Wednesday 25 April 2012

చిత్తూరు నాగయ్య.. ద సైకోథెరపిస్ట్

"ఒకే విషయం ఎన్నిసార్లని చెప్పాలి? చెప్పేప్పుడు బుద్ధిగా తలూపుతారు, పని మాత్రం చెయ్యరు. అసలు మీ సమస్యేమిటి? వినపడదా? అర్ధం కాదా?" విసుగ్గా అన్నాను.

నా హాస్పిటల్లో స్టాఫ్ అవడానికి సీనియర్లే. కానీ వాళ్లకి ప్రతిరోజూ, ప్రతివిషయం కొత్తే! మా సుబ్బు సరదాగా అంటుంటాడు - 'యధా వైద్యుడు, తధా స్టాఫ్.' 

కానీ ఇవ్వాళ మరీ చిరాగ్గా ఉంది - 'వెరీ ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్!' అని పదోసారి అనుకున్నాను.

ఇంతలో - గదిలో ఏదో అలికిడి. విసుగ్గా తలెత్తి చూశాను. ఎదురుగా ఒక ఆజాను బాహుడు, ధవళ వస్త్రాల్లో ధగధగ మెరిసిపోతున్నాడు. ఈయన్ని ఎక్కడో చూసినట్లుందే? ఎవరబ్బా! ఈయన.. ఈయన.. చిత్తూరు నాగయ్య! ఆయన ప్రశాంత వదనంతో, దరహాసంతో నన్నే చూస్తున్నాడు.

అంతే కాదు - 'నువ్విక మారవా?' అని నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నిస్తున్నట్లుగా కూడా అనిపించింది.

'అబ్బా! ఈయన్తో చచ్చేచావుగా ఉంది, ప్రశాంతంగా కోపాన్ని కూడా తెచ్చుకోనివ్వడు గదా! వేలకి వేలు జీతాలిస్తున్నాను. ఏం? నా స్టాఫ్ ని ఆమాత్రం మందలించేంత హక్కు నాకుండదా? సినిమా చూస్తున్నప్పుడు లక్షాతొంభై అనుకుంటాం. అంతమాత్రానికే ఈయన అప్పులాళ్ళా వచ్చెయ్యడమేనా?'

అంతలోనే నా చికాకు, కోపం, అసహనం అన్నీ ఒక్కసారిగా ఆవిరైపొయ్యాయి. సిగ్గుతో తల దించుకున్నాను.

నేనెందుకు ఇంత చెత్తగా ఆలోచిస్తున్నాను! దిసీజ్ నాట్ కరెక్ట్. చిత్తూరు నాగయ్యని నా థెరపిస్ట్‌గా ఎప్పాయింట్ చేసుకున్నది నేనే. ఈ థెరప్యూటిక్ ఎలయెన్స్‌తో నాగయ్యకి ప్రమేయం లేదు. నాకూ, చిత్తూరు నాగయ్యకి పేషంట్ డాక్టర్ రిలేషన్‌షిప్ కొన్నాళ్ళుగా నడుస్తుంది. ఒక విషయం చెప్పేప్పుడు ఎత్తుగడగా ముందు కొంత సంభాషణతో మొదలెట్టి, అటుతరవాత అసలు కథలోకి వచ్చే నా ఓ.హెన్రీ అనుకరణ మార్చుకోలేకున్నాను. ఇవ్వాళ కూడా నా అరిగిపోయిన స్టైల్లోనే రాస్తున్నాను, మీరు నన్ను మన్నించాలి.

చిత్తూరు నాగయ్య గొప్ప నటుడు, గొప్ప గాయకుడు అని నా నమ్మకం. అయన మరీ అంత గొప్పేం కాదు అని ఎవరైనా అంటే నాకస్సలు అభ్యంతరం లేదు. నా అభిప్రాయాలేవో నాకున్నాయి, అవి ఇతరుల్తో సరిపోలాలని నేనెప్పుడూ అనుకోను. అయితే నాగయ్య పట్ల నా అభిమానం స్వార్ధపూరితమైనది. వాడ్డూయూ మీన్ బై - 'స్వార్ధాభిమానం'!? 

వృత్తిరీత్యా నేను సైకియాట్రిస్టుని, ఫీజుచ్చుకుని కోపాన్ని పోగొట్టడానికి కౌన్సెలింగ్ చేస్తాను. కానీ నాకు కోపం ఎక్కువ! ఎదుటివారి కోపం ఎలా తగ్గించాలో తెలిసిన నాకు, నా కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలీదు. ఈ కన్ఫెషన్‌ని  నా మోడెస్టీగా భావించనక్కర్లేదు, శిక్ష పడదంటే హంతకుడు కూడా నేరాన్ని ఒప్పుకుంటాడు!

అది అర్ధరాత్రి, ఇంట్లోవాళ్ళు హాయిగా నిద్ర పోతున్నారు. నాకు మొదట్నుండీ సరీగ్గా నిద్ర పట్టదు. దూరదర్శన్‌లో నాగయ్య నటించిన 'యోగి వేమన' వేస్తున్నారు. సుఖమయ నిద్ర కోసం ఈ పురాతన సినిమాకి మించిన మంచి సాధనమేముంది అని ఆ సినిమా చూడ్డం మొదలెట్టాను. క్రమేపి సినిమాలో లీనమైపోయ్యాను.

వేమారెడ్డికి అన్నకూతురంటే ఎంతో ప్రేమ. ఆ పాప జబ్బుచేసి చనిపోతుంది. నిర్వేదనగా స్మశానంలో తిరుగుతున్నాడు. ఒక మనిషి పుర్రెని చేతిలోకి తీసుకుని 'ఇదేనా, ఇంతేనా' అంటూ పాడుతున్నాడు. వెచ్చగా బుగ్గల మీద యేదో స్పర్శ! అవి నా కన్నీళ్ళూ! అర్ధరాత్రి కాబట్టి నా కన్నీళ్ళని ఎవరూ గమనించే ప్రమాదం లేదు కాబట్టి నేనా కన్నీళ్ళని ఆపుకోవటానికి ప్రయత్నించలేదు. నా ప్రమేయం లేకుండానే కళ్ళల్లోంచి కన్నీళ్ళు ధారగా కారిపోతున్నయ్! ఈ అనుభూతి నాకు కొత్త, నాలో ఇన్ని కన్నీళ్ళున్నాయా! సినిమా చివరిదాకా గుడ్లప్పగించి అలా చూస్తూ కూర్చుండిపొయ్యాను. 

ఆశ్చర్యం! ఆ మరుసటి రోజు నాకు కోపం రావాల్సిన సందర్భంలో కూడా పెద్దగా కోపం రాలేదు. ఆ తరవాత నాగయ్య నటించిన సినిమాల్ని వరసగా చూశాను. నా కోపం క్రమేపి ఇంకాఇంకా తగ్గసాగింది. నాగయ్యది ప్రశాంత వదనం. మృదువుగా, మార్ధవంగా నటిస్తాడు. నాగయ్యని నిశితంగా గమనిస్తాను, పాటల్ని ఏకాగ్రతతో వింటాను. అప్పుడే నాకు కోపం వచ్చినప్పుడు నాగయ్యని గుర్తు చేసుకోవడం ఈజీగా ఉంటుంది.

ప్రతిరోజూ పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది, ఉదయాన్నే నడక కూడా మంచిది. నాగయ్య చిత్రాలు చూస్తూ ఉండటం కూడా ఇదే  కోవలోకి వస్తాయని నమ్ముతున్నాను. ఫైటింగ్ సినిమాలు చూసేవాడిలో నేరప్రవృత్తి ఉంటుందట. సెక్స్ సినిమాల ప్రేమికుడికి లోకమంతా బూతుమయంగా ఉంటుందట. అలాగే - నాగయ్య సినిమాలు చూసినవాడు ప్రశాంత చిత్తంతో సాత్వికుడుగా మారిపోతాడు.

'పాండురంగ మహత్యం'లో నాగయ్య ఎన్టీఆర్‌కి తండ్రి, భోగలాలసుడైన కొడుకు వృద్ధులైన తలిదండ్రులపై దొంగతనం మోపి అర్ధరాత్రివేళ ఇంట్లోంచి వెళ్ళ గొడతాడు. అప్పుడు నాగయ్యని చూస్తే నాకు దుఃఖం ఆగలేదు. కొడుకు పట్ల ప్రేమ, అవమాన భారం, నిర్వేదం, నిర్లిప్తత.. ఇన్నిభావాల్ని అలవోకగా ప్రదర్శిస్తాడు.

ఈ పాత్రని పృధ్వీరాజ్ కపూర్ వంటి నటుడు ఇంకా బాగా నటించవచ్చునేమో కానీ, నాగయ్యంత కన్విన్సింగ్‌గా వుండదు. ఎందుకు? నాగయ్యది నిజజీవితంలో కూడా పుండరీకుని తండ్రివంటి మనస్తత్వం, అందుకని! మానవ జీవితంలో అత్యంత విలువైనది డబ్బు. ఎవరెన్ని కబుర్లు చెప్పినా డబ్బు విలువని గుర్తించకుండా జీవించగలగడం ఎంతో కష్టం. ఇది అతికొద్దిమందికి మాత్రమే సాధ్యమైంది. అర్ధరాత్రి ఇంటిని కొడుక్కి తృణప్రాయంగా వదిలేసి అడవి బాట పట్టిన పాండురంగని తండ్రి లాగే, నాగయ్య కూడా సిరిసంపదల్ని వదిలేశాడు.

కోపానికి నాగయ్య సినిమాలు యాంటిడోట్‌గా పనిచేస్తాయి, అందుకే నా కోపాన్ని జయించటానికి తెలివిగా నాగయ్యని వాడుకుంటున్నాను. సైకోథెరపీ ప్రిన్సిపుల్స్ ప్రకారం నాగయ్య నా థెరపిస్ట్. సైకియాట్రిస్టులకి సొమ్ము తగలేసే కన్నా ఇది సుఖమైన మార్గం అని నా అభిప్రాయం!

75 comments:

  1. భలే బాగా చెప్పారు డాక్టర్ గారు.

    నాగయ్య గారి గురించి చాలా మంచి మంచి విషయాలు అందించారు .

    ReplyDelete
  2. well said. Refer your patients also to Nagayya. :)

    ReplyDelete
  3. బాగా చెప్పారండి..!
    అయితే, చిన్న ప్రమాదం ఉంది. నాగయ్యగారి "యోగి వేమన" సినిమా చూసి, ముమ్మిడివరం (కోనసీమ)లో ఓ చిన్న పిల్లాడు వైరాగ్యం తెచ్చుకున్నాడు. అతనే "బాలయోగి" పేరిట తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఇది మా గోదావరివైపు ఉన్న టాక్.. మీకలా వైరాగ్యం వచ్చేస్తే పేషంట్లు ఏమైపోతారు..?
    (ఆ బాలయోగి అంటే, కోనసీమ ప్రజలకి విపరీతమైన గురి. ఆయన పేరే దివంగత లోకసభ స్పీకరు జి.ఎం.సి బాలయోగి కి పెట్టుకున్నారన్నమాట ఈయన తల్లిదండ్రులు.)

    ReplyDelete
  4. "కాబట్టి నేను నాగయ్య అభిమానిని కానే కానని విన్నవించుకుంటున్నాను. నాకు నాగయ్య వ్యక్తిగత జీవితం తెలీదు. తెలుసుకోవలసిన అవసరమూ లేదు."

    మీరు వెతుకుతున్న పదం నేను అందిస్తా. మీరు నాగయ్యకి అభిమాని కాదు. ఆయనకు మీరు ఆపాదించిన పర్సనాలిటీకి ఏకలవ్య శిష్యులు.

    ఏకలవ్యుడికి గురువు నిజస్వరూపం అవసరం లేదు. ఆ "గురువు"లో తాను ఊహించుకున్న మంచి గుణాలను చూసుకొని దాన్ని "నేర్చుకునే" ప్రయత్నం చేస్తాడు.

    ఈ విషయాన్ని మీ "పిచ్చి శాస్త్రం"లో ఏమంటారు చెప్మా? Father figure? role model? alter ego?

    ReplyDelete
  5. బాగుందండి. నేను మసాలా కూరలు,బజ్జీలు వగైరా తినను. అయినా ఈ మధ్య విపరీతంగా కోపం వచ్చి చస్తుంది. మీలాంటి డాక్టర్ ని కన్సుల్ట్ చేద్దామనుకున్నాను. అవసరం లేదని మీ ఈ పోస్ట్ చెప్పాక .. ఎందుకండి వెళ్ళడం. ? నాగయ్య గారి చిత్తరువు సంపాదించి.. హలో పెట్టేస్తాను. పనిలో పనిగా ..మీ హాస్పిటల్ ముందు..ఓ..షాప్ తెరచి నాగయ్య గారి చిత్ర పటాలు పెట్టి కోపానికి పరిష్కారమైన మందు అని ప్రచారం చేయించే విధానం గురించి ఆలోచిస్తున్నాను.:))))) ధన్యవాదములు డాక్టర్ గారు.

    ReplyDelete
  6. డాట్రు గారు: మీరేదో కామెడీకి రాసినా, ఈ విషయం లో నిజ్జం లేకపోలేదు :)

    ఆయన పోతన సినిమాలో చాల సీన్లు మాంచి soothing effect ఇస్తాయి :)
    http://www.youtube.com/watch?v=uYxv3e9bICw

    'ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై' అనే పద్యం వింటే చాలు.... బాగా agitate అయిన mind కూడా ప్రాశాంతమైపోతుంది :)

    ReplyDelete
  7. మీ టపాలు, వ్యాఖ్యలు చదవడం మొదలు పెట్టాకా చాలా కోపం తగ్గిపోయింది, మీ టపాలు నాకు నచ్చాయి అంతే :)
    సుబ్బు చెప్పిన మొదటి మాట మాత్రం సూపరు...

    ReplyDelete
  8. ఇంత బాగా టపాలు రాయడం వెనుకనున్న Trade Secret ఇదా!!! దొరికిపోయారుగా...

    మీ స్టాఫ్ బాగుపడాలంటే ప్రిస్క్రిప్షన్‌. వారికి బ్లాగింగ్ గురించి లేని పోనివి నూరి పోసి, ఆశలు రేకెత్తించి, అమెరికాను పొగుడుతూ, సమాజంలో పురుషాధిక్యత అవసరాన్ని నొక్కి వక్కాణిస్తూ టపాలు రాయమనండి. చాలు.

    ReplyDelete
  9. "మీలాంటి డాక్టర్ ని కన్సుల్ట్ చేద్దామనుకున్నాను. అవసరం లేదని మీ ఈ పోస్ట్ చెప్పాక .. ఎందుకండి వెళ్ళడం"

    ఇదేనండి వ్యాపారం పోగొట్టుకోవడం అంటే. కాలక్షేపానికి రాసే బ్లాగు మీ కొంప ముంచేటత్తుంది :)

    ReplyDelete
  10. శ్రీరామ్ గారు,

    ధన్యవాదాలు.

    kastephale గారు,

    నా పేషంట్లని నాగయ్యకి రిఫర్ చేస్తే మరి నేనేం చెయ్యాలి?!

    వామనగీత గారు,

    ముమ్మిడివరం బాలయోగి కథ నేనూ విన్నాను. నేనయితే 'కథ' గానే భావిస్తున్నాను. నాకు ఆ బాలయోగి పరిస్థితే వస్తే మావాళ్ళు శుబ్బరంగా నాకన్నా మంచి డాక్టర్ని చూసుకుంటారు. (డాక్టర్ల సంపాదన కోసం పేషంట్లు ఉంటారు గానీ.. పేషంట్ల రోగం కోసం డాక్టర్లు ఉండరు.)

    ReplyDelete
  11. చాలా బాగా రాసారండీ. ఒక చిన్న సంఘటన చెబుతాను. ఇది ఢెబ్భైలలో జరిగిన సంఘటన మా అన్నయ్య (కజిన్) తన చిన్నప్పుడు అంటే తనకి ఒక 13 యేళ్ళు ఉంటాయి...అప్పుడు వీధిలో హిప్నాటిజం షో జరుగుతోంది. హిప్నాటిజంలో భాగం గా చిన్నపిల్లలెవరినైనా స్టేజి మీదకి రమ్మన్నారట. తను వెళ్ళాక హిప్నాటిజం చేసి నెత్తి మీద ఏదో రింగు పెట్టి టీ కాచి, ఇంకా ఏవేవో చేసి చివరికి ప్రశ్నలు అడగడం మొదలెట్టారంట. నీ ఫేవరెట్ హీరో ఎవరు ఎంటీయారా, ఏయెన్నారా? అని అడిగితే "చీ వాళ్ళెవ్వరూ కాదు. నాగయ్య గారు" అని చెప్పాడట. ఆ సుషుప్తావస్థ లో కూడా నాగయ్య గారు అని చెప్పేసరికి, అందునా అంత చిన్న కురాడు, అందరూ ఆశ్చర్యపోయారట. మా ఇంట్ళో చెప్పగా ఈ కథ విన్నాను. నేనప్పటికి పుట్టలేదులెండి :) అంతటి వీరాభిమానులున్నారు మా ఇంట్లో:)

    ఈ మధ్యనే వేమన సినిమా నేను మళ్ళీ చూసాను. చాలా బాగా నటించారు. పాటలు అద్భుతం. అందాలు చిందేటి నా జ్యోతి, వదలజాలర..రెండూ రెండే. త్యాగయ్య సినిమాకూడా చాలా బాగుంటుంది మీరు చూసారా? కానీ నాకెందుకో పోతన మాత్రం నాగయ్యగారికంటే గుమ్మడి బాగా చేసాడనిపిస్తుంది. నాగయ్య గారి సినిమాల్లో అస్సలు చూడలేని సినిమా భక్త రామదాసు. నావల్ల కాలేదు. మీరూ చూడకండి :) లవకుశలో కూడా వాల్మీకి అంటే నాగయ్యగారే అన్నట్టు ఉంటారు.

    మరపురాని మనిషి సినిమా చూసారా మీరు? వాణిశ్రీ తండ్రిగా చేస్తారు. కూతురి అమాయకత్వం, మంచితనం తెలిసీ, ఆమె అవమానాలు పడుతుంటే ఏమీ చెయ్యలేక నిస్సహాయుడై, కూతురిని తిట్టలేక నానా అవస్థలు పడుతుంటారు. ఆ పాత్ర నాగయ్యగారు తప్ప ఇంకెవ్వరూ చెయ్యలేరనిపిస్తుంది.

    ReplyDelete
  12. Jai Gottimukkala గారు,

    మీ ప్రశ్నలకి clinical psychologist మంచి సమాధానం చెప్పగలడు. ఫ్రాయిడ్ భాషలో 'identification' అని కూడా అనొచ్చేమో.

    ఏకలవ్యుడుది successful imitation. నాది కాదు.

    >>'ఇదేనండి వ్యాపారం పోగొట్టుకోవడం అంటే. కాలక్షేపానికి రాసే బ్లాగు మీ కొంప ముంచేటత్తుంది'<<

    అంతేనంటారా! ఇదేదో సీరియస్ గా యోచించవలసినదే!

    ReplyDelete
  13. వనజవనమాలి గారు,

    కోపాన్ని జయించడానికి మనమేమన్నా ఋషులమా?ప్రయత్నిద్దాం.

    అయినా మీరేమిటి టూ మచ్ గా నాగయ్య ఫొటోతోనే కోపాన్ని జయించేద్దామని ప్లాన్లు వేస్తున్నారు! ఇక్కడ నేను చాలా కాలంగా ఆయన పాటలు వింటూ తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తుంటే! (అదేదో సినిమాలో థర్టీ యియర్స్ ఇండస్ట్రీ లాగా!)

    ReplyDelete
  14. @WitReal,

    >>మీరేదో కామెడీకి రాసినా, ఈ విషయం లో నిజ్జం లేకపోలేదు.<<

    అయ్యో! నేను కామెడీగా రాయలేదండి. సీరియస్ గానే రాశాను.

    కాకపోతే.. చాలామందిలా నాగయ్యని పొగడ్తలతో ముంచెయ్యకుండా నా స్టైల్లో రాశాను. అంతే!

    ReplyDelete
  15. శేఖర్ (sekhar) గారు,

    thank you!

    ReplyDelete
  16. Mauli గారు,

    >>మీ టపాలు, వ్యాఖ్యలు చదవడం మొదలు పెట్టాకా చాలా కోపం తగ్గిపోయింది.<<

    చదివిన మీకు కోపం తగ్గిపోయింది. సంతోషం.

    మరి.. రాసిన నాకు ఎప్పుడు తగ్గి చస్తుంది?!

    ReplyDelete
  17. @తెలుగు భావాలు,

    >>మీ స్టాఫ్ బాగుపడాలంటే ప్రిస్క్రిప్షన్‌. వారికి బ్లాగింగ్ గురించి లేని పోనివి నూరి పోసి, ఆశలు రేకెత్తించి, అమెరికాను పొగుడుతూ, సమాజంలో పురుషాధిక్యత అవసరాన్ని నొక్కి వక్కాణిస్తూ టపాలు రాయమనండి. చాలు.<<

    డాక్టర్ సాబ్! మీ ప్రిస్క్రిప్షన్‌ మీ మందుల చీటీలాగే అర్ధం కావట్లేదు సార్!

    ReplyDelete
  18. అబ్బే ఏమీ లేదండి! నేను ప్రిస్‌క్రైబ్ చేసిన రెండు టాపిక్స్‌వంటి వాటితో బ్లాగ్ పోస్టులు రాస్తే, చెవుల్లోంచి మాత్రమే కాదు, నవరంధ్రాలలోనుండీ రక్తం కారిపోయీ పెర్మనెంట్ రిలీఫ్ దొరుకుతుంది. బ్లాగారణ్యంలో ఇటువంటివాటిమీద గరం గరం డిస్కషన్లు చూసి తెలుసుకున్నానన్నమాట.

    ReplyDelete
  19. మీరిచ్చిన "ఎందరో మహానుభావులు" లింకు పట్టుకుని వెళ్ళి చూసాను. తర్వాత ఇంకొకరు ఇచ్చిన "ఎవ్వనిచే జనించు" పద్యం చూశాను. mood మారిపోయింది :) నేను కోపంలో లేను కాని. ఇప్పుడు అవసరం లేదులే అనుకున్న ప్రశాంతత, అది నన్ను ఆవరించాక తేడా తెలిసింది. నాగయ్య గారిని నేను ఎప్పుడూ గమనించని విధంగా గమనించేలా చేశారు. ఆయ్న అంటే గౌరవం ఉన్నా కొంచెం భయం కూడా మరీ లీనమైపోయి నటించేస్తారు అని. చిన్న చిన్న క్లిప్పులతో మొదలుపెడితే పై స్థాయికి ఎదగగలుగుతానేమో చూడాలి. ఐతే ఈ మధ్య కొన్ని నాకిష్టమైన భక్తి పాటలు విని చాలా రోజులైంది. మళ్ళీ ఆ మూడ్‌లోకి కూడా వచ్చాను మీ టపా పుణ్యమా అని. Thanks. ఇది మీ పోస్ట్లలో మరో మంచి పోస్టు (నా దృష్టిలో).

    ReplyDelete
  20. ఆ.సౌమ్య గారు,

    చక్కటి వ్యాఖ్య రాశారు. ధన్యవాదాలు.

    మీతో సినిమా సంగతులు చర్చించే సాహసం లేదు. అయినా చేస్తాను.

    నాగయ్య నలభయ్యవ దశకంలో దక్షణ భారతంలో మొట్టమొదటి సూపర్ స్టార్. తన నటనతో,గాత్రంతో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించాడు. నటుడు, దర్శకుడు, సంగీత దర్శకుడు, దర్శకుడు, దివాళా తీసిన నిర్మాత కూడా!

    నాగయ్య పోతన చూశాను. శ్రీనాథునిగా జంధ్యాల గౌరీనాథశాస్త్రి నాగయ్యని అందుకోలేకపోయాడు. సినిమా నాకు నచ్చింది. పాటలు అద్భుతం. (నాకు నాగయ్యని గుమ్మడితో పోల్చడం నచ్చలేదు. ఒక నదిని ఇంకో నదితో పోల్చవచ్చును గానీ.. పిల్లకాలువతో ఎలా పోలుస్తాం?!)

    చిన్నప్పుడు అమ్మతో పాటు హాల్లో గుమ్మడి 'భక్త పోతన' చూశాను. సరీగ్గా గుర్తు లేదు. కుదిరితే మళ్ళీ చూస్తాను (ఏ టీవీ చానెల్ వాడో దయ తలిస్తే).

    రామదాసు కూడా అక్కడక్కడా గుర్తుంది. నాగయ్య prime time నలభైలలోనే అయిపోయింది. ఆయన ఆ విషయం గ్రహించలేక చాలా నష్టపోయాడనిపిస్తుంది.

    వేమన గూర్చి మనిద్దరి అభిప్రాయాలు ఒకటే. ఈ సినిమా గూర్చి శ్రీశ్రీ రివ్యూ చదివారా? ఆయనకి అస్సలు నచ్చలేదు.

    వాణిశ్రీ సినిమా మరపురాని కథ అనుకుంటాను. చూశాను. మీరు చెప్పింది ఒప్పుకుంటున్నాను.

    మీరు నాగయ్య వివరాలు చక్కగా రాశారు. అభినందనలు.

    నాగయ్య గూర్చి కొద్దిగా వెరైటీగా రాద్దామని ప్రయత్నించాను. మీకు నచ్చినందుకు సంతోషం.

    ReplyDelete
  21. తెలుగు భావాలు గారు,

    అర్ధమయ్యిందండి. థాంక్యూ! (నేను మందమతిని. వివరంగా చెబితేగానీ అర్ధం చేసుకోలేను. క్షమించగలరు).

    ReplyDelete
  22. lalithag గారు,

    నాగయ్య గూర్చి వయసులో మీకన్నా చాలా పెద్దవాడనయిన నాకే మొన్న మొన్నటి దాకా తెలీదు. మీకు ఆయన గూర్చి తెలీకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.

    ఈ పోస్ట్ ఉద్దేశ్యం నాగయ్య గూర్చి ఓ నాలుగు ముక్కలు వ్రాసి.. ఆయన్ని కుర్రాళ్ళకి పరిచయం చెయ్యడం.

    thanks to internet. thanks to you Tube.

    ReplyDelete
  23. మంచి విషయం!
    బాగా చెప్పారు!

    కామెడీ టచ్ ఇంకా బాగుంది.

    కోపిష్టి డాక్టర్ దగ్గరకి వెళ్ళటానికి రోగులు ఇస్ష్ట పడరు కదా డాక్టర్ గారు?

    శీఘ్రమేవ కోప శూన్యత ప్రాప్తిరస్తు :-)

    ReplyDelete
  24. Fantastic post with heart touching satire.

    ReplyDelete
  25. నేను కూడా రాత్రి పూట yevaro lenapudu చాలా సినిమాలు చూసి ఏడ్చాను. అందులో నాగయ్య సినిమా ఒకటి ఉనట్టు గుర్తు.

    ReplyDelete
  26. ఇదేదో "గాంధీగిరి" లాగ "నాగయ్యగిరి" లా ఉందండి.

    నాగయ్య గారి సినిమాలు చూసి, చూసి మీకు ఆయన మీద బాగా భక్తి ఏర్పడినట్టుంది.

    మీకో రహస్యం చెప్పనా? ఈ స్పీడు యుగంలో నాగయ్య గారి సినిమాలు చూసేటంత ఓపిక ఉందంటే సహజంగానే మీకు కోపం తక్కువ అని తీర్మానించవచ్చు.

    అయినా చూడగలిగితే పాత సినిమాలు టెన్షన్ నుండి కొంత రిలీఫ్ ఇస్తాయని ఒప్పుకుంటాను.

    ReplyDelete
  27. Krishna Palakollu గారు,

    పేషంట్ల దగ్గర కోపాలుండవండి (వాళ్ళు డబ్బులిస్తారుగా!).

    నాగయ్య సినిమాల ప్రశాంతత రాయడం కోసం నా కోపాన్ని హైలైట్ చేశాన్లేండి!

    ReplyDelete
  28. @Andhra Pradesh live,

    గట్టిగా నవ్వడం, బాధతో కన్నీరు కార్చడం మంచి ఆరోగ్యానికి చిహ్నం!

    ReplyDelete
  29. bonagiri గారు,

    బోనగిరి, గాంధీగిరి, నాగయ్యగిరి.. అన్నీ మంచివేనండి!

    స్పీడు యుగం కాబట్టే నాగయ్య అవసరం ఉందంటాను.

    మనం ఎప్పుడూ ఒకే మూడ్ లో ఉండం గదా. చికాగ్గా ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నాగయ్య ఉపయోగపడొచ్చు.

    ప్రయత్నించి చూడండి.

    ReplyDelete
  30. నాయనా య ర !!!(కొంచం గొంతుతో సహా వణుకుతూ)

    1) మొదటిసారి ఒక అచ్చు తప్పు గమనించా!"ఎందులిలా జరుగుతుంది?" చాలా శ్రద్దగా ఏకాగ్రతతో రాస్తున్నావ్! ఇంత ఏకాగ్రత నీలో రెండో సారి చూస్తున్నా! మొదటిసారి 1986 లో. జరిగింది గుర్తుందా ఫలితం ఎంట్రన్సు ఫస్టు! అప్పుడు ఏకాగ్రతతో పాటు కసి కూడా!కానీ ఇప్పుడు ఏకాగ్రతతో పరిపూర్ణత! అయ్యబాబోయ్! నీ మీద ఆ పదం వాడతానని కల్లో కూడా అనుకోలేదు!
    2) నాకు నాగయ్య గారి సినిమాలు లవకుశ నుండే గుర్తు అంతకు ముందువి చూడలేదు! కానీ ఎపుడొ ఒక సారి ఆ అవకాశం రాకపోదు. చాలా గొప్ప నటుడు అని నేను కితాబివ్వనవసరం లేదు. సినిమా కోసం సన్నివేసం కోసం అవలీలగా చనిపోగలరు!
    3) నిన్న అర్దరాత్రి చదూతూ అరే మనవాణ్ణి శంకర్ దాదా పూనాడే అనుకొన్నా, బొనగీరి గారు కూడా అదే ఫీలయ్యారు!
    4) కానీ నిజజీవితంలో కొందర్ని చూసి కొన్ని "మంచి" అలవాట్లు నేర్చుకొంటాం పాటిస్తాం. దాన్ని మంచిగా రాసుకొచ్చావ్!Keep it up!!!BTW, You changed the GI DOC to vegetarian with Broiler Kodi....See people can change with your blogs! So keep it in your mind while writing. Now I put 20 ton weight on your head. Happy Writing.
    Gowtham

    ReplyDelete
  31. డాక్టర్ గారు

    "పేషంట్ల దగ్గర కోపాలు రావు" - కస్టమర్ భగవాన్ హోతా హై అన్న మాట :-) మంచిది.

    కాని మీరు రాయడం లో చూపిస్తున్న వైవిధ్యం .. చాలా బాగుంది.

    ReplyDelete
  32. ఈ మధ్య యూ ట్యూబ్ లో మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ళ వారి ఇంటర్వ్యూ చూసాను. వారికి నాగయ్య గారే ఇనిస్పిరేషను ట. వారి మాటల్లో చెప్పాలంటే నాగయ్య గారి అంతటి కారెక్టరు ఆర్టిస్టు మరి ఎవరూ లేరు. మీ శైలి బాగుంది.

    ReplyDelete
  33. నాగయ్య శాంతస్వరూపం నాకీమధ్యే గోచరమవుతోంది. :D ఆయన సినిమాలు ఈ మధ్య చూసాననుకోకండి. మిగిలిన నటుల మొహాలలో సాత్వికత కరువై చూడడానికే ఇబ్బందనిపించినప్పుడల్లా నాగయ్య గుర్తొస్తూ ఉంటారు.

    నాగయ్య "ఎవ్వనిచే జనించు" నిత్యపారాయణంలా చూడాల్సిన, వినాల్సిన పద్యం.

    nice post! :)

    ReplyDelete
  34. నాగయ్య గారి మీద మంచి వ్యాసం కొత్తకోణంలో చాలా చక్కగా రాశారు. ఆయన పాండురంగ మహత్యంలో పాడిన "సన్నుతి చేయవే మనసా" అనే పాట కూడా చాలా బాగుంట్టుంది. మీరు విని ఆనందించేది.
    http://www.youtube.com/watch?v=Kbg3-HZPvXE

    SriRam

    ReplyDelete
  35. @TJ "gowtham" Mulpur,

    బ్లాగ్ రాయడం పెద్ద కష్టమేం కాదోయి. రోజూ రాత్రిళ్ళు నిద్రొచ్చేదాకా కీబోర్డ్ ని ఒత్తుతుంటే.. అదే కొన్నాళ్ళకి ఒక పోస్టుగా రూపాంతరం చెందుతుంది!

    మీరంతా అసరా (అసూబాలు కాదులే!) వాసులై.. నాకు కబుర్లు చెప్పుకోడానికి ఎవరూ లేకుండా చేశారు.

    ఇక్కడ నాకు బట్టతల సీనియర్ డాక్టర్ వేషం ఇరుగ్గా, ఇబ్బందిగా ఉంది. స్నేహితులు లేరు.

    అంచేత బుర్రలోని దుష్టదుర్మార్గ ఆలోచనల్ని బ్లాగ్ లో రాస్తూ.. ఆత్మానందం పొందుతున్నా.

    నే రాసేదాని కన్నా టైపొ ఎర్రర్స్ దిద్దుకోడానికే ఎక్కువ సమయం పడుతుంది.

    ఈ మధ్య తెలుగు అక్షరాలు (వేడి ఇడ్లీ పార్సెల్ కట్టిస్తే అతుక్కుపోయినట్లు) కలిసిపోతున్నాయి. ఇది గూగుల్ గాడి కుట్రలా ఉంది!

    ReplyDelete
  36. Krishna Palakollu గారు,

    కోపం అనేది ఒక లక్జరీ. పడేవాడున్నప్పుడే గదా కోప్పడేది!

    డాక్టర్లు సొంత క్లినిక్కుల్లో (పేషంట్లపై) అస్సలు కోపం తెచ్చుకోరు. గవర్నమెంట్ ఆస్పత్రిలో అయితే మాత్రం అస్సలు శాంతంగా ఉండరు!

    కావున ఒక వ్యక్తి కోపతాపాలు వ్యక్తిగతమే కాదు.. పరిసరాల గతం కూడా!

    ReplyDelete
  37. @అనగనగా ఒక కుర్రాడు,

    వేణుమాధవ్ వయసు ఎనభై. ఆ వయసు వారికి నాగయ్య ఆరాధ్యుడు.

    ఇప్పుడు యాభై దాటిన నా వయసు వారికి NTR, ANR లు పెద్ద హీరోలు.

    మా తరవాత తరం వారికి కృష్ణ గ్రేట్ ఏక్టర్.

    ఈ సినిమాలు చూడటం అనేది ప్రతి వ్యక్తికి ఒకానొక దశ. అటు తరవాత సినిమాల మీద ఆసక్తి పోతుంది. పోవాలి కూడా.

    అంచేత.. వేణుమాధవ్ నాగయ్య పేరే చెబుతాడు. ఇంకో పేరు చెప్పమంటే ch.నారాయణమూర్తి అంటాడు!

    ReplyDelete
  38. కొత్తావకాయ గారు,

    ఒక నటుడి ప్రతిభని అంచనా వేయడానికి అనేక అంశాలని పరిగణనలోకి తీసుకోవాలి.

    నాగయ్య కాలంలో తెలుగు సినిమా చిన్నపాపాయి. సహనటులు (కాంచనమాలతో సహా) బొమ్మల్లా కేవలం డైలాగులు అప్పజెప్పడం గమనించవచ్చు. నటనలో, ఈజ్ లో నాగయ్య సహనటుల కన్నా ఎంతో ముందుంటాడు.

    నేను తెలుగు సినిమా సాహిత్యం చదవను. తెలుగు సినీ జర్నలిస్టులు పరాన్న భుక్కులు. పొగడ్తలే తప్ప శాస్త్రీయ పద్ధతిలో ఒక సినిమాని గానీ, నటుణ్ణి గానీ అంచనా వెయ్యలేరు. భవిష్యత్తులో మనకి ఈ ఏరియాలో మంచి సాహిత్యం రావచ్చు. 'నవతరంగం' ఒక ఉదాహరణ.

    ReplyDelete
  39. రమణ గారూ,
    మంచి విషయాలు వ్రాసారు. నేను సాహసించి మా ఆవిడని ఎదిరించి మరీ కొన్న సినిమా డి వి డి లు వేమన, త్యాగయ్య.. కొన్నప్పుడు వద్దన్నానాతొ కలసి చూసి సంతోషించింది, నాకు మాత్రం చెప్పలేదనుకొండి...
    నేను కూడా మీకు అస్మదీయుడనే... ఆ పవిత్ర హస్తాలతో కన్నాంబ గారిని గూర్చి కూడా ఒక్క మాట రాద్దురూ మీకు పుణ్యము ఉంటుంది.. చాలా మంది వ్రాసినా మీరు వ్రాస్తే మాకు శంఖములో పోసినట్టు...నటులలో నాగయ్య గారు ఎంత సహజ నటులో, నటీ మణులలో కన్నాంబ గారు అటువంటివారు. పాత్రోచితముగా కంట నీరు తిప్పుకునేవారుట ఆవిడ.. (చూ: తోడికోడళ్ళు సినిమా.. ఇంకా మరెన్నో..) ఇద్దరూ ఇద్దరే..

    సీతారామం

    ReplyDelete
  40. Ramana garu,

    Ramakrishna ParamaHamsa gari photo chusinaa kooda entho prasanthatha kaluguthundi naaku.

    Yogi Vemana cinema copy nenu dachipettukonna oka viluvaina ani mutyam.

    ReplyDelete
  41. Seetharam గారు,

    కన్నాంబ అందంగా ఉంటుంది. మంచి వాచకం. ఆవిడ గొప్పనటి అని తెలుసు. అంతకుమించి కన్నాంబ గూర్చి నాకు పెద్దగా తెలీదు.

    నా అభిమాన నటి సూర్యాకాంతం గూర్చి రాయాలని ఉంది. రాస్తాను.

    నా తరవాత టపా ఏంటో ఇంకా నిర్ణయించుకోలేదు. అది నా చేతిలో లేదు. నా బ్లాగులో సీరియస్నెస్ ఎక్కువయినట్లుంది. నాకిష్టమైన బాలకృష్ణ, చిరంజీవిల గూర్చి రాసి తేలికబరిస్తే బెటరేమో?

    ReplyDelete
  42. అన్నయ్యగారూ , నాగయ్య గారి గురించి చక్కగా వ్రాసారండి.

    ReplyDelete
  43. అవునండీ ఆయన ప్రైం టైం తరువాత సినిమాలు తీసి ఉండకుండా ఉండాల్సింది.
    వేమన్న గురించి శ్రీ శ్రీ సమీక్ష చదవలేదండీ?? మీదగ్గరుంటే నాకు ఇవ్వరూ?
    అవును అది మరపురాని కథే...పొరపాటున మనిషి అని రాసాను.

    సూర్యకాంతం గురించిఎ ఎప్పుడు రాస్తున్నారు? నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఆవిడంటే నాక్కూడా చాలా ఇష్టం :))

    ReplyDelete
  44. మీ ఫాన్స్ కు ఏవైనా డిగ్రీలు పెట్టండి. చిన్న కారు, సన్నకారు, ఓ మాదిరి, భారీ... ఫాన్ ఇలాగ..నాకు మాత్రం ఓ పెద్ద డిగ్రీ ఇవ్వండి.

    ReplyDelete
  45. @anrd,

    ధన్యవాదాలు తమ్మయ్య/చెల్లెమ్మ గారు!

    ReplyDelete
  46. రమణ గారు,
    సూర్యకాంత గురించి మళ్లి రాయండి. ముందర మీ గురించి తెలుసు కోవాలని ఉంది. మీ మిత్రులకు మీ గురించి తెలుసేమోగాని మాలంటివారికి ఎలా తెలుస్తుంది? మీ పోటో కూడా చూడాలని కుతూహలంగా ఉంది. తరువాతి టపా మీగురించే రాయండి. ఆ టపాలో మీకుటుంబ సభ్యులను పోటోలతో సహా పరిచయం చేయండి :)

    SriRam

    ReplyDelete
  47. పిగ్మాలియన్ ఎఫ్ఫెక్టా..?
    నీనూ ప్రయత్నిస్తా !!

    ReplyDelete
  48. ఆ.సౌమ్య గారు,

    చిత్తూరు నాగయ్య, కస్తూరి శివరావు, సావిత్రి.. గొప్ప నటులు. కానీ మనీ మేనేజ్మెంట్ తెలీని అమాయకులు. అందుకే చివరి దశలో ఇబ్బంది పడ్డారు.

    శ్రీశ్రీ సాహిత్యం చలసాని ప్రసాద్ ఎడిటర్ గా విరసం వారు ప్రచురించారు. వ్యూలు, రివ్యూలు వాల్యూంలో వేమన గూర్చి శ్రీశ్రీ రాశాడు. వీలును బట్టి మీకు పంపిస్తాను.

    ReplyDelete
  49. @Chandu శ్,

    నేనేదో 'పని లేక.. ' సరదాగా రాసుకుంటున్నాను. మీరిట్లా నన్ను మునగచెట్టు ఎక్కించుట పాడి కాదు.

    ReplyDelete
  50. రమణా,

    నాగయ్య గారి గురించి బాగా వ్రాశావు.తెలుగు సినీ ఇండస్ట్రీలో నువ్వు రాసినట్లు నాగయ్యే మొట్ట మొదటి సూపర్ స్టార్. మనకు తెలిసిన నటరత్నలూ నట సామ్రాట్లూ నెల జీతాలకి పని చేసే రోజుల్లో సినిమాకి లక్ష రూపాయలు తీసుకునేవాడని ఎక్కడో చదివాను. నేను గుంటూరు వచ్చినప్పుడల్లా ఇంట్లో ఏవో పాత సినిమాలు చూస్తుంటాను. ఆ మధ్య భక్త పోతన చూశాను. అది నాగయ్య గారు మంచి వయసులో ఉన్నప్పుడు కే.వీ రెడ్డి తీసిన సినిమా.అందుకే అందులో అంత వర్చస్సుతో నాగయ్య పోతనగా రాణించాడు. ఇంకా త్యాగయ్య లో కూడా అద్భుతంగా నటించాడు. నాగయ్యకి ఉన్న గొప్ప ఎడ్వాంటేజ్ ఆయన శాస్త్రీయ సంగీత పాండిత్యం. ఆయన స్వర మాధుర్యం ఇప్పటికీ ఆయన పాడిన పాటల్లో, కీర్తనల్లో మనం ఎంజాయ్ చెయ్యొచ్చు. మంచి వ్యక్తి గురించి చక్కగా వ్రాశావు. థాంక్స్.

    దినకర్.

    ReplyDelete
  51. దినకర్,

    నాగయ్య గూర్చి చక్కటి కామెంట్ రాసావు. థాంక్యూ!

    నాగయ్య శోభన్ బాబులా రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యకపోయినా.. కనీసం అక్కినేని నాగేశ్వరరావులా పొదుపరిగా (గిట్టనివారు ఆయన్ని పిసినారి అంటారు.) బ్రతికినా అన్ని బాధలు పడేవాడు కాదేమో!

    ReplyDelete
  52. "గిట్టనివారు ఆయన్ని పిసినారి అంటారు"

    ఔరా ఎంతటి అభాండం! మీ హీరో షూటింగులో ఇచ్చే బట్టలు ఇంటికి పట్టుకెళ్ళేవాడట కదా. పిల్లికి బిచ్చం పెట్టని మీ వాడి కంటే మా గురువు గారే ఎంతో నయం.

    PS: ఇవి నా సొంత డైలాగులు కాదు. నా చిన్నప్పుడు అక్కినేని అభిమాని ఒకరు మా నాయనతో అన్న ముక్క.

    ReplyDelete
  53. డాక్టర్ గారు,

    హెచెంటివి గురించి వ్యాఖ్య రాద్దామంటే కామెంట్స్ కాలం కనపడుటలేదు

    జి రమేష్ బాబు
    గుడివాడ

    ReplyDelete
  54. @ramaad-trendz,

    రమేష్ గారు,

    సరిచేశాను.
    ధన్యవాదాలు.

    ReplyDelete
  55. డాక్టర్ గారు,అనుకొకుండా చూసిన సినిమా నవతావారి త్యాగయ్య బాపు(direction), సొమయాజులు (action) చూసి ఫ్లాట్..(దూరదర్శన్ లో)..ఎప్పుడు వచ్చినా మిస్ అయ్యెవాడిని కాధు..ఎంత గా istam అంటే గ్రాంఫొన్ నుంచి audio cassetee record చెయెంచ్కున్న ..మా బాబాయీ చెప్పారు దీనికి మాత్రుక నాగయ్యగారి సినిమా త్యాగయ్యా అని..its really a beutiful melodius movie అని..its true.. ..రామదాసు last movie .. థాంక్స్ మరో సారి మీకు. maa pothana,tyagayya,raamadasu ని గుర్తు చేసినంధుకు ...

    ReplyDelete
  56. @srividyananda,

    నాకు బాపు 'త్యాగయ్య' తీసినట్లు తెలీదు. నా సినిమాలన్నీ స్నేహితులతో చూసినవే. నేనెప్పుడూ ప్రత్యేకంగా ఫలానా సినిమా చూద్దామని అనుకోలేదు.. చూళ్ళేదు.

    నా స్నేహితుల్లో కృష్ణకీ, జ్యోతిలక్ష్మికి కూడా అభిమానులున్నారు. బాపు, రమణల గూర్చి మేమెప్పుడూ పట్టించుకోలేదు. కావున వాళ్ళ గూర్చి నాకు పెద్దగా తెలీదు. ఇద్దరూ కలిసి రామాయణాన్ని బాగా అరగదీశారని మాత్రం తెలుసు.

    స్పందనకి ధన్యవాదాలు.

    ReplyDelete
  57. *ఇద్దరూ కలిసి రామాయణాన్ని బాగా అరగదీశారని మాత్రం తెలుసు.*

    వాళ్లు రాముడి మీద సినేమాతీస్తే మీకొచ్చిన నష్ట్టం, కష్ట్టమేమిటి? మిమ్మల్ని వారు పట్టుపట్టి సినేమా చూపించారా? మీకు ఇష్ట్టంలేక పోతే రామాయణాన్ని ఇష్టపడే వాళ్లు చాలా మంది ఉన్నారు. పోనిమీరు, మీ మార్క్సిస్ట్ సాహిత్య మిత్రబృందం రామాయణ విష వృక్షన్ని తెరకెకించలేక పోయారా? అది రాసి కూడా సుమారు30సం|| అవుతున్నాది కదా!

    మీరు రోజు ఇంత మంది పేషంట్లను చూస్తున్నారు కదా! మీరు చదివిన, పుస్తకాలలో రాసిన రోగ లక్షణాల వారు కాకుండా, వేరే విధమైన కొత్త లక్షణాలతో వచ్చే కేసులు రోజుకి ఎన్ని వస్తాయి? మీరు చదివిన, పుస్తకాలలో రాసిన రోగ లక్షణాల కేసులే వస్తున్నాయి కదా! వాటికి అదే చికిత్స, అదే మందుల జాబితా అని బోర్ గా ఫీలై చూడటం మానారా?

    ReplyDelete
  58. /నా అభిమాన నటి సూర్యాకాంతం గూర్చి రాయాలని ఉంది. రాస్తాను/

    మహాతల్లి, ముగురమ్మల మూలపుటమ్మ, పెద్దమ్మ సూర్యకంతం నా అభిమాన నటి కూడా, గరిట ఎడంచేత్తో ఎత్తిందో ... యక్ష, సిద్ధ, సుర, గధర్వ, కిన్నెర, కింపురుషా, నాగ, మానవ లోకాలు గడగడ లాడిపోతాయ్. రాయండి, మీ వ్యాసం కోసం ఎదురు చూస్తాను. :)

    ReplyDelete
  59. అజ్ఞాతా,

    నాకు రామాయణం ఇష్టం లేదని మీరు ఎలా చెబుతారు? బాపు, రమణల అభిమాని కాకపోతే రామాయణం ఇష్టపడనట్లా! బాపు, రమణలకి దైవత్వం ఆపాదించి ఆకాశానికెత్తేస్తే రామాయణాన్ని ఇష్టపడినట్లా!

    బాపు ఇంకో వెయ్యి సార్లు రామాయణాన్ని తీసినా నాకే నష్టము, కష్టమూ లేదు. మీరు అవి ఒక లక్ష సార్లు చూసి తరించండి.

    రంగనాయకమ్మ విషవృక్షం చదివి మూడు దశాబ్దాలు దాటింది. సరదాగా ఉంటుంది. చక్కగా నవ్వుకోవచ్చు. ఎవరన్నా సినిమాగా తీస్తే చూసేదీ, లేనిది అప్పుడు ఆలోచించుకుంటాను.

    మీరు నా బ్లాగుకి కొత్త అనుకుంటాను. వైద్య వృత్తిని క్షురక వృత్తితో పోలుస్తూ టపా రాశాను. నా ప్రొఫైల్ లో కూడా మొనాటనీ అనే రాసుకున్నాను.

    భుక్తి కోసం చేస్తున్న ఉద్యోగాలకి, వృత్తులకి.. క్రియేటివ్ ఆర్ట్ అంటూ రామాయణాన్ని అరగదీయడానికి గల సంబంధం ఏమిటి చెప్మా!

    ReplyDelete
  60. ఓహ్ పుస్తకమా...నేనింకా ఆన్లైన్ ఆర్టికల్ ఏమో అనుకున్నాను. ఈసారి ఆ పుస్తకం సంపాయించడానికి ప్రయత్నిస్తాను.

    ReplyDelete
  61. ఆయ్ రమణ గారు,

    మీ పేరు లో రమణ అని ఉండటం ఏంటో కాని, మీరు పిల్లి, ఎలుక పై టపా వ్రాసినా బాపు రమణ ల పేర్లు వెతుక్కుంటారు జనం.(హే భగవాన్) ఇలా వాళ్ళ అభిమానులే వచ్చి డొల్ల తనాన్ని బయట పెట్టుకోడం ఏంటో !!!!!!! వాళ్ళ తో పాటు రామాయణమూ వచ్చుద్ది నడిబజార్లోకి!!!!!!!

    రామాయణం బాపురమణ గార్లు 'స్వంత రచన' కదా, వాళ్ళెంత అరగదీసుకుంటే మాత్రం జనం ఆ మాట అనుకోవచ్చునా ???????????
    అసలు వాళ్ళు అరగదీసింది రామాయణం అట్టు పిండి అని కూడా ఎంత మందికి తెలుసు :)

    ReplyDelete
  62. *బాపు, రమణలకి దైవత్వం ఆపాదించి ఆకాశానికెత్తేస్తే రామాయణాన్ని ఇష్టపడినట్లా*
    రమణయ్య గారు,
    వారికి దైవత్వం అపాదించమని,ఆకాశానికి ఎత్తమని కోరలేదు. సందు దొరికితే వారి పైన సేటైర్ వేస్తున్నారు.

    *భుక్తి కోసం చేస్తున్న ఉద్యోగాలకి, వృత్తులకి.. క్రియేటివ్ ఆర్ట్ అంటూ రామాయణాన్ని *
    ఇన్ని పుస్తకాలు చదివారు, స్వయంగా సైక్రియార్టిస్ట్ అయి ఉండి ఆమాత్రం తెలియద? క్రియేటివ్ విటి అనేది ఇది అని ఎవరైనా నిర్వచించగలరా?

    ఈ జోళి ఎమీ మాట్లాడుతున్నాదో అర్థం కావాటంలేదు. చంద్రబాబు చెప్పినట్లు,జోళి మిమ్మల్ని ప్రజలు గమనిస్తున్నారు. రామారావు ఆఖరి దశలో శ్రీనాథుడు మీద ఒక మంచి సినేమా తీశాడు. దానిని చూడూ బాపు రమణల గురించి తెలుసుకోవాలంటే. ఆసినేమా ప్లాప్ అయి ఉండవచ్చేమోగాని, రామరావు జీవితం లో నటుడుగా మిస్సమ్మ తరువాత నటించిన సినేమాలో అది ఒకటి.

    ReplyDelete
  63. అజ్ఞాతా,

    మీరు మీ బాపు రమణల భక్తితో ఒక పోస్ట్ రాసుకోండి.

    నా అభిప్రాయాలు నావి. మీకు నచ్చకపోతే నేను చేసేదేమీ లేదు.

    ReplyDelete
  64. బాపు చిత్రాలు బాగా వుంటాయి, కొన్ని. రమణ టైపు హాస్యం కూడా చాలా కొతవరకూ నచ్చుతుంది. కాని ఈ భజన పరుల వెర్రి/పైత్య ఆరాధన చికాకు పుట్టిస్తుంది. ఇలాంటి వీర ఫంకా బ్లాగులు ఇక్కడ నాలుగు దాకా వున్నాయిలేండి. ఈ అజ్ఞాత వాళ్ళలో ఒకడేమో.

    ReplyDelete
  65. మీసలహాకి ధన్యవాదాలు. బ్లాగు పెట్టి రాసుకునే అంత తీరికా లేదు. అంతో ఇంతో మంచి పేరున్న ప్రతితెలుగువాడిని విమర్శించటం పెద్ద యజ్ణంగాచేపట్టినట్లు ఉన్నారు. మీరిచ్చే మేసేజ్ సందేశం ఎమిటి? బాపు,రమణ, చిరంజీవి,గొల్లపూడి మొదలైనవారందరు వారి రంగాలలో టాలేంట్ లేని వారు. ఎవరైనా దానికి అభ్యంతరం చెపితే వాళ్లు వారి భక్తులా.
    అసలికి మీరే మనుకొంట్టున్నారు ? బ్లాగులు చదివే వాళ్లు తెలుగు హీరోల అభిమానులు లాగా కనిపిస్తున్నామా? ఇక గొల్లపూడిని అంతలా విమర్శించారు కదా! దానినేమి కాదనను గాని, ఆయన ఆ కాన్సేప్టు (వందేళ తెలుగు కథ అంటు ) మొదటి సారిగా టి వీ లో ప్రోగ్రాం చేశాడు. అది క్రియేటివిటి అంటే. అది మీకు నచ్చకపోయినా భవిషత్లో/ వేరే చానల్లో, వేరే ఎవరైనా ఆయన కన్నా అటువంటి ప్రోగ్రాం ను ఇంకా బాగా నిర్వహించవచ్చేమో! కాని ఆయన కాన్సేప్ట్ తో రావటమనేది ఎంతో అభినందించదగ్గ విషయం. ఇంత సాహిత్య మీద అభిమానం ఉన్న మీరు, మీ ఊరిలో ఎన్ని సాహిత్య సభలు నిర్వహించారు ? నిర్వహించి ఉంటే వాటిని టపాలు గా రాయండి. చదివిపెడతాము.

    ReplyDelete
  66. నాగయ్య గారిని చూస్తే నాకు కోపం తగ్గదు కానీ....నేనూ నాగయ్యగారికి వీరాభిమానిని(మీరు చెప్పిన అభిమానం కాదులెండి). మా ఇంట్లో ఆయన నటించిన త్యాగయ్య సినిమా ఆడియో కేసెట్స్ ఉండేవి. అవి నేను ఎన్ని సార్లు విన్నానో లేక్కేలేదు. ఆ సినిమా అంతా నాకు కంఠతా. నాకు కూడా ఎందరో మహానుభావులు కీర్తన చాలా చాలా ఇష్టం. వినడం మొదలుపెడితే కనీసం ఐదుసార్లు వరుసగా వింటేగాని నాకు మనసుతృప్తిగా అనిపించదు. త్యాగయ్య సినిమా ఎంత కంఠతా అంటే డైలాగులు, ఎక్కడెక్కడ ఏ కీర్తనలు వస్తాయో కూడా చెప్పగలను.

    ReplyDelete
  67. మనోజ్ఞ గారు,

    >>ఆ సినిమా అంతా నాకు కంఠతా. నాకు కూడా ఎందరో మహానుభావులు కీర్తన చాలా చాలా ఇష్టం.<<

    మీ వయసువారు ఈ వాక్యాలు రాయడం నాకు చాలా సంతోషంగా ఉంది.

    >>నాగయ్య గారిని చూస్తే నాకు కోపం తగ్గదు కానీ....నేనూ నాగయ్యగారికి వీరాభిమానిని.<<

    నా థియరీ ప్రకారం మీకసలు కోపం వచ్చే అవకాశమే లేదు.

    ReplyDelete
  68. Brahmanandam Gorti5 July 2012 at 08:53

    నాగయ్య గురించి బాగా రాసారు. మీ ఎనాలసిస్సులు బాగుంటున్నాయి. కాస్తా రైం కోసం - మీ ఎనాలసిస్సులకి శుభాసిస్సులు!"

    నాగయ్య లాంటి వ్యక్తులు చా..........లా అరుదుగా వుంటారు. బెంగుళూరు నాగరత్నమ్మ త్యాగరాజు సమాధి కట్టాలని తాపత్రయపడుతూ ఉన్న కాలంలో ఈయన చాలా డబ్బు సాయం చేసారని చదివాను. త్యాగయ్య సినిమా మీద వచ్చిన సొమ్మంతా ఒక్క పైసా కూడా ముట్టకుండా తిరువయ్యారులో త్యాగరాజు సమాధి దగ్గర ఆయన పేర ఒక ధర్మసత్రం కట్టించాడు. ఇలాంటి వాళ్ళని చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అదేవిటో తెలీదు. నటన పేరు చెప్పి అవార్డులూ, స్టూడియో స్థలాలూ, ఫాల్కేలూ కొనుక్కునే వారినే ఈ సమాజం ప్రోత్సహిస్తుంది. అందరికీ మహాత్ములు కావాలి. కానీ ఏ ఒక్కరూ అలా అవ్వడానికి ప్రయత్నించరు. అవుదామనుకున్న వారిని ప్రోత్సహించరు కూడా.

    Nagayya is my off-screen Real HERO; On screen, an invincible actor.

    -బ్రహ్మానందం గొర్తి

    ReplyDelete
    Replies
    1. అవును. మీ వ్యాఖ్యతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.

      Delete
  69. Hi Doc,

    I visited you blog for first the time today. I read few posts and I like them!

    I don't have a habit of reading blogs (except those related to my career). If I am habituated (or addicted) to it, I will blame you for that.

    Though this is old post I think this is an appropriate place to post this request.

    Can you please write something on works of Fyodor Dostoevsky? I would like to know from a psychiatrist about the most influential author on human psychology(?) who said to have influenced pioneers in psycho analysis like Freud.

    If you have already written something about Dostoevsky, Crime and punishment etc. please point me to the posts.

    I have recently read Crime and Punishment. I identified myself with the protagonist in some situations. But I din't find any ground breaking revelations of human psychology in this so called monumental work.May be one reason is I have already read and watched about the criminal psychology in lot of books and movies. Any way I like the book. I am really connected with "conflict and confession part".

    I have to confess that I know very little about psychology/psychiatry and also I didn't read much literature(Medical or literary) on this subject. But I am very interested to know the "under the hood" working of psychology.
    I also not sure that Dostoevsky is where I shall start.

    Now I am planning to read "The brothers Karamazov". If you haven't written something on Dostoevsky, Sir, I beg you to do so because your opinions and ideas are more valuable and useful than typical literary critics.

    I have seen some analysis of Dostoevsky writings and "his" psychology by Freud himself but they are too technical to understand. You can simplify that stuff for people for me.

    "Chalkkani Telugu nudikaram lo mee key board nundi jaaluvaarina gongura pachhadi laanti visleshanalu haasyapu vadiyalu to tinalani aasa"

    Sorry for my terrible English and informal salutation. I am not accustomed to type in Telugu and so decided to test you patience.

    I wish this request (reply) grab your attention!!

    mohan@yaramana# exit

    ReplyDelete
  70. గూగులోడు.. Haha, lol.

    Nagayya (cinemalu) meeku therapist aithe meeru (mee blog) maaku therapist. Thanks a lot.

    ReplyDelete
    Replies
    1. అయితే నాది నాగయ్య స్థాయి అన్నమాట! థాంక్యూ!

      Delete
  71. నాగయ్య గారి "ఎందరో మహానుభావులు" నాకు చాల ఇష్టమైన పాట. పాట విన్నప్పటికంటే చూసినప్పుడు ఎందుకు ఎక్కువ బాగుటుందో అనుకున్నాను ఇన్నిరోజులు, మీ ఈ టపా చూసిన తరువాత రహస్యం తెలిసిపోయింది. పాడడం అయిన తరువాత నాగయ్య గారు అంటారు కదా "గురువుల ఆశీర్వాదం కోదండ రాముని దయ, శిష్య పరమాణువు చరితార్థుడు అయినాడు" ఇది నా favourite.
    ధన్యవాదములు.

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.