Thursday 1 September 2011

పేరులోనే అంతా ఉంది


"కాలేజీకెళ్లాలంటే భయంగా వుంది. సీనియర్లు నాపేరు మీద జోకులేస్తూ టీజ్ చేస్తున్నారు." ఆ అమ్మాయి ఇంజినీరింగ్ విద్యార్ధిని, పేరు చారుమతి. కాలేజిలో సీనియర్లు పప్పుచారు, ఉలవచారు అంటూ టీజ్ చేస్తున్నార్ట.  
                   
పిల్లలకి పేరు పెట్టేముందు నచ్చిన పేరు అనేకాకుండా - ఆ పేరువల్ల భవిష్యత్తులో వారికే ఇబ్బందీ రానివిధంగా ఆలోచించాలి. అర్ధవంతమైన పేర్లు బాగానే ఉంటాయిగానీ అర్ధాలు మారిపొయ్యే ప్రమాదం ఉంది. మౌనిక ఎక్కువ మాట్లాడినా, సౌజన్య నిర్లక్ష్యంగా వున్నా, శాంతకుమారి అశాంతిగా వున్నా వారి పేర్లకి న్యాయం జరగదు. 
                    
తెలుగు సినిమాల కారణంగా ప్రజలకి సూర్యకాంతం పేరు పెట్టుకునే ధైర్యం లేకుండా పోయింది. వంగదేశం నుండి దిగుమతైన సాహిత్యం తెలుగులో బాగా పాపులరై - బెంగాలీ పేర్లు తెలుగు పేర్లుగా మారిపొయ్యాయి. కన్యాశుల్కంలో పాత్రల పేర్లన్నీ పాత్రోచితంగా వుండటం ఆ నాటకానికున్న లోపం అని కొందరు పెద్దల ఉవాచ.  

తెలుగువారి గ్రామాల్లో ఈ సమస్య లేదు. తాతల, ముత్తాతల పేర్లు ఈరోజుకీ పెడుతూనే ఉన్నారు. ఒక గ్రామదేవత పేరే ఆ ఊరందరికీ ఉంటుంది. పెద్దంకమ్మ, చిన్నంకమ్మ, పెద్దంకయ్య, చిన్నంకయ్య, బుల్లంకయ్య.. ఇట్లా అందరిళ్ళల్లో ఒకేపేరు. పుట్టేవాడు కడుపులో ఉండంగాన్లే ఫలానా దేవతకి మొక్కుబడి ఉంటుంది కాబట్టి వారికి పేచీ లేదు.  
                     
'పద్ధతు'ల్లో ఒకప్పటి కన్నా బాగా అభివృద్ధి చెందాం. అందుకే ఈమధ్య తిధీ, నక్షత్రం చూసుకుని మరీ పేర్లు పెడుతున్నారు. పేరు మొదటి అక్షరం 'ఛ'తోనో, 'ఛీ'తోనో లేదా 'క్షి'తోనో మొదలవ్వాలని తిప్పలు పడుతున్నారు. అందుకే చాలాసార్లు ఈ బాపతు 'శాస్త్రబద్దమైన' పేర్లు మనకి అర్ధం కావు. 

నామటుకు నాకు పేరు పట్టింపు లేదు. నా పిల్లలిద్దరి పేర్లు నేను పెట్టినవి కావు. ఎవరన్నా అడిగితే అద్దిరిపోయే పేరొకటి సూచిద్దామనే తీవ్రమైన ఉత్సాహం అయితే వుంది గానీ - ఇంతవరకూ ఎవరూ నన్నేదైనా పేరు సూచించమని అడిగిన పాపాన పోలేదు. అది వారి విజ్ఞత, అదృష్టం! 
                          
పుట్టబోయే తమ పిల్లలకి ఏపేరు పెట్టాలి అనేది కొందరికి జీవన్మరణ సమస్య! మీ పిల్లలకి బోల్డన్ని పేర్లంటూ పుస్తకాలు అచ్చొత్తుకుని బాగుపడ్డ రచయితలూ ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ల పుణ్యామాని ప్రసవ వేదనలు బాగా తగ్గిపోయాయి. దానికి బదులుగా ఈ నామకరణ వేదనలు పెరిగిపొయాయి.
                          
ఈమధ్య టీవీలో ఒక సూటూబూటాయన తమ పేరులోని ఒక్క అక్షరం మార్చుకుంటే దరిద్రుడు కూడా ముఖ్యమంత్రి కాగలడని బల్లగుద్ది చెబుతున్నాడు. జయలలిత పేరులో పెట్టుకున్న అదనపు 'a' పవర్ వల్లనే ఆవిడకి మహర్దశ పట్టిందనీ, తనుకూడా ఇలాగే చాలామందికి అక్షరతోకలు తగిలించి లేదా కత్తిరించి, వారిని బూర్లెగంపలోకి తన్నానని లైవ్ షోలు నిర్వహిస్తున్నాడు. ఈ అక్షర మార్పుచేర్పుల కార్యక్రమం మనకేమోగానీ, ఆయనకి మాత్రం బాగానే గిట్టుబాటవుతున్నట్లుంది.   

'నేములో నేముంది?' అన్నారు పెద్దలు. నిజంగానే ఏమీ లేదు. కాకపోతే ప్రస్తుతం తలిదండ్రులు తమ పిల్లలకి గొప్పపేరు పెడదామని ఉబలాటపడుతున్నారు. బహుశా ఎట్లాగూ వారు పెద్దయ్యాక 'గొప్పపేరు' తెచ్చుకోలేరు, అదేదో మనమే కానిద్దామనే దూరదృష్టి వల్ల కావొచ్చు! 

(picture courtesy : Google)

4 comments:

  1. బాగా రాశావ్ రమణా! నన్నడిగితే చారుమతి అనే పేరు అంత పెద్ద ప్రాబ్లమాటిక్ కాదు. ఈ గ్లోబలైజ్డ్ ప్రపంచంలో మన పేర్లు స్వంత భాషలోనే కాకుండా ఇతర భాషల్లో ఎలా ఉంటాయనేది చూసుకోవలిసి వస్తోంది. ఈ మధ్య షీలా దీక్షిత్ గారి పేరు మీద న్యుజీలండ్లో చాలా జోకులు పడి అంతర్జాతీయ కాంట్రవర్సీ అయ్యింది. విరాళ్ ఆచార్య అనే ఎన్ వై యూ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ గారు ఈ మధ్య టీ వీ లో వొచ్చారు. ఆయన్ని వైరల్ అకర్య అని సంభోదిస్తున్నాడు టీకాలు వేయించుకున్న లంగరు మనిషి.
    బి ఎస్ ఆర్

    ReplyDelete
  2. @ GIdoc, పేర్లు పలకటంలో కూడా నానావిధములుంటయ్. ఎగతాళి చెయ్యటానికి పేరు కొద్దిగా మార్చటం ఒక పద్ధతి. నా క్లాస్ మెట్టొకడు నన్ను కసిగా "వంకర్రవణ" అనేవాడు. ఐతే మా క్లాసులో ఇదే పేరుతో మరో ఏడుగురుండటం.. ఈ పిలుపుకి వాళ్ళొప్పుకోకపోవటం.. నన్ను రక్షించింది.
    పేరు పలకలేకపోవటం కూడా ఒక ఇబ్బందే! నా పేర్లోని ' ణ ' తెలుగేతరులకి నోరు తిరగదు. చాలామంది ' న ' గా పలుకుతారు. సర్జెయ్యబోతే కొత్త కొత్త ఉచ్చారణలొచ్చేవి. వాళ్ళ సమస్య అర్ధమై ' రమన ' గానే పిలిపించుకోవటం అలవాటయిపోయింది.

    ReplyDelete
  3. //ఎవరన్నా అడిగితే అద్దిరిపోయే పేరొకటి సూచిద్దామనే తీవ్రమైన ఉత్సాహం అయితే ఉంది. అయితే ఇంతవరకూ ఎవరూ (నాభార్యతో సహా) నన్ను పేరు సూచించమని అడిగిన సాహసం చెయ్యలేదు .అది వారి విజ్ఞత, అదృష్టం!//

    ఏమిటో రోజు రోజుకు దగ్గరౌతున్నాం... నన్ను నలుగురైదుగురు అడిగారు, అలాగే పేర్లు పెట్టారు కూడా. అన్ని కేసుల్లో ఒక ఏడాది గడిచేసరికి సెకండొపీనియన్ వేరేవాళ్ల దగ్గర తీసుకుని మార్చిపారేశారు. అంటే నేను కాస్త బెటరా లేకపోతే మరీ ఆర్కి టైపా... అర్థం చేసుకుందామని బాగానే ప్రయత్నించా... ముందు కాస్తంత జూట్టూడిపోయింది..

    ReplyDelete
    Replies
    1. నిస్సందేహంగా నాకన్నా మీరే బెటర్. కనీసం మిమ్మల్ని సలహా అయినా అడిగారు.

      ఎక్కువ ఆలోచించకండి.. జుట్టు పూర్తిగా ఊడిపొయ్యే ప్రమాదం ఉంది. :)

      Delete

comments will be moderated, will take sometime to appear.