Wednesday 11 January 2012

రావిశాస్త్రి 'పిపీలికం'

"ఒరే పిపీలికాధమా! నేనవరిననా అడిగేవు? నేను సుఖభోగిని. నీ పాలిట మాత్రం కాలయముణ్ణి! ఇప్పుడు తెలిసిందా నేనెవరో? తెలిసింది కదా! మరి, నువ్వెవరో నీకు తెలుసునా? నీ ముఖం చూస్తే నీకింకా ఏమీ తెలియనట్టే ఉందిలే. నువ్వు ఈ లోకంలో ఒకానొక తుచ్ఛపు కష్టజీవివి. కష్టజీవులు కష్టపడాలి. సుఖభోగులు సుఖించాలి. అలా జరుగుతుందనేది ప్రకృతి ధర్మం. అలా జరగాలనేది భగవదాదేశం. అందుచేత, మీ చీమ వెధవలంతా కష్టపడవలసిందే! మీ కష్టమ్మీద మేం సుఖించవలసినదే! మాకు అదే న్యాయం. అదే ధర్మం! కాదన్నవాణ్ణి కాటేసి చంపుతాం. ఇది మీరు కష్టపడి కట్టుకున్న ఇల్లే. బాగానే ఉంది. మీ నిర్మాణ కౌశలానికి ముగ్ధుణ్ణయేను. మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. చాలు నీకిది. పొండి. మరింక దీని సౌఖ్యం అనుభవించే భాగ్యం అంటారా? అది మాది. అది మా హక్కు. ఆ హక్కు మాకు వాడూ వీడూ ఇచ్చింది కాదు. భగవంతుడే ఇచ్చాడు. ఇది ఇప్పట్నించీ నా ఇల్లు. బోధపడిందిరా చిన్నోడా. నీకేదో చదువులు చదివి పాఠాలు నేర్చుకోవాలని కుతూహలంగా ఉన్నట్టుంది. ఈ దినానికి నీకీ పాఠం చాలు! మరో పాఠానికి మళ్ళీ రాకు. వచ్చేవంటే మిగతా పాఠాలన్నీ మరో లోకంలో నేర్చుకోవలసి ఉంటుంది. మరందుచేత వేగిరం నడువిక్కణ్నించి."

ఇది తనేవరో తెలుసుకోవాలని తపించిపోయిన చీమ(పిపీలికం)కి, దాని శత్రువయిన పాము చేసిన జ్ఞానోపదేశం. 'పిపీలికం'ని రావిశాస్త్రి 1969 లో రాశాడు. కథని జంతుపాత్రలతో, జానపదశైలిలో అద్భుతంగా నడిపిస్తాడు రావిశాస్త్రి. కథలో కష్టజీవిగా చీమనీ, శ్రమదోపిడీ చేసే వర్గశత్రువుగా పామునీ ప్రతీకలుగా ఎంచుకున్నాడు రావిశాస్త్రి.

కథాంశం 'బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతి.' అన్న సుమతీ శతకం పద్యపాదం నుండి వచ్చింది. పురాతనమైన జంతుపాత్రల కథనం మనకి 'పంచతంత్రం' వల్ల బాగా పరిచయం. చందమామలో కూడా చాలా కథలు వచ్చాయి. అయితే ఆధునిక తెలుగు సాహిత్యంలో ఇంత ప్రసిద్ధమైన ఈ తరహా రచన (నాకు తెలిసి) మరొకటి లేదు.

పూర్వం కృతయుగంలో శ్యామవనంలో నివసించే ఒకానొక చీమకి "నేనెవర్ని?" అని తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగింది. తోటి చీమ సలహాపై గోపన్నపాలెం చేరుకుని నిగమశర్మ అనే బ్రాహ్మణుణ్ణి కలిసి "నేనెవర్ని?" అని అడుగుతుంది. బ్రాహ్మణులకి మాత్రమే చదువు చెప్పాలనుకుని పేదరికంలో మగ్గుతున్న నిగమశర్మ, చదువుకుంటే చీమ సందేహం తీరుతుందంటాడు. అందుకు రోజూ ఒక గిద్దెడు నూకలు ఫీజుగా అడుగుతాడు. ఆ క్షణం నుంచీ ఎద్దులా కష్టపడి గింజగింజ చొప్పున గిద్దెడు గింజలూ ప్రతిదినం గురువుకి సమర్పించి చదువు నేర్చుకుంటుంది. చదువయిపోయిన తరవాత "నువ్వు చీమవి" అని సెలవిస్తాడు నిగమశర్మ.

కొంతకాలానికి చీమకి "అసలు చీమంటే ఏమిటి?" అని మళ్ళీ సందేహం వస్తుంది. నిగమశర్మ సలహాపై జన్నాలపల్లెలో చతుర్వేది అని పిలవబడే వేదవేదాంగవేద్యుడు వద్దకి చేరుకుంటుంది. చతుర్వేదులువారు చీమకి శుద్ధి చేసి, బ్రాహ్మణ్యం ఇప్పించి, తను చేయదలచుకున్న యజ్ఞానికి బంగారం ఫీజుగా ఇమ్మంటాడు. నిగమశర్మ ఫీజు గిద్దెడు నూకలైతే, చతుర్వేదిగారి ఫీజు బంగారం. నిగమశర్మది వీధి చివరి ఇంగ్లీషు మీడియం స్కూలయితే, చతుర్వేదిది కార్పొరేట్ విద్యాసంస్థ! సంవత్సరాల పాటు శ్రమించి రేణువు రేణువు చొప్పున హిరణ్యం సమర్పించుకుంటూ వేదాలు నేర్చుకుంటుంది మన పిచ్చిచీమ. చివరికి వేదసారం 'సోహం' అన్న ఒక్కమాటలో ఉందని చెబుతాడు చతుర్వేది.

బ్రహ్మజ్ఞానం పొంది కూడా తృప్తి నొందని చీమ ఒక మహాఋషిని దర్శిస్తుంది. ఆయన "యోగసాధన చేసి తపస్సు చెయ్యి. జన్మరాహిత్యం సంపాదించి మోక్షం సంపాదించు." సలహా ఇస్తాడు.

"ఏ జీవికైనా జన్మరాహిత్యం ఎందుకు? మోక్షం ఎందుకు?" అని అడిగితే సమాధానం రాదు.

నిరాశతో శ్యామవనంలోని తన పుట్టకి తిరిగొస్తుంది. అక్కడ తమ ఇంటిని ఒక రాక్షసాకారం (పాము) ఆక్రమించుకుని తన సోదర చీమలని తరిమేయ్యటం చూస్తుంది.

"ఇది అన్యాయం. అక్రమం. ఇలా మా ఇంటిని ఆక్రమించటం నీకు న్యాయమేనా?" అని పాముని గౌరవపూర్వకంగానే అడుగుతుంది చీమ.

అప్పుడు పాము బుసబుస నవ్వి చెప్పే మాటలు ఈ కథకి హై లైట్. పాము మాటలతో చీమకి తనెవరో జ్ఞానోదయం కలుగుతుంది.

"నువ్వు తుచ్ఛపు కష్టజీవివి."

తనెవరో పాము ద్వారా గ్రహించిన చీమ.. తన తోటి చీమలకి హితబోధ చేసి, ధైర్యం చెప్పి, వారిని వీరులుగా మార్చి, "రాక్షసాకారపు భగన్న్యాయం" మీద తిరుగుబాటు చేసేందుకు అందర్నీ కూడగట్టుకుని రంగంలోకి దిగుతుంది.

తత్ఫలితంగా, శ్యామవనంలో ఓ రాక్షసాకారం విలవిల తన్నుకుని నెత్తురు కక్కుకుని చచ్చింది. భూభారం కొంత తగ్గింది.  

(ఇంతటితో కథ అయిపోతుంది)

శాస్త్రాలు చెప్పని సత్యం, పండితులు దాచిన అసలు విషయం దాని శ్రమని దోపిడీ చేసిన పాము చెబుతుంది. జ్ఞానకాంక్ష కన్నా ఆకలి ఎంత శక్తివంతమైనదో చీమకి తెలిసివస్తుంది. 

వల్లంపాటి వెంకటసుబ్బయ్య తన 'కథాశిల్పం'లో ఈ కథని విశ్లేషిస్తూ, 'శ్రమదోపిడీని చిత్రించటంతో పాటు భారతీయ వేదాంతం శ్రమదోపిడీకి ఎలా సహకరించిందో, దాన్ని ఎలా ప్రోత్సాహించి, ఒక వ్యవస్థగా తయారుచేసిందో కూడా ఈ కథ సూచిస్తుంది.' అని అభిప్రాయపడ్డారు.

రావిశాస్త్రి 'పిపీలికం' కథావస్తువుని ఈ శైలిలో ఎందుకు రాసి ఉంటాడు? 'మిత్రబేధం'లో కుట్రలకీ, కుతంత్రాలకి నక్కలని, రాజుగా సింహాన్ని ప్రతీకలుగా వాడుకున్నట్లు, తన కథకి అవసరార్ధం కష్టజీవికి ప్రతీకగా చీమనీ, దోపిడీదారుకి సంకేతంగా పామునీ ఎంచుకుని ఉండొచ్చు. 

పాములు చీమల పుట్టని సొంతం చేసుకుంటాయి. ప్రకృతిలో ఇదో సహజ ప్రక్రియ. కాబట్టి రావిశాస్త్రి చెప్పదలచుకున్న విషయానికి ఈ చీమ, పాము సారూప్యం అతికినట్లు సరిపోతుంది. ఇది చాలా తెలివైన ఎత్తుగడ. కాబట్టే ఈ కథ మన మనసుకి బలంగా హత్తుకుపోయింది.

అసలు రావిశాస్త్రి సరదాగా చందమామకి ఒకకథ రాసి పంపాడనీ.. దాన్ని కొడవటిగంటి కుటుంబరావు చదివి, 'ఇంత పెద్దకథని మా చందమామలో వేసుకోం.' అని పురాణం సుబ్రహ్మణ్యశర్మకి పంపి ఆంధ్రజ్యోతిలో అచ్చేయించాడనీ, మా సుబ్బు గాలివార్త చెబుతుంటాడు. నేను సుబ్బు మాటలు పట్టించుకోను. 

సుబ్బు మాత్రం 'మిత్రమా! యూ టూ బ్రూటస్! ఈ టెల్గు పీపుల్ ద్రౌపది మనసులో ఏముందో రాస్తే జ్ఞానపీఠమిస్తారు. నిన్నగాకమొన్నదాక మన్తో వున్న కుటుంబరావు మనసులో మాట చెబితే నమ్మరు!' అని చిరాకు పడతాడు.

సాహితీ విమర్శకులు, ప్రేమికులు ఈ కథని అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తుంటారు. తెలుగు సాహిత్యం పట్ల ఆసక్తి వున్నవాళ్ళు ఈ కథని చదనట్లయితే, అర్జంటుగా చదివెయ్యండి, మరిన్ని కబుర్లు చెప్పుకుందాం. ఈ కథ చదవనివారిని చదివించే దిశగా మళ్ళించటమే ఈ పోస్ట్ లక్ష్యం.  

21 comments:

  1. Already I have read more than 15o times.

    kiran

    ReplyDelete
  2. రమణ గారు,

    ఈ కథ చదవమంటున్నారు, ఇప్పుడు మేము 'శ్రమ' జీవులం అండ్ మీరు.....

    జేకే!

    చీర్స్
    జిలేబి.

    ReplyDelete
  3. Zilebi గారు..
    నేను మీ తోటి శ్రమ జీవినండి!
    నాతోపాటు మీ చేతా చాకిరి చేయిద్దామనే ఈ పోస్ట్!

    ReplyDelete
  4. http://www.archive.org/stream/pipeelakam022212mbp#page/n0/mode/2up

    ReplyDelete
  5. Mauli గారు..
    మంచి లింక్ ఇచ్చారు.
    ధన్యవాదాలు.

    ReplyDelete
  6. గొప్ప కథను చక్కగా పరిచయం చేశారు. శాస్త్రిగారి శైలి ఈ కథను చులాగ్గా చదివించేస్తుంది. ఈ కోవలోనే శాస్త్రిగారు వ్రాసిన వేతనశర్మ కథ కూడా మధ్యతరగతి గురించి అన్యాపదేశంగా చెప్పిన గొప్పకథ.

    పాతకథను తిప్పిచెప్పటం అనే ప్రక్రియను బీనాదేవిగారు కూడా అద్భుతంగా వాడుకొన్నారు - ఆవూ పులి, పిట్టా పురుగు అనే కథల్లో.

    -- జంపాల చౌదరి

    ReplyDelete
  7. జంపాల చౌదరి గారు..
    ధన్యవాదాలు.
    అవును.
    'వేతనశర్మ కథ' నా ఆల్ టైం ఫావరెట్.

    >>"పాతకథను తిప్పిచెప్పటం అనే ప్రక్రియను బీనాదేవిగారు కూడా అద్భుతంగా వాడుకొన్నారు - ఆవూ పులి, పిట్టా పురుగు అనే కథల్లో."
    ప్రక్రియ రీత్యా పోల్చుకోవచ్చునేమో గానీ.. మీరు ఉదహరించిన కథలు 'పిపీలికం' దరిదాపులకి కూడా రాలేవని నా వ్యక్తిగత అభిప్రాయం.

    ReplyDelete
  8. నేను రావి శాస్త్రిగారివి ఎక్కువ చదవలేదండీ...ఆయన పుస్తకాల కోసం గత నాలుగేళ్ళుగా ప్రయత్నిస్తున్నాను. ప్రింట్ లో లేవు అంటున్నారు. నాకెప్పుడు దొరుకుతాయో ఏమో! :(

    మీరు బాగా రాసారు. రావిశాస్త్రీయం గురించి ఈ బ్లాగు ఒకసారి చూడండి. మీకు నచ్చుతుంది.
    http://manognaseema.blogspot.com/2011/11/blog-post.html

    ReplyDelete
  9. ఆ.సౌమ్య గారు..
    అద్భుతమైన రివ్యూకి లింక్ ఇచ్చారు. అందుకు ధన్యవాదాలు.
    వెంటనే మనోజ్ఞ గారి బ్లాగులో కామెంట్ రాసి ఇటు వచ్చాను.

    మనసు foundation రాయుడుగారు 'రావిశాస్త్రి రచనా సాగరం' అని మొత్తం రచనలని ఒక పుస్తకంగా ప్రచురించారు. వెయ్యి కాపీలు మాత్రమే వేసినందు వల్ల ఇప్పుడు ఆ పుస్తకం అందుబాటులో లేదు. నేను నాలుగు కాపీలు కొన్నాను. ఒకటి మాత్రమే మిగిలింది!

    మీకు త్వరలో రావిశాస్త్రి దొరుకుగాక!

    ReplyDelete
  10. అయ్యా రమణ గారు,
    నాకు తెలిసినంతవరకు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ, మనిషి ఉన్న ప్రతి చోట సమస్యలు పుడుతూనే (దేవుడు సృష్ఠంచనిది ఇదొక్కటే) ఉంటాయి. ఆ సమస్యలనుండి కొంతమంది కుతంత్రాలతో బయటపడుదామని, మరికొంతమంది నిజాయితీగా మిగతా వాళ్ళ సమస్యలనుండి బయటకు వచ్చే మార్గం గురించి ఆలోచిస్తుంటారు. ఈ విధంగా రకరకాల కుతంత్రాలను, సమాజ నీతిని సామాన్య మానవుడికి కూడా కళ్ళకు కట్టినట్లుగా "విష్ణు శర్మ" సంస్కృతంలో దాదాపుగా 3వ శతాబ్దానికి ముందే పంచతంత్రం లో వివిధ రకముల జంతువుల ద్వారా సమాజానికి ఒక "నీతి" ని సందేశాత్మకంగా ఇచ్చారు. దీన్ని తెలుగులోకి పరవస్తు చిన్నయ్య సూరి అనువదించారు. ఇఈ పంచతంత్రం లో గల విశేషమయిన జ్ఞాన సంపద కలిగి ఉండటంవలన ప్రపంచంలో దాదాపుగా 200 రకాలుగా, 50 పైన భారత దేశేతర భాషలలోకి అనువదించారు.
    ది అరేబియన్ నైట్స్, ది జెస్ట రోమనోరం, డెకమెరోన్, కాంటర్బరీ టేల్స్, ఫేబుల్స్ ఆఫ్ ల ఫౌంటైన్, ది బేర్ - రాబిట్ టేల్స్ ఇలా చాలా ఉన్నాయి. మరి ఈ "రావి శాస్త్రి" గారు వ్రాసిన ఈ కధ సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తోంది అనేది ప్రస్నార్ధకమే!!!!!!!!!

    ReplyDelete
    Replies
    1. *మరి ఈ "రావి శాస్త్రి" గారు వ్రాసిన ఈ కధ సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తోంది అనేది ప్రస్నార్ధకమే!*

      ముర్తిగారు మీ అభిప్రాయం తో ఏకీభవిస్తున్నాను. రా.వి.శాస్త్రిగారు ఈ కథలో సమాజం లోని అనేక పాత్రలను ప్రవేశపెట్టి పోలిసుల పాత్రను వదిలేశారు. ఎక్కడైనా గలాట/ఆందోళన జరిగితే ప్రభుత్వం తరపున హాజరయ్యేది పోలిసులే! కనుక ఈ కథ, పాఠకులను మెస్మరైజ్ చేసి, మార్క్సిజం ప్రచారానికి సాహిత్య పరంగా ఉపయోగపడే ఒక యాడ్ లాంటిది. ఇది చదివిన సామాన్య పాఠకులకు పరోక్షంగా ఇది ఇచ్చే సందేశం మార్క్సిజం ఒక గొప్ప ఆర్ధిక సిద్దాంతం.అది అమలు జరిగితే భూలోక స్వర్గం. ఇక మన గురువులు/ఆచార్యులు వేధాంతం మాటలు చెప్పి, పుస్తకాలు రాస్తూ కుచున్నారని. వారు పేద వాడి శ్రమను దోపిడి చేశారని. (కాని ఆ గురువులలో, ఆరోజుల్లో ఎన్ని సుఖాలు ఉన్నాయో, దానిని వారు ఎలా అనుభవించారో నాకు పుర్తిగా తెలియదుగానీ, నాకు తెలిసి వారికి ఉన్న నియమ నిష్ట్టల వలన చాలామంది కనీసం ఉప్పు,కారం లేకుండా తిండితినె వారు,ఏకభుక్తం , నేల మీదపండుకోవటం. చలికాలంలో కూడా చన్నీళ్ల స్నానం చేయటం మొద|| నిబందనలు ఉన్నాయి. నేను డిల్లిలో డిసెంబర్ చలిలో, ఉదయం 4గం|| చన్నీటి స్నానం చేసి, ధనుర్మాస నైవేద్యం పెట్టిన పుజారిని చూశాను. ఇటువంటి నిబంధనల గురించి ఆనాటి బ్రహ్మణులకు తెలుసు. వీటిని గురించి ఈ రోజులలో బహిరంగంగా మాట్లాడితే ఎక్కడ సనాతనులు అనుకొంటారో అని పెద్దగా మాట్లడరు). దానిని క్రింద వల్లంపాటి వెంకటసుబ్బయ గారి మాటాలలో చదివితే అర్థమౌతుంది.

      "వల్లంపాటి వెంకటసుబ్బయ్య తన 'కథాశిల్పం' లో ఈ కథని విశ్లేషిస్తూ.. 'శ్రమ దోపిడీని చిత్రించటంతో పాటు భారతీయ వేదాంతం శ్రమదోపిడీకి ఎలా సహకరించిందో, దాన్ని ఎలా ప్రోత్సాహించి, ఒక వ్యవస్థగా తయారుచేసిందో కూడా ఈ కథ సూచిస్తుంది."

      ఇక ఇతను చెప్పనిది, వేధంతం/గురువులను నమ్మిన అతి కొద్ది మంది ఇప్పటికి శ్రమను గురించి మాట్లాడేవారికన్నా సమాజానికి ఎక్కువ సేవ చేస్తున్నారు. వారిలో కంచి పరమాచార్య, సత్య సాయిబాబా, కృష్ణముర్తి మొద|| వారి ఫాలోయర్స్ / మిత్రులు అయిన సుబ్రమన్య స్వామి,టి.యన్.శేషన్, అరుణ్ షౌరి, అబ్దుల్ కలాం మొదలైన వారు ఉన్నారు. వారు దేశానికి చేసిన సేవ వెలకట్టలేనిది. ఇటువంటి వారి గురించి వల్లంపాటి గారి లాంటివారు ఏమంటారు? వారి కంట్రిబ్యుషన్ ను ఏ కేTaగిరి కింద చుస్తారు? చూడబోతే వల్లంపాటి గారు మధ్యతరగతి కి చెందిన వారు గా ఉన్నరు. ఆర్ధిక శాస్త్రం మీద అవగాహన లేనట్లుంది. కనుక పైవిధంగా వ్యాఖ్యనించారనిపించిది.

      Sri

      Delete
    2. చాలా ధన్యవాదములు. చక్కటి వివరణ ఇచ్చారు.

      Delete
    3. ఈ కథలో పోలిస్ పాత్ర ప్రవేశ పెట్టి ఉంట్టే, మొన్న యానం లో జరిగిన సంఘటన మాదిరిగా తయారౌతుంది. కథను నవల గా రాయాల్సి వచ్చి ఉండేదేమో! కాని యానం సంఘటన లో అన్ని వర్గాల వారు నష్ట్టపోయారు. సర్వనాశనం జరిగింది. అన్నిటికన్న ఆకట్టుకొన్న అంశం సామాన్య/పేద ప్రజలు(వీరిని మనం మంచి వారని అనుకొంట్టుటాము), వారు దెబ్బతిన్నవారికి సాహయం చేయటం సంగతేమో గాని, చేతికి చిక్కిన వస్తువులను ఇంటికి తీసుకు పోయారు.

      Sri

      Delete
  11. రమణ గారికి, మౌళి గారికి, అ. సౌమ్యకు
    Thanks

    ReplyDelete
  12. Excellent sir,

    మా తరంలో ఈ 'పిపీలికం' కథని చదవనివారు నాకయితే కనబడలేదు. తెలుగు సాహిత్యం మీద ఇంటరెస్ట్ ఉన్న ఇప్పటి వాళ్ళు.. ఒక వేళ ఈ కథని చదనట్లయితే.. అర్జంటుగా చదివెయ్యండి...

    Immediate gaaa chadivesthaam sir!....

    meeru maatram ilaantivi maaku chebutooo undaali mari!! Thanks a lot sir!

    ReplyDelete
  13. తను నా చెల్లెలండీ :)

    అవును ఆయన పుస్తకాలేవీ లేవుట. మళ్ళీ ప్రింట్ వేయించడానికి ఆయన పిల్లలు ఏవో తగాదాల్లో ఉన్నారుట....ఇంతేనా ఆయన సాహిత్యం ఇలా అంతమయిపోవలసినదేనా అనిపిస్తున్నాది :( ఆ పిల్లలు కొట్లాటలూ అవీ ఆపి మళ్ళీ అన్ని ప్రింట్ చేస్తే బావుందును.

    మీరు "నా దగ్గర నాలుగు కాపీలుండేవి" అని రాసారు కదా..ఆ వాక్యం చదవగానే మనసులో చిన్న ఆశ పుట్టింది :) తరువాతీ వాక్యం చదవగానే పోయిందిలెండి :D

    ReplyDelete
  14. అబ్బ ఈ టపాకు వ్యాఖ్య పెడదామని ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో. ఏమయిందో తెలియదు కానీ మీ బ్లాగు తెరవడబుతుంది గానీ అక్కడి నుంచీ ఎక్కడికీ కదలడం లేదు. ఇన్నాళ్ళకు ఈ అవకాశం కుదిరింది. మీ టపా చాలా బావుంది. ఇది చదివే వరకు రావిశాస్త్రిగారి ఈ కథ గురించి నాకు తెలియనే తెలీదు. నా దగ్గరున్న సంపుటాల్లో కూడా లేదు. మంచి కథ అనిపించింది. కథ చదవకపోయినా మీ పోస్ట్ చదివి రావిశాస్త్రిగారు ఎలా రాసి ఉంటారో వూహించేసుకున్నాను. మీ దగ్గరున్న పుస్తకంలో కొత్తవి ఏమైనా ఉంటే పరిచయం చేయండి.

    ReplyDelete
    Replies
    1. నా పిచ్చి బ్లాగుకి ఈ రోగం ఎప్పట్నుండో ఉంది.

      దీనికి నా ప్రవాస మిత్రులు మందు కనిపెట్టారు.

      నా బ్లాగు తెరుకొననిచో.. బ్రౌజర్ మార్చుకొనుడి.

      నేను కూడా అదే మందు వాడుచుంటిని.

      (ఉదా|| నాకు వనజ వనమాలి గారి బ్లాగ్ తెరుచుకోదు.)

      నా బ్లాగ్ మీరు చదవడమే నాకు ఎక్కువ.

      ఆపై.. వ్యాఖ్య పెడదామని ఎదురు చూచుటయా!

      ముగాంబో ఖుష్ హువా!

      Delete
  15. correct గా చెప్పారు సర్.
    సమాజం లో మంచివారు చెడ్డవారు అని ఎవరు లేరు
    ఉన్నదల్ల అవకాశవాదులు స్వార్థపరులు

    సామాన్య / పేద ప్రజలు మంచివారు అని అనుకోవడం కాని
    వీరిని ఎవరో దోచుకుంటున్నారు అని అనుకోవడం కాని, రెండు మన బ్రమలె

    అవకాసం రానంత వరకే ఎవరైనా మంచివాడు చెడ్డవాడు
    అవకాసం వస్తే భారత దేశమే ఒక యానం !!!!

    Ravindra

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.