Saturday 13 August 2011

భాష - పెసరట్టు



"మిత్రమా! కాఫీ, అర్జంట్." అంటూ కూర్చీలో కూలబడ్డాడు సుబ్బు.  



సుబ్బుని జాలిగా చూస్తూ -
              
"సుబ్బూ! తెలుగు మహాసభలు జరుగుతున్నయ్. పనీపాటా లేకుండా రోడ్లెంట తిరిగే బదులు ఆ సభలేవో చూసి రావచ్చుగా, కాలక్షేపం కూడా అవుతుంది." అన్నాను.   
              
"తెలుగుని ఉద్ధరించేంతగా మనం ఎదగలేదు నాయనా. అయినా మనం రక్షించేంత దుస్థితిలో తెలుగు ఉందంటావా?" ఆశ్చర్యంగా అన్నాడు సుబ్బు.  
             
"ఉందనే విజ్ఞులు అంటున్నారు." అన్నాను.     
             
"వాళ్లంతే అంటార్లే. ఇది పవిత్రమైన భగవంతుని సృష్టి. ఇక్కడ ఏదయినా సత్తా ఉంటేనే నిలబడుతుంది, లేకపోతే అంతరించిపోతుంది. ఎన్ని మీటింగులు పెట్టి ఎంత గొంతు చించుకున్నా చచ్చేదాన్ని బ్రతికించలేవు, బ్రతికేదాన్ని చంపలేవు. మనని ఉప్మాపెసరట్టు తినమని ఎవడన్నా శాసిస్తున్నాడా? అయినా రోజూ తింటూనే ఉన్నాంగదా." అన్నాడు సుబ్బు. 
              
"తెలుగు గొప్పభాష, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్." గర్వంగా అన్నాను.   
              
"నాకు ఇటలీ భాష తెలీదు. ప్రతిమనిషికి తనకంటూ ఒక భాష ఉంటుంది. దాన్నే మాతృభాషనో, పితృభాషనో అంటారు. ఫలానా భాష గొప్పదని మనమెలా నిర్ణయిస్తాం? మనం వంగదేశంలో పుడితే అప్పుడు ప్రపంచంలో బెంగాలీభాషే గొప్పభాష అని సూక్తులు చెప్పేవాళ్ళం కాదా?" అన్నాడు సుబ్బు.

"దేశభాషలందు తెలుగుభాష లెస్స అన్నారు రాయలవారు, నేను కాదు." నవ్వుతూ అన్నాను. 

ఇంతలో కాఫీ వచ్చింది. కాఫీ సిప్ చేస్తూ - 


"భాషలని తూయటానికి శ్రీక్రిష్ణదేవరాయల దగ్గరున్న కాటా ఏమిటో నాకు తెలీదు. 'ఫలానా మా భాష మీ తెలుగుభాష కన్నా లెస్సు' అన్నవాడినెప్పుడైనా చూశావా? నాకయితే ఉప్మాపెసరట్టు, కాఫీ కడుపులో పడితే కాకి అరుపు కూడా కోయిల పాటలా మధురంగా వినిపిస్తుంది." అన్నాడు సుబ్బు.   
              
"ఇట్లా మాట్లాడటానికి సిగ్గుండాలి. తమిళుల భాషాభిమానం చూసైనా బుద్ధి తెచ్చుకో." అన్నాను. 
              
"అరవ తంబిలది భాషా దురభిమానం, భాషా తాలిబానిజం. వాళ్ళే మన తెలుగువారిని చూసి పరభాషా సహనం అలవరుచుకోవాలి." 
              
"చాలించు నీ వితండవాదం, భాషావేత్తలు అమాయకులంటావా?" అన్నాను.
              
"నేనామాట అన్నానా? కాకపోతే మన బాచిగాడి బాబాయ్ లాంటి భాషోద్దారకులతోనే నాకు పేచీ. ఆయన తెలుగుభాషని రక్షించటం కోసం వ్యాసాలు రాస్తూ, ఉపన్యాసాలు చెపుతూ, తన పిల్లలకి మాత్రం శ్రద్ధగా ఇంగ్లీషు చదువులు చెప్పించి అమెరికాలో స్థిరపడేట్లుగా గట్టి కృషి చేశాడు. ప్రస్తుతం మనూళ్ళో తెలుగుభాషకి పెద్ద దిక్కు ఈయనే!" నవ్వుతూ అన్నాడు సుబ్బు.
              
"సుబ్బూ! నువ్వు నీ నెగెటివ్ ఆలోచనలు తగ్గించుకో. ఆయన తన పిల్లలకి వారికిష్టమైన చదువు చెప్పించాడనుకోవచ్చుగదా." అన్నాను.  
              
"తన పిల్లలనే ప్రభావితం చెయ్యలేనివాడు సమాజాన్ని ఎలా ఉద్దరిస్తాడు? అసలు విషయమేమంటే.. తెలుగుభాషని నెత్తికెత్తుకోవడం ఆయనకి బాగా గిట్టుబాటయ్యింది. అయినా ఆయన ప్రవచించే కృతుకమైన తెలుగుభాషంటనే నాకు చిరాకు." అన్నాడు సుబ్బు.
              
"సుబ్బూ! నువ్వు ఏ సభలకీ వెళ్ళనవసరం లేదు. తెలుగుభాష గూర్చి ఇంకొక్క మాట మాట్లాడినా నిన్ను చంపేస్తాను." నవ్వుతూ అన్నాను.
              
"ఏమిటోయ్ ఇందాకట్నించీ భాషా, గీషా అంటూ తెగ నీతులు చెపుతున్నావ్! అదేమన్నా చెరువా ఎండిపోవటానికి? ఏ భాషైనా దమ్ముంటే నిలబడుతుంది. లేకపోతే పడుకుంటుంది. తన భాషని ఉద్దరించమని బ్రిటీషోడు నిన్ను దేబిరించాడా? నీ పొట్టకూటికి ఆ భాష అవసరం కాబట్టి నేర్చుకున్నావ్. కేవలం భాషమీద ప్రేమ ఉంటే సరిపోతుందా? నీ పిల్లలిద్దర్నీ తెలుగు బియ్యేలో చేర్చు, ఉద్యోగాలు రాక ఆకలిచావులు చస్తారు." అంటూ కాఫీ తాగటం ముగించాడు. 
              
"సుబ్బూ, ఎడ్డెం అంటే తెడ్డెం అనే నీ ధోరణి మార్చుకో." అన్నాను.
              
"చూద్దాం, చివరగా ఒకమాట చెబుతా విను! వ్యవహారిక భాష అనేది సామాన్యుల నోళ్ళలో అద్భుతంగా గుబాళిస్తూనే ఉంటుంది. ఎటొచ్చీ పాషాణంలాంటి 'డుమువులు ప్రధమావిభక్తి' భాషకే పొయ్యేకాలం వచ్చింది. పోతేపోనీ, దానివల్ల ఎవరికి నష్టం? ఒకవేళ నిజంగానే తెలుగుభాష అంతరించిపోయిందనే అనుకుందాం. అప్పుడు తెలుగుకి బదులుగా వేరొక కొత్తభాష వాడుకలోకి వస్తుంది గదా. మనకేంటి నష్టం? ఆ కొత్తభాషలోనే మనం మన ఉప్మాపెసరట్టుని పిలుచుకుందాం. భాష మారినా పదార్ధం మారదు గదా." అంటూ హడావుడిగా నిష్క్రమించాడు మా సుబ్బు.     
              
గాలివాన వెలసినట్లయింది. సుబ్బు వాడిన పెసరట్టు భాషకి బుర్ర తిరిగింది. భగవంతుడా! తెలుగుభాషని మా సుబ్బువంటి బడుద్దాయిల బారి నుండి రక్షించు తండ్రీ!                             

13 comments:

  1. బాగుంది సెటైర్.

    - శ్రీను

    ReplyDelete
  2. ఇది చదివిన తర్వాత ఙాపకమొచ్చింది. ఈ సుబ్బు ని నేను చూశాను ఇంతకు ముందే ఒకరి mail inbox లో.

    ఇప్పటివరకు, నేనోదో సొంతగా రాశానను కున్నా కానీ అక్కడినుండే నేను కాపీ కొట్టానని తెలిసింది.

    ఇంతకీ సుబ్బు...ఉన్నాడా?

    ReplyDelete
  3. "...వ్యవహారిక భాష అనేది శ్రామికులు, కర్షకుల నోళ్ళలో అద్భుతంగా గుబాళిస్తూనే ఉంటుంది. ఎటొచ్చీ పాషాణం లాంటి ' డుమువులు ప్రధమావిభక్తి ' భాషకే పొయ్యేకాలం వచ్చింది..."

    చాలా బాగా చెప్పారు. భాషాసేవ అంటూ నోరు తిరగని మాటలు పుట్టించి తెలుగు భాషంటే భయపడేట్టుగా చేసే ప్రయత్నంలో కొందరున్నారు. మీ సుబ్బు చెప్పినది నిజం, నిజం.

    ReplyDelete
  4. @ Chandu S గారు, మీ కామెంటుకి ధన్యవాదాలు. సుబ్బు ఉన్నాడు.
    @ శివరామప్రసాదు కప్పగంతు గారు , మీ వ్యాఖ్యకి కృతజ్ణతలు. మీ కాంప్లిమెంట్ మా సుబ్బుకి తెలియజేస్తాను.

    ReplyDelete
  5. ఆయన తెలుగుభాషని రక్షించటం కోసం వ్యాసాలు రాస్తూ, ఉపన్యాసాలు చెపుతూ.. తన పిల్లలకి మాత్రం శ్రద్ధగా ఇంగ్లీషు చదువులు చెప్పించి.. ఇంగ్లీషు దేశాల్లో స్థిరపడేట్లుగా గట్టి కృషి చేశాడు. ప్రస్తుతం మనూళ్ళో తెలుగు భాషకి పెద్ద దిక్కు ఈయనే!____________చంపేశారు! గావు కేక పెట్టేస్తున్నా మీరు జడుసుకునేట్టు! ఇలాంటి పెద్ద మనిషులు బోల్డు మంది తెలుసు! ఒకాయన మరీ ఎక్కువగా తెలుగు భాష కోసం కృషి చేస్తూ పిల్లల్ని ఇంజనీరింగులూ వగైరాలు ఇంగ్లీష్ మీడియం లలో చదివిస్తూ అమెరికా పంపే ప్లాన్ లో ఉన్నాడు. మాట మాట్లాడితే... పాషాణం లాంటి తెలుగుని ప్రోత్సహిస్తూ, "భాష సహజంగా ఉంటే బాగుండు కదండీ" అంటే "మీ తాత పుట్టించాడా ఏంటి సహజమైన భాష" అని ఎద్దేవా చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళు! ఈ వ్యవహారమంతా ఏదో టైమ్ పాస్ లెండి!

    మొత్తానికి సుబ్బు గారు భలే చెప్పారు. మా తరఫున మరో స్ట్రాంగ్ కాఫీ ఇప్పించండి ఆయనకి

    ReplyDelete
  6. ఆయన తెలుగుభాషని రక్షించటం కోసం వ్యాసాలు రాస్తూ, ఉపన్యాసాలు చెపుతూ.. తన పిల్లలకి మాత్రం శ్రద్ధగా ఇంగ్లీషు చదువులు చెప్పించి.. ఇంగ్లీషు దేశాల్లో స్థిరపడేట్లుగా గట్టి కృషి చేశాడు. ప్రస్తుతం మనూళ్ళో తెలుగు భాషకి పెద్ద దిక్కు ఈయనే!నిజం చెప్పారు.. సారీ.. చెప్పించారు మీ సుబ్బూ చేత.. నాతరపున మరో ఉప్మా పెసరట్, స్ట్రాంగ్ కాఫీ ఇప్పించేయండి :))

    ReplyDelete
  7. @ సుజాతగారు, మీకు మా సుబ్బు సుభాషితాలు నచ్చినందుకు సంతోషం. మీ కాంప్లిమెంటుగా సుబ్బుకు ఒక కాఫీ ఇవ్వొచ్చు గానీ.. ఇంకా రెచ్చిపోతాడేమోననే భయంగా ఉంది. ఇప్పటికే నా బుర్ర తినేస్తున్నాడు. సర్లేండి! మధ్యన నేనెందుకు మీ కాఫీకి అడ్డం. రేపు వచ్చినప్పుడు ఇస్తాలేండి!

    ReplyDelete
  8. @ మురళిగారు, వ్యాఖ్య రాసినందుకు థాంక్సండి. సుజాతగారు సుబ్బుకి కాఫీ ఇవ్వమంటున్నారు. ఇప్పుడు మీరు ఉప్మా పెసరట్టు + కాఫీ అంటున్నారు. అసలే సుబ్బు స్థూలకాయుడు. వైద్య పరీక్షలు చేయిద్దామన్నా ఒప్పుకోడు. మా సుబ్బుకి డాక్టర్లంటే ఎలర్జీ కూడా. అయినా.. మీరు ఇమ్మంటున్నారు కాబట్టి ఓకే.

    ReplyDelete
  9. హి..హి..హి..అసలు నేను హ..హ..హ..అని నవ్వాలి. ఎందుకో ఏమిటో చెప్పను. చెప్పీ చెప్పకుండా భలేగా చెప్పారండీ..

    ReplyDelete
  10. జ్యోతిర్మయి గారు..
    మీ రెండో రకం నవ్వుకు అర్ధం తెలుసుకోవాలని ఉంది.
    కారణం ఎలాగూ చెప్పనన్నారు కాబట్టి..
    కామెంటినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  11. దమ్ముంటే అదే నిలబడుతుంది..హిందూ మతం కూడా ఇలాగే ...సింహాచలం చుట్టూ గిరి ప్రదక్షిణ చేసే వేల, లక్షల మంది, ని చూస్తే..నాలుగు గోడల మధ్య కూర్చుని, లలిత సహస్ర నామాలు చదువు కునే మధ్య తరగతి, చదువు కున్న వారి వల్ల కాదు..వీధి చివర వినాయకుడి బొమ్మలు పెట్టి,పండుగలు చేసే వారు, చిందులు వేసే వారు..శివ రాత్రి థర్డ్ షో ,సినిమా చూసి, గెంతులు వేసే వాళ్ళు, వీళ్ళే, మన హిందూ మతాని కి కూడా ప్రాణం పోస్తున్నారు అని నా నమ్మకం..మీరు రాసింది కూడా దీనికి దగ్గరగా ఉంది. నాకు ఒక బ్లాగ్ పోస్ట్ విషయం పోయింది అనే బాధ కన్నా.మీరు రాసిన ఈ చక్కటి బ్లాగ్ చదివి నందుకు, నాకు సంతోషం గా ఉంది.
    నాకు తెలుగు అంటే ఇష్టమే, కానీ, మా పిల్లలు నా బీరువాల్లో దాచిన తెలుగు పుస్తకాలు చదవలేరు చదవ లేరు. ఇది ఒక పచ్చి నిజం..భరించక తప్పదు..ఇంకేమి తెలుగు ఉద్ధరించడ మో?
    వసంతం.

    ReplyDelete
  12. @వసంతం గారు..
    మీరు ప్రస్తావించిన అంశాన్ని ఒప్పుకుంటున్నాను. వినాయకుడి బొమ్మలతో పాటుగా అయ్యప్ప దీక్షలు, భవాని దీక్షలు కూడా దిగువ సామాజిక వర్గాల వారిని (కూడా) హిందూ మతంలోకి ఆకర్షించటానికి, కలుపుకుపోవటానికి ఉపయోగపడుతున్నాయనీ, ఇది భవిష్యత్తులో హిందూ మతానికి మేలు చేస్తుందని ఎక్కడో చదివాను. భాషనీ, మతాన్నీ కలుపుతూ మీరు రాసిన పాయింట్ బాగుంది. ఈ విషయాన్ని చర్చిస్తూ మీరు ఒక టపా ఇప్పటికీ రాయొచ్చు!
    నా పిల్లలు నా బ్లాగు కూడా చదవలేకపోతున్నారు. ఇదీ నా దుస్థితి!
    మంచి కామెంట్ రాసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  13. సుబ్బు గారు రైటో రైటు. నిజాలు చెప్తే నిష్టూరంగానే ఉంటుందండీ.. మీరు ఆయన చేత చెప్పించిన విధానం బాగుంది ( ఇది మీ అభిప్రాయమేమో అని నాకు గట్టి నమ్మకం అండీ. నిజమేనంటారా? ).

    ReplyDelete

comments will be moderated, will take sometime to appear.