లొ హీరొ ని బాగా ఎలివేట్ చేసిన సన్నివేశం :D

    ReplyDelete
    Replies
    1. ఏదో అలా వర్కౌట్ అయ్యిందండి! థాంక్స్!

      Delete
  9. Nenu naa B.Tech kooda ilaane pass ayyaam boss.

    ReplyDelete
  10. డాక్టరు గారూ... ఈ సారి మీ కేసుషీట్ అదిరిపోయిందనుకొండి..................

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ! అదిరిపొతే పర్లేదు. చిరిగిపోతేనే ఇబ్బంది!

      Delete
  11. ఎనిమిదో క్లాసులో అనుకుంటా. ఇనుము ఎక్కడ దొరుకును? బంగారం ఎక్కడ అని ఇలాంటి చెత్త ప్రశ్నలు అడిగేవారు. ఇన్ని ఊర్ల/గనుల పేర్లు ఎవరు గుర్తు పెట్టుకుంటారు? అంచేత నేను వాడిన టెక్నిక్ ఏమిటంటే, ఒక పది ఊరిపేర్లు గుర్తు పెట్టుకోవడం. కలకత్తా, మద్రాస్, బొంబాయి ఇత్యాది. ఏది అడిగినా, ఓ మూడు ఊరిపేర్లు రాసిపాడేయడమే? ఆ టీచర్లకి గుర్తుంటుందా, గుడ్డా?

    ఆ తర్వాత పదో క్లాసులోకి వచ్చేక అప్పుడు చెప్పేరు - ఒరే నాయనా నువ్వు సోషల్ స్టడీస్ లో మంచి మార్కులు సంపాదించేవు, అంచేత నీకు వంద రూపాయలు ష్కాలర్షిప్ అని. మన ఆంధ్రా టీచర్ల మతి చూస్తే ఇదే మన దౌర్భాగ్యం అని తెల్సిపోతుంది ఇప్పుడు కూడా. వీళ్ళా మన గురువులు? చావ చితక్కొట్టే వారు బెత్తంతో. ఉత్తరోత్తరా మేము పదో క్లాసులో సోషల్ స్టడీస్ లో మొత్తం క్లాస్ అందరికీ యాభై కి 28 మార్కులేసారు. అందరం పాసే కానీ మోడరేషన్ వల్ల పాస్ అయ్యాము అని చెప్పేరు. మా టీచర్ చెప్పిన నోట్స్ మొత్తం క్లాస్ అందరూ రాయడం వల్ల కాపీ అనుకుని మార్కులలా వేసారు కాబోలు.

    తర్వాత ఇంజినీరింగులో కూడ సోషల్ స్టడీస్ లో రెండుసార్లు బొక్క బోర్లా పడ్డాను అనుకోండి అది వేరే విషయం. :-)

    ReplyDelete
    Replies
    1. అయ్యా! మనమందరం ఒకే తాను ముక్కలం! 'టీచర్లని మనం బోల్తా కొట్టించామా? లేక వాళ్ళు జాలితో మనని ఒడ్డున పడేసేవారా?' ఆలోచించాలి!

      ఇంత మంచి కామెంట్ అజ్ఞాతగా రాశారేమి! మీ కామెంట్ spam లో చిక్కుకుంది. ఇప్పుడే విడిపించాను!

      Delete
    2. ఇంజినియరింగ్ లో సోషియల్ స్టడీస్???? ఏ కాలేజ్ లో బాబూ????

      Delete
  12. జగ్జీవన్ రామ్ గురించి మా క్లాసు మొత్తానికి ఇదె సమస్య వచ్చింది. ఆయన జయంతి ,సెలవు రొజు పురస్కరించుకొని చర్చించ మన్నారు :) మా సోషల్ మిస్సు కు కూడా ఆయన గురించి తెలిదు అనుకుంటాను . ఆ రొజు న్యుస్ పేపర్ తీసికొని అక్కడ వ్రాసిన నాలుగు లైన్లు ని పట్టుకొని మీలానె బాగ పొడవైన స్పీచు ఇచ్చి మా దగ్గర పరువు నిలబెట్టుకొన్నారు :)

    ReplyDelete
    Replies
    1. మీరేమిటి? నేనేమిటి? ఈ ఊకదంపుడు అన్నది ఒక కళ! అది గంగా నదిలా ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది. (శంకరాభరణం శంకరశాస్త్రి వలె చదువుకొనవలెను)

      Delete
  13. I was writing all my social studies answers in my high school based on news paper knowledge. Every time my Social teacher will give avg marks and telling me that good revision of last quarter news.

    ReplyDelete
  14. నా డిగ్రీ రోజులు గుర్తుకు వచ్చాయి. నేను అంతే ఇంగ్లీష్,తెలుగు పరీక్షలకి ధైర్యంగా వెళ్ళి మీ పద్దతే అనుసరించే వాడిని.

    ReplyDelete
    Replies
    1. ఏ చదువు చరిత్ర చూసినా

      ఏమున్నది గర్వ కారణం?

      విద్యార్ధి చరిత్ర సమస్తం

      పరీక్షల పీడన పరయాయణత్వం!

      Delete
  15. రమణా,

    నీ పద్ధతిలోనే అద్భుతంగా వ్రాశావు. చాలా భేషుగ్గా ఉంది. "పంగులూరి సీతాయ్", నడింపల్లి, బాచాయ్, సత్తాయ్ అందర్నీ గుర్తు చేసి మనసుకి ఆహ్లాదం కలిగించావ్. ఇంతకీ ఆ శాస్త్రి కేరెక్టర్ ఎవరో గుర్తుకు రావట్లేదు. బహుశ మన మిత్రుల కోరిక ప్రకారం పేరు మార్చినట్టున్నావు. మనమందరం ఈ తరహాలో కహానీలు వ్రాసిన వాళ్ళమే! నేను సెకండియర్ బీ.ఎస్సీ లో ఇంగ్లీషు సెకండ్ పేపర్లో (యూనివర్సిటీ ఎక్సాంస్) ఈ విధంగానే రాసి మంచి మార్కులు సంపాయించాను. మాకు నాండిటైలు "గ్రేట్ సోల్" అని గాంధీ గారి మీద పుస్తకం ఉండేది. నేను ఆ పుస్తకం కొనలేదు చదవలేదు. కాకపోతే పరీక్ష పేపర్ సెట్ చేసిన వ్యక్తి మాలాంటి నిర్భాగ్యుల మీద దయ ఉంచి గ్రామరూ, "కుదించి వ్రాయటం" వంటి ప్రక్రియల కోసం ఇచ్చే "టెక్స్ట్" లొంచే మెయిన్ పేపర్లో ప్రశ్నలు ఇచ్చాడు. ముందు అది చూసి ఇదేదో వేళాకోళంగా ఉందనుకున్నాను. కానీ నాలాంటి శుంఠలకోసమే అలా ఇచ్చాడని అర్ధం అవ్వంగానే చక్కగా క్వస్చెన్ పేపర్లోంచే కాపీ కొట్టాను. మంచి మార్కులొచ్చినప్పుడు ఆహా! ఏమీ నా అద్రుష్టం అని ఆనంద పడ్డాను.

    దినకర్.

    ReplyDelete
  16. Kevvvvvvv idi nijamgaa raata raakshasatvame andee...
    super...

    ReplyDelete
    Replies
    1. బాబోయ్! బాగుంటే బాగుందని చెప్పాలి గానీ.. మరీ ఇంతగా కెవ్వుమనాలా! చెవులు 'గుయ్' మంటున్నయ్!

      థాంక్యూ రాజ్!

      Delete
  17. హైదరాబాద్‌లో జరిగే చప్పన్నారు పుస్తకావిష్కరణ సభలు గుర్తొచ్చాయి. అనేక వ్యాసాలు గుర్తొచ్చాయి. కొన్ని కథలు కూడా. మీ చిన్నపుడు నిజంగా జరిగిందో లేక సిస్టమ్‌ లోని మీడియోక్రసీ గురించి, ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌లోని మీడియోక్రసీ గురించి పరోక్షంగా రాసారో తెలీదు కానీ ఇట్స్‌ ట్రూ. విశేషణాలు ఎక్కువ, విషయం తక్కువ. గురజాడ ఏం ఖర్మ, గాంధీ గారి గురించి ఎవర్నైనా పెద్దవాళ్లనే అడిగి చూడండి. జాతి పిత, మహాత్ముడు వంటి బోలు పదాలు తప్పితే నిజంగా ఆయన ఏంటి అని చెప్పగలరేమో..వి ఆర్‌ లివింగ్‌ ఇన్‌ ఏ మీడియోక్రటిక్‌ స్టేట్‌. మీ పీస్‌ చదువుతుంటే ఎందుకో పతంజలి గారు గుర్తుకొచ్చారు. గుడ్‌ వర్క్‌.

    ReplyDelete
    Replies
    1. కొంత చిన్నతనం.. కొంత వర్తమానం.. కలిపి వండాన్లేండి!

      ఇప్పుడు టీవీల్లో కూడా అంతా ఈ వాగాడంబరమేగా! చెదలకైనా మందుంది గానీ.. ఈ తెగులు భాషకి మందు లేదేమో! గొల్లపూడి చేస్తున్న కథల టీవీ ప్రోగ్రాం ఈ తరహా 'అతి' కి పరాకాష్ట.

      మీకు నా పోస్ట్ చదువుతుంటే పతంజలి గుర్తు రావడం గొప్ప కాంప్లిమెంటుగా ఫీలవుతున్నాను. థాంక్యూ!

      Delete
  18. హ...హ..భలే ఉంది.మీ దయ వాళ్ళ ఈ రోజు నవ్వటం మొదలు పెట్టాను

    ReplyDelete
    Replies
    1. ఏదో అప్పుడప్పుడప్పుడు నవ్వొచ్చేలా రాస్తుంటాను. కానీ.. నేను లోపల భలే సీరియస్ థింకర్ని సుమండి!

      Delete
  19. "అమృతమూర్తులైన గురజాడ అప్పారావు గారు కారణజన్ముడు"
    ఈ వాక్యం నుండి I couldn't control myself.

    ReplyDelete
  20. మీరు వ్రాసింది నిజమే అయినా, గురజాడ లాంటి మహాకవికి బదులు ఏ రాజకీయనాయకుడి పేరో వాడుకుంటే బాగుండేదేమో?

    ReplyDelete
    Replies
    1. మీ భావం నాకర్ధమైంది.

      ఒక చిన్న సమాచారం. నేను నిజంగానే గురజాడ గూర్చి వ్యాసం రాశాను. ఈ వాస్తవాన్ని మార్చటానికి నాకు తగు కారణం తోచలేదు.

      గురజాడ వారి ప్రతిభని గౌరవిస్తూనే.. యాంత్రికమైన పొగడ్త భాషని ఏవగించుకుంటూ.. ఈ పోస్ట్ రాశాను. ఆ రోజు గురజాడ కాకుండా జవహర్లాల్ నెహ్రూ అయినా నా వ్యాసం అదే భాషలో, అదే పరిమాణంలో ఉండేది. పేర్లు మారేవి. అంతే!

      ఇవ్వాళ సుబ్బిరామిరెడ్డిని కూడా ఇలాగే పొగుతున్నారు కదా!

      Delete
  21. మీ టపా చదివి నవ్వాపుకో లేక పోయాను. ఇలాగే పెద్ద పులి గురించి వ్యాసం రాయమంటే మా ఊర్లో ఒకబ్బాయి పులి, పులి, పులి, పులి అంటూ పేజీలు నింని, చివర్లో పెద్ద అక్షరాల్తో పేద్ధ పులి అని రాసి ముగించాడుట.ఈ ముచ్చట మా చిన్నప్పుడు చెప్పుకునే వారు.
    ఈ విఫాద వినోదంలో గురజాడ ఎవరో తెలియని తరం గురించి చక్కటి సెటైరు కూడా ఉంది. అందుకు మీకు నా అభినందనలు.

    ReplyDelete
  22. హాస్యం బాగుంది. అద్సరే గాని, గురజాడ గురించి పెద్దయ్యాక ఏమైనా తెలుసుకునే వుంటారు, అది నాలుగు ముక్కలు రాయండి, ఆయన పేరుని వాడుకున్న దానికి పరిహారంగా... :)

    ReplyDelete
    Replies
    1. అయ్యో! గురజాడ గూర్చి ఏమైనా తెలుసుకోవడం ఏంటండి! ఆయన సాహిత్యం చాలా చదువు(తెలుసు)కున్నాను. తెలుగు సాహిత్యంలో ఆయనంటే ఏంటో కూడా అర్ధమైంది. కన్యాశుల్కం గూర్చి సరదాగా ఓ నాలుగు ముక్కలు రాసే ఉద్దేశ్యం అయితే ఉంది. చూద్దాం.

      Delete
  23. హహహ టపా చాలా బాగుందండీ బాగారాశారు... మరీ గురజాడగారి గురించి కాదుకానీ అడవిబాపిరాజు అన్నాయన గోనగన్నారెడ్డి అన్న పుస్తకంరాశారా లేక గోనగన్నారెడ్డి అన్నాయన అడివిబాపిరాజు అన్నపుస్తకం రాశారా అన్నవిషయం ఇంజనీరింగ్ అయిన చాలారోజులువరకూ నాకు కన్ఫూజనే.

    మాకు ఇంజనీరింగ్ లో మెటీరియల్ సైన్స్ అనే ఒక పరమ డ్రై సబ్జెక్ట్ ఒకటి ఉండేది దానికివచ్చే ప్రొఫెసర్ కూడా సన్ననిగొంతుతో జోలపాడుతున్నట్లుగా పాఠంచెప్పేవారు, మార్కులుకూడా జానాబెత్తెలతో కొలిసి వేసేవారని మాకు గాట్టినమ్మకం. ఆపేపర్ నేను ఇలాగే నింపేవాడ్ని పేజీకి పదిలైన్లుమించకుండా అడిషనల్స్ మీద అడిషనల్స్ తీస్కుని రాసేవాడ్ని, అవన్నీ గుర్తొచ్చాయ్ మీ టపాతో.

    ReplyDelete
    Replies
    1. ఈ పోస్ట్ రాసేప్పుడు నా అజ్ఞానాన్ని బయట పెట్టుకోవడం అవసరమా? అన్న సందేహంతో రాశాను. కామెంట్లు చూసి ఆనందిస్తున్నా!

      'నాలాగా ఎందరో!'

      Delete
    2. అవును చదవకుండా చాంతాడంత వ్రాసేవారినందరిని బోలెడన్ని తిట్టుకొన్న మేము, మీ నడింపల్లి జాబితా లో వచ్చేస్తాం :)

      Delete
    3. నేను కూడా అదే జాబితా లోకే వస్తాను. నాకసలు పేపర్ లు నింపడమే చేత కాకపోయేది.. :(

      Delete
  24. రమణ గారు ఈ టపా సూపర్. నేను కూడా నా b .tech ఈ చిన్న లాజిక్ తెలియక ఫస్ట్ 2 years లో సెమెస్టర్ కీ ఒక సబ్జెక్టు పోగొట్టుకునే వాడిని. నా స్నేహితుడు ఒకడు ఈ విషయమ లో ఒక దారి చూపించాడు, అదే నేను పరీక్షా ఫెయిల్ అవ్వడం లాస్ట్ టైం..ఇంకా వెనుక్కి తిరిగి చూడలేదు..నాకు తెలిసింది ఒక పేజి మాటర్ అయితే నేను దాని నాలుగు pages లూ రాసేవాడిని...బాగా వర్క్ అవుట్ అయింది ఆ లాజిక్. ఇంకా మీ ఫ్రెండ్స్ లో భాస్కరాయ్ సత్తాయ్ పేరులు చాల fun గ ఉన్నాయి.

    ReplyDelete
    Replies
    1. బెత్తెడు సబ్జక్టుకి మూరెడు మార్కులు సంపాదించడం ఒక కళ! దీని గూర్చి ఒక పోస్ట్ రాస్తాను.

      >>ఇంకా మీ ఫ్రెండ్స్ లో భాస్కరాయ్ సత్తాయ్ పేరులు చాల fun గ ఉన్నాయి.<<

      వీళ్ళల్లో ఒకడు అమెరికాలోనూ, మరొకడు ఇండియాలోనూ చాలా గౌరవనీయులు.

      ఆ రోజుల్లో పేరు చివర్లో 'య్' తగిలించి ప్రేమగా పిలిచేవాళ్ళు. అందుకే స్కూల్లో నా పేరు 'రవణాయ్!' ఇంకా ప్రేమ ఎక్కువైతే 'య్' కి 'గా' కూడా తగిలిస్తారు. అందుకే ఇంకొందరికి నేను 'రవణాయ్ గా!'

      Delete
  25. తెలియని యంశము నైనను
    అలుపెరుగక జెప్పు నట్టి అద్భుత కళ - కే
    వల రాజకీయ రంగము
    నలరించుట జూడనైతి మయ్యా ! రమణా !
    ----- సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. ఈ అద్భుత కళ క్రమేణా అన్ని రంగాల్లోకి పాకుతుందండి. 'పెరుగుట విరుగుట కొరకే!' అనుకోవడం మించి చేసేదేం లేదు!

      Delete
  26. డాక్టర్ యరమన గారు కారణజన్ములు. భరతమాత ముద్దు బిడ్డ. అసమాన ప్రజ్ఞా సంపన్నులు. ఒక మహోన్నత వ్యక్తి. వీరి ప్రతిభ అపూర్వం. పట్టుదల అనితర సాధ్యం! ఈ పేరు వినంగాన్లే తెలుగు బ్లాగర్ల హృదయం ఆనందంతో పులకిస్తుంది. గర్వంతో గుండెలు ఉప్పొంగుతాయి. ఇంతటి మహానుభావులు మన తెలుగువాడు కావడం మన అదృష్టం. ఆయన రచనలు ప్రచురించే బ్లాగ్‌స్పాట్‌కి శతకోటి వందనాలు. మన తెలుగువారి ఉన్నతి డాట్రారి త్యాగఫలం! గూగుల్ ఉన్నంతకాలం డాట్రారి కీర్తి ధగధగలాడుతూనే ఉంటుంది. యరమన వంటి మహానుభావుని గూర్చి కామెంటడం నా పూర్వజన్మ సుకృతం. నా జీవితం ధన్యం. :-)

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాసం బాగుంది. యరమన వృత్తేమిటో కూడా ఒక పాయింట్ రాశారు. కాబట్టి మీకు మొదటి బహుమతి ప్రకటించడమైనది!

      Delete
  27. అద్భుతంగా రాశావు బాబు. కానీ గురజాడ ఎవరో రాయడం మర్చిపొయ్యావు. కనీసం గురజాడ 'రచయిత' అన్న ఒక్క పదం రాసినా నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. అందుకే ఇంత బాగా రాసినా ఆ ఒక్క కారణంగా నీకు సెకండ్ ప్రైజ్ ఇవ్వాల్సొచ్చింది---
    -- i have laughed heartfully at this. thanks for making me laugh happily for a while

    ReplyDelete
  28. గురజాడ, ఆయనే నండి..మేమిద్ద్రం కలిసి చదువుక్కున్నాం లెండి! వాళ్ళూరులోనే.
    రమణ గారు ఎలాగున్నారు?

    ReplyDelete
    Replies
    1. అవునవును! మీ క్లాస్మేట్ తో 'కన్యాశుల్కం' రాయించింది కూడా మీరేనటగా!

      అనిల్ గారు,

      నేబానే ఉన్నా. ఒక టపా, ఇద్దరు పేషంట్లు, నాలుగు కామెంట్లుగా బ్రతుకు బండిని లాగిస్తున్నా! పలకరింపుకి ధన్యవాదాలు.

      Delete
  29. బావుంది. ఇక్కడ ఇంకెవరో కూడా వ్రాసినట్లు నాకు గాంధీ గారి గురించి పిల్లలకి చెప్దామంటే అన్నీ సార్వజనీనమైన విశేషణాలే తప్ప ఉపయోగకరమైన సమాచారం కనిపించలేదు నేను వెతికినంత మటుకు తెలుగులో. ఇక్కడ పిల్లల కోసం వ్రాసిన జీవిత చరిత్ర పుస్తకాలలో ఆయన జీవిత చరిత్ర పుస్తకాలు తెచ్చుకుని చదివి, ఆయన జీవితం, ఆశయాలనుంచి స్ఫూర్తి పొందిన వారి మాటలు వినడం ద్వారా నేను ఇప్పుడిప్పుడు ఆయననీ, ఆయన ఆశయాలనీ, ఆయన ఎంచుకున్న మార్గాలనీ అతి కొద్దిగానైనా అర్థం చేసుకోగలుగుతున్నాను. అలాగే తెలుసుకోవలసిన మహానుభావులెందరి గురించో తెలుసుకుందామంటే ఎక్కడ మొదలు పెట్టాలో తెలియడం కష్టంగా ఉంది. ముఖ్యంగా తెలుగు వారి గురించి ఐతే ఇంకానూ.

    ReplyDelete
    Replies
    1. మీరు తెలుగు రచనల్లో చరిత్ర సమాచారం కోసం వెదకడం బియ్యంలో రాళ్ళేరడమంత కష్టం! మన తెలుగువారికి చరిత్రలో మనుషులు ఉండరు. కేవలం దైవాంశ సంభూతులు మాత్రమే ఉందురు!

      Delete
  30. గురజాడ వారి గురించి కొంత తెలుసు అనుకున్నాను. కానీ పూర్తిగా తెలియచేసి నా కళ్ళు తెరిపించారు.

    >>> "అమృతమూర్తులైన గురజాడ అప్పారావు గారు కారణజన్ముడు"

    ఇంకా నవ్వుతూనే ఉన్నాను.

    ReplyDelete
  31. Brahmanandam Gorti5 July 2012 at 07:55

    బాగా రాసారు. మనకి పడికట్టు పదాలమీద వున్నా ఆపేక్ష అంతా ఇంతా కాదు. ఆ మధ్య శివసాగర్ పోయినప్పుడు ఇలాంటిదే ఒకరి వ్యాసం చదివాను. నిద్రించని సూర్యుడు, ఎర్ర ఆశాకిరణం, నిలువెత్తు నిజాయితీ వంటి వాటితో తెగ రాసారు. ఇంకా రాస్తూనే ఉన్నారు. ఆయన అవసాన దశలో ఉన్నప్పుడు ఎంతమంది పరామర్శించుంటారు?

    మేం కాలిఫోర్నియా సాహితీ సదస్సని ఏటా అమెరికాలో ఓ సాహితీ సదస్సు పెడుతూ ఉంటాం. ఓ సారి ఓ పెద్దాయన అల్లసాని పెద్దన గురించి మాట్లాడతానని తనకి అరగంట కావాలని అడిగాడు. నేను సమయం దగ్గర పరమపీనాసాణ్ణి. ఏడు నిమిషాలు మించి ఇవ్వనన్నాను. గట్టిగా ఏడ్చి పది నిమిషాలు కావాలని అంటే బాధ పడలేక సరేనన్నాను. "అల్లసాని అల్లిక" అని టాపిక్ టైటిల్ కూడా ఇచ్చాడు. అసలు ప్రసంగం వచ్చాక అల్లసాని వారి పద్యమొకటి రాగ యుక్తంగా చదివాడు. అదయ్యాక పద్యం వివరణకోసం అందరూ ఎదురు చూసారు. "అల్లసాని పద్యం అద్భుతం. అక్షరాలు కావవి; శిలాక్షరాలు. అల్లాసాని అక్షరం తెలుగు దొరసాని..." ఇలా అన్నీ విశేషణాలతో మూడు నిమిషాలు తినేసి మరలా ఇంకో పద్యం అందుకున్నాడు. మొత్త పదినిమిషాలు ఇదే వరస. చివరకి వినేవాళ్ళే దిగిపొమ్మని చెబితే కానీ దిగలేదు.

    చివరగా - "మీ వ్యాసం అద్భుతం. అమోఘం. హాస్యామృతం. ఇంత గొప్ప రచన చదవడం ఇదే మొదటిసారి. గురజాడవారి హాస్యాన్ని తలదన్నేలా రాసారు..." అని రాస్తే తిట్టుకోకండి. నవ్వుకోండి అంతే!

    On a serious note - I really liked this

    -బ్రహ్మానందం గొర్తి

    ReplyDelete
    Replies
    1. thank you!

      వాచాలత్వం గూర్చి ఈ టపాలో కూడా రాశాను.

      http://yaramana.blogspot.in/2011/09/blog-post.html

      Delete
  32. సూపర్ గా రాసారు. నేనిదే మొదలు మీ బ్లాగ్ ని చదవడం. నిజమే అండి. కోపం మనలోని భాషా ప్రావిణ్యాన్ని బయటకి తెస్తుంది. :) i have experience..

    ReplyDelete
  33. అద్భుతంగా వుంది.
    'తెలుసుకుని రాస్తే గొప్పేముంది? తెలీకుండా రాయడమే గొప్ప' -పతంజలి గారిని, 'మనసులోనే వికటాట్టహాసం చేసుకున్నాను'-రాంబాబు (నండూరి పార్థసారథినీ గుర్తు తెచ్చాయి . మొత్తానికి 'సాహిత్య హింసావలోకనం'లో హనుమంతరావు సంపాదకీయ రచనలాగే మీరూ అదరగొట్టారు.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.